వార్తలు

కందులకు సరైన ధరలు లేక రైతుల ఆందోళన..

0

కందుల కొనుగోళ్ల ధరల్లో వ్యత్యాసంతో పాటు తూకంలో ప్రైవేటు వ్యాపారులు కొర్రీలు పెడుతుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కంది కొనుగోళ్లకు సంబంధించి ఫిబ్రవరి రెండో వారం ముగిసినప్పటికీ .. కొనుగోలు కేంద్రాలు మాత్రం ఇంకా ఏర్పాటుకాలేదు. వాస్తవానికి జనవరిలోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పిన మార్క్ఫెడ్ శాఖ, ఆ తరువాత ఫిబ్రవరి మొదటివారంలో కొనుగోళ్లు జరుపుతామని చెప్పింది. అయితే ప్రస్తుతం ఫిబ్రవరి రెండో వారం ముగిసినప్పటికీ కొనుగోళ్లు ప్రారంభం కాకపోగా, అసలు వాటి ఏర్పాట్లు కూడా చేయకపోవడం గమనార్హం.
గత సీజన్ తో పోల్చుకుంటే ఈ సారి సీజన్ లో కంది పంట విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్టేట్ పూల్ లో కొనుగోలు జరిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కంది కొనుగోళ్ల కు సంబంధించి నాఫెడ్ తక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుండడంతో పర్యటనపై బొంబాయికి వెళ్లిన శాఖ ఛైర్మన్ నాఫెడ్ ప్రతినిధులతో చర్చించిన నేపథ్యంలో సుమారు 2 లక్షల టన్నుల వరకు కందుల కొనుగోళ్లకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కందులు మార్కెట్ కు వస్తున్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించని అంశంపై ఓ అధికారిని సంప్రదించగా ప్రభుత్వ ధర కంటే ప్రైవేటు వ్యాపారులే ఎక్కువగా ధర ఇస్తున్నారని తెలిపారు. అయితే అన్నిచోట్లా ఇదే పరిస్థితి లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో కంది పంట పండుతున్నప్పటికీ ధర విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం బయట మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు రూ. 6 వేలకు పైగా కొనుగోలు జరుపుతున్నారని చెబుతున్నా .. తూకంలో కొర్రీలు పెడుతున్నట్టు తెలుస్తోంది. కంది రకాలను బట్టి కూడా ధరల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. కొలంబో, మన కందులకు వేరు, వేరు ధరలు పలుకుతున్నాయి.
ఒకవైపు సీఎం స్టేట్ పూల్ లో కొనేందుకు అనుమతి, మరోవైపు నాఫెడ్ కూడా కొనుగోళ్లకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ మార్క్ ఫెడ్ శాఖ కంది కొనుగోళ్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం గా వ్యవహారిస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 11 లక్షల ఎకరాల్లో కంది పంట సాగవగా దీనికి సంబంధించి సుమారు 7 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే అంచనాలు వేసి , ఏర్పాట్లు చేస్తున్నామని మాటల్లో చెప్పినంత హడావిడి చేతల్లో లేదని శాఖ వ్యవహారంతో తెలుస్తోంది. ఈసారి క్వింటాల్ కు రూ. 6 వేలు ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు కూడా సంతోషించినప్పటికీ, ఇంకా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరిలో నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ మార్కెట్లకు వచ్చిన కందుల ధరలను పరిశీలిస్తే .. ఖమ్మంలో 17న 6,400 ధర రాగా, ఈ ధర అందరికి రావడంలేదని రైతులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే నిజామాబాద్ లో 12వ తేదీన రూ.6,366 ధర పలకగా, 16న రూ.5,701, 17వ తేదీన రూ.5,609గా ధర వుంది. పెరగాల్సిన ధర తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ మార్కెట్ లో 17న రూ. 6,362 ధర పలకగా ఇక్కడ కనిష్ట ధర రూ.4,902గా ఉంది. మూడు మార్కెట్ల లో ఇంత వ్యత్యాసాలు ఉండగా, క్షేత్రస్థాయిలో పంటను విక్రయించుకునే సమయంలో తూకం, నాణ్యతా కొర్రీలు కూడా ప్రధాన సమస్యగా ఉన్నాయని రైతులు తెలుపుతున్నారు. ప్రస్తుతం శాఖ వ్యవహారం చూస్తుంటే వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా ఉందంటూ ఆరోపిస్తున్నారు రైతులు. ఇప్పటికే పంటచేతికి వచ్చి మార్కెట్ వెళ్తున్న రైతులకు సరైన ధర రాకపోగా, నాణ్యతా ప్రమాణాలతో ధరలో ప్రైవేటు వ్యాపారులు మరికొంత కోతపెడుతున్నారని రైతులు వాపోతున్నారు. గతంలో లాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి కొనుగోళ్లు చేపడుతామని చెప్పిన శాఖ ఇంకా వీటిపై స్పష్టత ఇవ్వకపోవడంతో నష్టపోవాల్సి వస్తోందని రైతులు అంటున్నారు.

Leave Your Comments

అమ్మ చెప్పిందని సేంద్రియ వ్యవసాయం చేస్తున్న యోగానంద్

Previous article

బీట్ రూట్ ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like