వార్తలు

ఆధునిక పద్ధతిలో నారు పెంపకంలో నూతన ఒరవడి కొనసాగిస్తున్నయువరైతు..

0

వ్యవసాయంపై ఉన్న మక్కువతో భూమిని కౌలుకు తీసుకుని నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామంలో షెడ్ నెట్ ద్వారా వివిధ రకాల ఉద్యాన మొక్కల, కూరగాయల నారు ప్లాస్టిక్ ట్రేలలో పెంచి అవసరమైన రైతులకు అందజేస్తున్నాడు యువరైతు శేఖర్ రెడ్డి. బైక్ మెకానిక్ గా పనిచేస్తే వచ్చే ఆదాయం సంతృప్తిని ఇవ్వకపోవడంతో వ్యవసాయంపై దృష్టి సారించిన శేఖర్ రెడ్డి ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ సాగులో నూతన ఒరవడి కొనసాగిస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందేందుకు మల్చింగ్ ఏర్పాటు చేసి డ్రిప్ ద్వారా ఎరువులు, నీటిని అందిస్తున్నాడు. ఎరువుల వృథా అరికట్టేందుకు లిక్విడ్ ఎరువులను డ్రిప్ ద్వారా సరఫరా చేస్తున్నాడు. ముందుగానే సేంద్రియ ఎరువులతో బొజలు చేస్తున్నాడు. దీంతో సాధారణ దిగుబడి కంటే 50 శాతం రెట్టింపు దిగుబడి లభించడంతో పాటు నాణ్యత ఉండడంతో మార్కెట్లో శేఖర్ రెడ్డి పెంచే నారుకు డిమాండ్ ఉంటోంది.
గతంలో వివిధ ప్రాంతాల నుంచి బంతి, మిరప, బజ్జీ మిర్చీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొక్కలను తెచ్చి సాగు చేశాడు. దూర ప్రాంతాలనుంచి మొక్కలు తెచ్చి సాగు చేయడంతో దూరం భారం పెరిగేది. దీంతోపాటు సమయానికి మొక్కలు అందేవికావు. దీంతో ఇతర ప్రాంతాల్లో విత్తనం మొలకెత్తించే విధానం అవలంభించాల్సిన సాంకేతిక పద్ధతులను పరిశీలించాడు. ఉద్యాన శాఖ అధికారుల సలహాలతో తన వ్యవసాయ క్షేత్రం వద్ద నాణ్యమైన విత్తనాలతో అనేక రకాల కూరగాయలు, పూల మొక్కల పెంపకం ట్రే పద్ధతిలో సాగు చేయడం మొదలుపెట్టాడు.
మొక్కల పెరుగుదలకు సమశీతోష్ణ వాతావరణంలో నారు పెంపకం కోసం ఎకరం విస్తీర్ణంలో షెడ్ నెట్ వేశాడు. కర్ణాటక నుంచి పొగాకు పిట్టు, మిక్సింగ్ వర్మి కంపోస్ట్ ను ట్రేలలో నింపి విత్తనాలు మొలకెత్తేలా చేస్తున్నాడు. కూరగాయల మొక్కలు నాలుగు ఇంచుల ఎత్తు పెరిగిన తర్వాత రైతులకు అమ్ముతూ స్వయం ఉపాధి పొందుతున్నాడు. నిత్యం 5 గురు కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాడు. కొందరు రైతులు నారు పెంపకానికి ముందస్తు ఒప్పందం చేసుకుని వెళ్తుండగా మరికొందరు రైతులు పెరిగిన నారు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. మొక్క రకాన్ని బట్టి మొక్కకు 50 నుంచి 80 పైసల చొప్పున రైతులకు అమ్ముతున్నాడు.

Leave Your Comments

పనస పండు తింటే కలిగే లాభాలు..

Previous article

వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు కొత్త మార్గాలు ..

Next article

You may also like