వార్తలు

“ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్” గా ఎంపికైన హైదరాబాద్ నగరంలో పచ్చదనం..

0

“ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్”గా ఎంపికైన హైదరాబాద్ నగరంలో పచ్చదనం మరింత పరుచుకోనున్నది. ఇప్పటికే కోట్లాది మొక్కలకు ప్రాణంపోసిన నగరవాసులు మరో కోటిన్నర మొక్కలు నాటి స్వచ్ఛమైన గాలితో కొత్త ఊపిరి తీసుకోనున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం 7వ విడుత కార్యక్రమానికి జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం సిద్ధమవుతున్నది. మొక్కల పెంపకంలో విశ్వవ్యాప్తంగా ఖ్యాతి పొందిన భాగ్యనగరంలో కోటిన్నరకు పైగా మొక్కలు నాటాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో కొత్తగా 600నర్సరీలను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే పనులను ప్రారంభించగా తొలకరి జల్లులు కురిసేలోపే మొక్కలు అందుబాటులోకి వచ్చేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రధానంగా ఆయుర్వేద మొక్కలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లో పచ్చదనం పెంపొందించడం, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు, ఉష్ణోగ్రతలు, కాలుష్యాన్ని తగ్గించేందుకు చేప్పట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇప్పటికే 2,76,97,967 మొక్కలు నాటిన అధికారులు రాబోయే రోజుల్లో గ్రీన్ హైదరాబాద్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా కొత్తగా 600 నర్సరీలను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం నిర్ణయించింది. ఎల్బీనగర్ , ఛార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో ఒక్కోజోన్ కు 100నర్సరీల చొప్పున ఆఫీసుల్లోని ఖాళీ స్థలాలను ఎంపిక చేసి ఇందులో దాదాపు రూ.6 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారు.
వచ్చే వర్షాకాలం తొలకరి జల్లులు కురిసే నాటికి జోన్ కు 100నర్సరీలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారులు నర్సరీల ఏర్పాటుకు ఇటీవల శ్రీకారం చుట్టారు. ఎక్కువగా కాలనీ పార్కులను ఎంపిక చేశారు. 600నర్సరీల్లో కలిపి కోటిన్నరకు పైగా మొక్కలను సిద్ధం చేయాలని నిర్ణయించగా ఒక్కోజోన్ పరిధిలోని 100నర్సరీల్లో 25లక్షల మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో సుమారు 30లక్షలకు పైగా చిన్న బ్యాగ్ మొక్కలను సిద్ధం చేస్తున్నారు. నాటిన మూడు, నాలుగు నెలల్లో ఈ మొక్కలు ఏపుగా పెరగనున్నాయి. కార్యాలయాలు, విశ్వ విద్యాలయాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున ఈ మొక్కలను నాటేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు ఇంటి పరిసరాలు, బాల్కనీలలో ఏర్పాటు చేసుకునేలా మొక్కలను సిద్ధం చేసి స్థానికులకు హరితహారం కింద పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు రోడ్ల వెంబడి నాటే మొక్కలు, ఫ్లై ఓవర్లకు వర్టికల్ గార్డెన్ లకు వీలుగా పెంచనున్నారు. ఆయుర్వేద మొక్కలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కడికక్కడ నర్సరీల ఏర్పాటు ద్వారా ఆయా పార్కులలో అవసరమైన మొక్కలను నాటడం, నిర్దేశిత వ్యవధిలో స్థానికులకు అందజేయవచ్చుననే ఉద్దేశంతో ఈ నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు.

Leave Your Comments

మెంతికూర ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

కరీంనగర్ యువరైతు మల్లికార్జున్ రెడ్డి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) అవార్డుకు ఎంపిక..

Next article

You may also like