Dhanuka Agritech: ఎరువులు, పురుగుమందులు, నీటివనరుల సమర్థ యాజమాన్యంతోనే వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సవాళ్లని ఎదుర్కోగలమని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు అభిప్రాయపడ్డారు. హరితవిప్లవం, తర్వాత అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీల వల్ల నేడు ఆహార ఉత్పత్తి ఉత్పాదకతల్లో స్వయంసమృద్ధి సాధించగలిగామని అన్నారు. అయితే ఆ టెక్నాలజీల దుర్వినియోగం వల్ల తలెత్తుతున్న దుష్ ప్రభావాలకి టెక్నాలజీలని తప్పుబట్టకూడదని ప్రవీణ్ రావు అన్నారు. వర్సిటీ పరిపాలనా భవనంలో న్యూఢిల్లీకి చెందిన ధనూకా అగ్రిటెక్ లిమిటెడ్, పిజెడిఎన్ఏయు మధ్య శనివారం అవగాహనా ఒప్పందం కార్యక్రమం జరిగింది. ప్రవీణ్ రావు సమక్షంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్ కుమార్ ధనూకా అగ్రిటెక్ లిమిటెడ్ నేషనల్ సేల్స్ హెడ్ అభి షేక్ ధనూకా అవగా హనా ఒప్పందాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. రైతాంగం ఆదాయం రెట్టింప వడానికి, విద్యార్థులు, ఫాకల్టీ అధునాతన టెక్నాలజీలని అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు పరస్పరం అవగాహనతో కలిసి పనిచేయవలసిన అవసరముందని ప్రవీణ్ రావు అన్నారు.
తమ వర్సిటీ అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలైన ఐఆర్ఆర్, కార్నెల్ యూనివర్సిటీ, టఫె, టెక్ మహీంద్రా వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని ముందు కెళుతుందని ప్రవీణ్ రావు అన్నారు. డ్రోన్ టెక్నాలజీ ప్రయోగాల్లో వర్సిటీ దేశంలో అన్ని వర్సిటీల కంటే ముందున్నదని ప్రవీణ్ రావు వివరించారు. ఈ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా అనేక అంశాలపై సదస్సులు, మేధోమధన సదస్సులు, పరిశోధనలు కొనసా గించడానికి వీలవుతుందని ప్రవీణ్ రావు తెలిపారు. అదేవిధంగా ప్రతిభ కనపర్చిన విద్యార్థుల్ని స్పాన్సర్ చేయడానికి, స్కాలర్షిప్లు అందించడానికి తోడ్పడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వర్సిటీ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ డాక్టర్ బి.జమునారాణితో పాటు యూనివర్సిటీ అదికారులు, ధనూకా అగ్రిటెక్ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు.