మనదేశం నుంచి మిరపపంటను ఎగుమతులు చేయుటకు రైతులు వివిధ రకాలు అయిన అవరోధాలు అనగా కాయలఫై పురుగుమందు అవశేషాలు అఫ్లోటాక్సిన్ సమస్యలను ఎదుర్కొంటున్నారు, కావున ఈ సమస్యలను అధిగమించి, విదేశి మార్కెట్ లో మంచి గిరాకీ పెంచుటకు మిరపకోత అనంతరం పంట నిల్వలో రైతులు చేపట్టవలసిన జాగ్రత్తలు.
మిరప కోత అనంతరం నిల్వ చేయు విధానం:
పూర్తిగా ఎoడిన మిరపకాయలను నిల్వ చేయటానికి తేమ లేనటువంటి, పొడి గోనె సంచులను ఉపయోగించాలి . ఎండు మిరప కాయలను గోనె సంచులలో నింపేటప్పుడు కాయలఫై నీరు చల్లకూడదు. మిరపకాయలను నిల్వ చేసిన బస్తాలకు తేమ తగలకుండా అడుగున చాపలు లేదా వరిపొట్టు, కర్ర చెక్కలు లాంటివి పరచాలి మరియు బస్తాల లాటుకు గోడలకు మధ్య 50-60 సెం.మీ దూరం ఉండేలా చూడాలి. అవకాశంఉన్న చోట శీతలీకరణ గిడ్డంగులలో నిల్వ చేస్తే కాయలు 8-10 నెలల వరకు రంగు, నాణ్యత కోల్పోకుండా ఉంటాయి. కాయలు మంచి రంగు రావడానికి నిషేదిత కృత్రిమ రంగులను వాడరాదు. కాయలు నిల్వచేసిన ప్రాంతానికి పురుగులు, ఎలుకలు నిల్వచేసిన ప్రదేశం దరిదాపులకు రాకుడదు. నిల్వచేసిన మిరపకాయలను అప్పుడప్పుడు ఎండబెడుతూ ఉండాలి.
అఫ్లోటాక్సిన్ సోకడానికి గల కారాణాలు:
తేమ అధికంగా ఉన్న పరిస్థితుల్లో మిరపకాయ, మిరప పొడిలో ఆస్పర్జిల్లస్ అనే శిలీoద్రం అభివృద్దిచెంది అప్లోటాక్సిన్ అనే పదార్ధాన్ని విడుదల చేస్తుంది. ఈ విషపదార్దం వల్ల కాలేయ సంబంధిత క్యాన్సర్ వ్యాధి సోకుతుంది అందువల్ల మిరప ఉత్పతుల్లో అప్లోటాక్సిన్ విషపదార్ధాలు కలిగి ఉన్నట్లుతేలిన సందర్బాల్లో వాటిని ఇతర దేశాలు దిగుమతి చేసుకోవు.
అఫ్లోటాక్సిన్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు:
మిరప కాయలను కోయగానే ఆరోగ్యవంతమైన కాయల నుంచి తెగులు ఆశించిన, తాలువంటి, సరిగా తయారు కాని కాయల్నిముందుగానే జాగ్రత్తగా వేరుచేయాలి. కళ్ళాల్లో ఆరబెట్టిన కాయలు రాత్రివేళల్లో మంచు బారిన పడకుండా టర్ఫాలిన్ పట్టాలతో కప్పాలి. మిరప కాయలను 10-11 శాతం తేమ వచ్చేవరకు ఆరబెట్టాలి. కాయల్లో తేమ ఎక్కువగా వుంటే అప్లోటాక్సిన్ వృద్ది చెందే అవకాశం కలదు. ఏ కోతకి ఆకోత కాయలను వేరుచేసి నిల్వచేసుకోవాలి. గొనే సంచుల్లో నింపడానికి ముందు మిరప కాయల పై నీళ్ళు చల్ల రాదు. బాగా ఎండిన కాయలను మాత్రమే పొడి చేసి తేమ పీల్చని ప్లాస్టిక్ లేదా గాజు సీసాల్లోనే భద్రపరచాలి. అవసరంకి మించి పంటకు నీటి తడులు ఇవ్వరాదు. మిరప పంటపై కాయకుళ్లు, కాయతోలుచు పురుగులను సమర్థవతంగా అరికట్టక పోయిన అప్లోటాక్సిన్ సోకే ప్రమాదం ఉంది.
పురుగు మందుల అవశేషాలు:
మిరప అధిక దిగుబడి సాధించాలనే లక్ష్యంతో రైతులు ఎక్కువగా నత్రజని ఆధారిత రసాయన ఎరువులను వేస్తున్నారు తద్వారా, పంటకు వచ్చే తెగుళ్ళు, పురుగుల ఉధృతిని నివారించడానికి 20-25 సార్లు చీడపీడల మందులు పిచికారి చేస్తున్నారు. మోతాదుకు మించి పురుగు మందులు అనేక సార్లు పిచికారి చేయడం వల్ల పచ్చిమిరప, ఎండుమిరప కాయల్లో పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయి. విదేశీమార్కెట్ లో కొన్ని రకాల పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు తేలితే ఎగుమతులు నిషేధిస్తారు కనుక అనవసరంగాఎక్కువ సార్లు పురుగు మందులు పిచికారి చేయరాదు. కావున మిరప రైతులు ఈ సలహాలు, సూచనలు పాటించి పురుగు మందు అవశేషాలులేని నాణ్యమైన దిగుబడులు సాధించగలరు.