Trichoderma: నేల అనేది ప్రధానంగా మొక్క ఆరోగ్యంగా పెరిగే విధంగా పోషకాలను, ఆవాసం ఏర్పరచుకోవడానికి ప్రధానమైన ప్రకృతి వనరుగా భావించవచ్చు. రైతుసోదరులు సాగు చేసే వివిధ పంటలలో నేలలోని కొన్ని జాతుల శిలీంధ్రాలు ప్రధానంగా పిథియం, ఫైటాప్‌తేరా, రైజోక్టోనియా, స్ల్కీరోషియం ఫ్యూజేరియం మరియు వర్టిసీలియం వంటిని నేలలోపల, నెలపై పొరలల్లోఉండి మొక్కలకు ఆశించి మొక్కలకు ఆశించి నష్టాన్ని కలుగచేస్తాయి. ఈ నేల ద్వారం సంక్రమించే తెగుళ్ళ నుండి సాగు చేసే పంటలను కాపాడటానికి జీవశిలీంధ్రనాశిని మరియు జీవనియంత్రణికారిగా ట్రైకోడెర్మాను వాడడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో కొంత మేర సఫలీకృతం కావచ్చు.
Also Read: Smallpox in Goats: మేకలలో వచ్చే మశూచి వ్యాధి/ పాక్స్/బొబ్బ రోగం.!
ట్రైకోడెర్మాను వ్యవసాయంలో జీవనియంత్రణకారిగా (జీవశిలీంద్రనాశినిగాను) జీవనఎరువుగా (భూసారాన్ని కరిగించే శిలీంధ్రం) గా వినియోగిస్తారు. పారిశ్రామికంగా టైకోడెర్మాను వినియోగించి వివిధ రకాల ఎంజైములను (దోహదక ద్రవ్యాలను) వాడుతున్నారు . ట్రైకోడెర్మా పెరుగుదలకు చాలా తక్కువ మోతాదులో పోషకాలు అవసరం. ట్రైకోడెర్మా శిలీంధము జీవకణ కవచంలోని పదార్థాలైనటువంటి సెల్యూలోస్, పెక్టిన్ వినియోగించుకొని జీవనాన్ని గడుపుతాయి.
అననుకూల పరిస్థితుల్లో కొనిడీయా (సూక్ష్మసిద్ధ బీజాశయాలు) అనబడే సప్తబీజాణువులను నేలలో సమృద్ధిగా ఉత్పత్తి చేసుకొని గడ్డు పరిస్థితులను దాటుతాయి.
వాతావరనాణుకూలత సమయాల్లో కొనీడియం శిలీంధ్రంగా పూర్తిగా వృద్ధి చెందుతాయి. ట్రైకోడెర్మా నెలలో విడుదల చేసే వివిధ రకాల జీవన రసాయనాల ద్వారా మొక్కలకు ఆశించి నష్ట పరిచే వినిధ శిలీంధ్రాలను పెరగకుండా నిరోధిస్తాయి.
ట్రైకోడెర్మా అనేది శక్తివంతమైన సెడిరోఫోర్స్‌ను కలిగి ఉండటం ద్వారా నేలలోని చిలేట్ రూపంలోని పేరన్‌ను వ్యాధికారక శిలీంధ్రాలకు అందుబాటులోకి రాకుండా వేగవంతంగా గ్రహించును. రకాల జాతులను కలిగి ఉంటుంది.
ఉదా: ట్రైకోడెర్మా విరిడె, ట్రైకోడెర్మా విరెన్స్, ట్రైకోడెర్మా హర్జియానమ్
పంటలలో ట్రైకోడెర్మాను వాడడం ద్వారా కలిగే లాభాలు:
. నేల యొక్క భౌతిక లక్షణాలు వృద్ధి చెంది నేల సారవంతము వృద్ధి చెందును.
. రసాయన శిలీంధ్రనాశనుల వినియోగము తగ్గి నేల ఆరోగ్యం కాపాడడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది.
. నేెలలోఉన్న కరగని భాస్వరాన్ని కరిగే విధంగా చేస్తుంది.
. సేంద్రియ వ్యవసాయ సాగులో, తెగుళ్ళ నిర్మూలనలో కీలకపాత్ర వహిస్తుంది.
. ఇది అన్ని రకాల వాతావరణాలలో, నేలల్లో పెరిగి పర్యావరణహితంగా మొక్కల పెరుగుదలకు తోడ్పడే మిత్ర శిలీంధ్రము.
. పంటల సాగులో దీన్ని విత్తనశుదికి, నేల, వేరు వ్యవస్థలో వాడుటకు అనుకూలంగా ఉంటుంది.
. అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చును.
. తెగుళ్ళను కలుగచేసే ఇతర శిలీంధ్రాల యొక్క కవచాన్ని బలహీన పరచి కరిగించే దోహక ద్రవ్యాలను ట్రైకోడెర్మా ఉత్పత్తి చేసి తద్వారా తెగుళ్ళను వ్యాప్తి చేసే శిలీంధ్రం యొక్క కణములోకి ప్రవేశించి వాటిలోని పదార్థాన్ని ఆహారంగా భుజిస్తాయి.
. మొక్క యొక్క వేరు ఉపరితలంపైన సహనివాసం ఏర్పరచుకొని మొక్క యొక్క జీవన క్రియలకు తోడ్పడుతుంది.
. మొక్కలలో తెగులు కారక జీవుల పట్ల మొక్క శారీరక నిరోధకతను పెంపొందిస్తుంది.
ట్రైకోడెర్మా పంటలలో వాడకం:
విత్తన శుద్ధి : 5 గ్రాముల ట్రైకోడెర్మా పొడిని 10 మి.లీ. గంజి ద్రావణి లేదా చిక్కటి పంచదార/ బెల్లం నీళ్ళలో కలపి ఒక కిలో విత్తనానికి
పట్టించి ఆరబెట్టి విత్తుకోవాలి.
నారు శుద్ధి చేయడం: కూరగాయల పంటల్లో నారుకుళ్ళు, కాండం కుళ్ళు, వేరుకుళ్ళు నివారించుటకు లీటరు నీటికి 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని కలిపి నర్సరీ బెడ్స్ మీదుగా విత్తే ముందు బాగా తడపాలి. (లేదా) 50 గ్రాముల ట్రైకోడెర్మాను 10 లీటర్ల నీటిలో కలిపి అందులో నారు వేర్ల్లను ముంచి 10 – 20 నిముషాల తర్వాత నాటుకోవాలి.
పొలంలో వేయడం:
పత్తి, పసుపు, అల్లం, కంది, వేరుశనగ, టమాట, వంకాయ, మిరప, ఉల్లి, అరటి మరియు ఇతర పంటలలో నేలల ద్వారా వ్యాప్తి చెందే ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగుళ్ళళ్ళను సమర్థవంతంగా నివారించుటకు 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి కల్చర్‌ను 90 కిలోల బాగా కుళ్ళిన పశువుల ఎరువు మరియు 10 కిలోల వేపపిండితో కలిపి 10 నుండి 15 రోజుల పాటు నీడలో అభివృద్ధి పరచి తగినంత తేమ ఉన్నప్పుడు పొలంలో వేసి కలియదున్నాలి.
(లేదా)
250 గ్రాముల ట్రైకోడెర్మాను 100 కిలోల పశువుల ఎరువుతో కలిపి, రోజూ కొంచెం నీళ్ళతో తడుపుతూ 10 నుంచి 15 రోజుల వరకు నీడలోఉంచి తర్వాత ఒక ఎకరం పొలంలో వెదజల్ల కలియదున్నాలి.
ట్రైకోడెర్మా నివారించే తెగుళ్ళు:
వరి: పాముపొడ, పొట్టకుళ్ళు, గోధుమ మచ్చ తెగులు
పత్తి: వేరుకుళ్ళు, నారుకుళ్ళు, ఎండు తెగులు
మిరప: నారుకుళ్ళు, ఎండు తెగుళ్ళు
పప్పుధాన్య పంట: వేరుకుళ్ళు
వెరుసెనగ: కాండం కాయకుళ్ళు, మొదలు, ఎండువేరు కుళ్ళు
పసుపు: ఆకుమచ్చ, దుంపకుళ్ళు
అరటి: పనామ ఎందుతెగులు
నిమ్మ జాతి: బంకనారు, ఎండువేరు కుళ్ళు, గానోడెర్మా వేరుకుళ్ళు
పొద్దు తిరుగుడు: నలుపు వేరుకుళ్ళు
ఆముదంలో: వేరు కుళ్ళు, కొమ్ము ఎండు తెగుళ్ళు
ఈ విధంగా వివిధ పంటలలో ట్రైైకోడెర్మాను వినిగించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడటంలో జీవ సంజీవనిగా వాడటం ద్వారా నేల సారవంతాన్ని కాపాడుకోవచ్చు.
ఎ. ఉమారాజశేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, వ్యవసాయ సూక్ష్మ జీవ శాస్త్రం, జీవ ఇంధన విభాగం, ఫోన్ : 9505481876
డా. కె. రాజేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, వ్యవసాయ కళాశాల, సిరిసిల్ల
డా. జి. కుమార స్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్, వ్యవసాయ కళాశాల, సిరిసిల్ల
డా.ఎమ్.సంపత్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, వ్యవసాయ కళాశాల, సిరిసిల్ల
కె. భవ్య శ్రీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, వ్యవసాయ కళాశాల, సిరిసిల్ల
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాగా రాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం
Also Read: Betel Nut Farming: అధునాతన పద్ధతులలో వక్కసాగు.!