వార్తలు

బీన్స్ సాగు లాభదాయకం..

0

రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలను ఎంచుకుంటున్నారు. పప్పు దినుసుల కోవకు చెందిన బీన్స్ పంటను సాగు చేస్తున్నారు. కామారెడ్డి, సిద్ధిపేట ప్రాంతాల్లోనే పండించే ఈ పంటను జిల్లాలోనే మొదటి సారిగా పండిస్తూ మిగతా ప్రాంత రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బోథ్ మండలం మర్లపల్లి, బోథ్, కుచులాపూర్, ధన్నూర్, అందూర్, పిప్పల ధరి, నక్కలవాడ గ్రామాల్లో రైతులు యాసంగిలో ఆరుతడి ఆటగా బీన్స్ 200 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. బిస్కెట్, పౌష్టికాహారం తయారీలో వీటిని వినియోగిస్తుండడంతో మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. 90 రోజుల వ్యవధిలోనే పంట చేతికి వస్తుంది. ఎకరాకు 30 కిలోల విత్తనాల కోసం రూ.2500, యూరియా, డీఏపీ ఎరువు, కలుపు మొక్కల నివారణ, పురుగుల మందు పిచికారీ, కోతలు, నూర్పిడి కోసం రూ. 8 వేల నుంచి రూ.10 వేల వరకు మాత్రమే పెట్టుబడి రూపేణా ఖర్చవుతుంది. పంట దిగుబడి ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు వస్తుంది. మార్కెట్ లో ధర క్వింటాల్ కు రూ. 6500 నుంచి రూ. 8 వేల వరకు పలుకుతుండడంతో ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. సరాసరి ఎకరాకు రూ. 50 వేల వరకు మిగులుతుండడంతో సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచుతున్నారు. గత ఏడాది ఒకరిద్దరు రైతులు మాత్రమే ఈ పంట వేయగా, ఈ ఏడాది మాత్రం వంద మందికి పైగా బీన్స్ సాగు చేస్తున్నారు. మిగతా పంటలతో పోల్చుకుంటే బీన్స్ కోతులు, అడవి పందుల బెడద లేకపోవడంతో సాగు చేస్తున్న రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రభుత్వం సూచిస్తున్న మాదిరిగా పప్పు దినుసుల పంటలో ఓ రకమైన బీన్స్ సాగు చేసుకుంటూ లాభాలు గడిస్తున్నారు. మిగతా రైతులు ఈ పంటను యాసంగి కింద సాగు చేస్తే మంచి లాభాదాయకంగా ఉంటుందని సూచిస్తున్నారు.

దిగుబడి:

ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. గత ఏడాది రెండెకరాల్లో పంట సాగు చేయగా 20 క్వింటాళ్ల వరకు పండింది. పెట్టుబడి పోనూ రూ. లక్ష వరకు మిగిలింది. ప్రధానంగా ఈ పంటకు కోతులు, అడవి పందుల బెడద లేదు. శనగ, జొన్న, గోధుమ వంటి పంటలు వేసుకుంటే కాపలా కోసం రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తుండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. గత ఏడాది పండిన పంట నుంచి నాణ్యమైన గింజలు సేకరించి విత్తనాలుగా ఉపయోగించుకున్నారు.

Leave Your Comments

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు..

Previous article

ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులకు, పొలానికి చేర్చేందుకు..అగ్రి హబ్- పిజెటిఎస్ఎయు ఉపకులపతి ప్రవీణ్ రావు

Next article

You may also like