Terrace Gardening: ఆకుకూరలలో అన్ని రకాలు వేసుకోవచ్చు. మెంతికూర, కొత్తిమీర లాంటి వాటిని షేడ్ కింద ఉంచి పెంచాలి. కూరగాయలలో క్యాబేజీ, కాలీఫ్లవర్, లాంటి వాటిని ఇప్పుడు విత్తుకోకూడదు. మిగిలిన అన్ని రకాల కూరగాయల విత్తనాలను విత్తుకోవచ్చు. చెట్టు చిక్కుడు కూడా ఇప్పుడు విత్తుకోవచ్చు. తీగ జాతి కూరగాయలలో కూడా అన్ని రకాలు పెట్టుకోవచ్చు. ఒక చిక్కుడు మాత్రం ఇప్పుడు విత్తుకోకూడదు. ఈకాలంలో (ఎండాకాలంలో) విత్తనాలు విత్తుకున్న తర్వాత అవి పెరుగుతున్నప్పుడు ఏమేమి ఫర్టిలైజర్స్ ఇవ్వవచ్చు తెలుసుకుందాం.
ఎండాకాలంలో మట్టి మిశ్రమానికి ఎండ నేరుగా తగలకుండా, తేమ ఆరిపోకుండా ఉండాలంటే మట్టికి ఆచ్ఛాదన కల్పించాలి. ఆ ఆచ్ఛాదన చాలా రకాలుగా చేయవచ్చు. ఎండుగడ్డి, చెక్క ముక్కలు, వరిపొట్టు, చెక్క పొట్టు, ఎండిన ఆకులు, సన్నని కొమ్మలు, కొబ్బరి పీచు, వాడిన పూలు, మెన్యూర్స్, కంపోస్టు ఇలా ఏది అందుబాటులో ఉంటే అది చేయవచ్చు. కానీ త్వరగా కంపోస్టుగా మారే రకాన్ని ఎంచుకుంటే, మొక్కలకు ఆ కంపోస్టు వలన శక్తి అందుతుంది. మట్టి కూడా ఎండకు గట్టిగా మారకుండా గుల్లగా ఉంటుంది. మల్చింగ్‌గా మెన్యూర్స్, కంపోస్టును వాడటం వలన మొక్కలకు ఎండాకాలం మొత్తం వాటిని వాడనవసరం లేదు. లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాడుకుంటే సరిపోతుంది.
మల్చింగ్‌గా ఏమేమి రకాల కంపోస్టులు, మెన్యూర్స్ వేసుకోవాలి అనే సందేహం వస్తుంది. పశువుల, ఆవుల ఎరువు, వర్మీ కంపోస్టు వేసుకోవచ్చు. మేకల, గొర్రెల ఎరువులు వేయకూడదు. వాటి నుంచి వచ్చే వేడి వలన మొక్కలు చనిపోతాయి. ఎండాకాలంలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాడుకుంటే మొక్కలకు ఎండ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎండను తట్టుకొనే శక్తి వస్తుంది. రోజు మార్చి రోజు ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకు స్ప్రే చేయాలి. మట్టిలో కూడా పోయవచ్చు. మట్టిలో పోయడం వలన వానపాములు పెరిగి మట్టిని గుల్లగా ఉంచుతాయి. వేర్లకు ఆహారం అందడం వలన మొక్క బలంగా ఉంటుంది.
లిక్విడ్ ఫర్టిలైజర్స్ వలన తక్షణ శక్తి అందుతుంది. (మనకు కూడా ఎండలో నుంచి రాగానే నిమ్మకాయ నీళ్ళు, పల్చటి మజ్జిగ లాంటివి తాగడం వలన ఎంతో ఉపశమనం కలుగుతుంది కదా. మొక్కలకు కూడా అంతే) లిక్విడ్ ఫర్టిలైజర్స్ టానిక్ లాంటివి మొక్కలకు. మట్టిలో పోయడమే కాకుండా సాయంత్రం పూట అంటే చల్లబడిన తర్వాత స్ప్రే చేసినట్లైతే ఆకులకు వెంటనే శక్తి అందుతుంది.
లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవి వాడుకోవాలి, అవి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం…..
లిక్విడ్ ఫర్టిలైజర్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఒరిజినల్ వేస్ట్ డీ కంపోజర్, జీవామృతం, కిచెన్ వేస్ట్ వాటర్ (పప్పులు, బియ్యం, కూరగాయలు కడిగిన నీళ్ళు), కంపోస్టు టీ, బయో ఎంజైమ్ మొదలయినవి లిక్విడ్ ఫర్టిలైజర్స్. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్‌ను ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం.
ఒరిజనల్ వేస్ట్ డీ కంపోజర్ తయారు చేయు విధానం, ఉపయోగాలు:
దీనిని డా. క్రిషన్ చందర్ గారు తయారు చేసారు. ఇది ద్రవ రూపంలో ఉంటుంది. 200 లీ. నీటిలో 2 కిలోల బెల్లం మెత్తగా చేసి కలపాలి. ఒరిజినల్ వేస్ట్ డీ కంపోజర్ లిక్విడ్‌ను బెల్లం కలిపిన 200 లీ. నీటిలో కలపాలి. దీనిని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సవ్యదిశలో రెండు మూడు నిముషాలు కలపాలి. రెండు పూటలా కలపడం కుదరని పక్షంలో ఒకసారి అయినా కలపాలి. ఐదు రోజులలో ఒరిజినల్ వేస్ట్ డీ కంపోజర్ ద్రావణం తయారవుతుంది. ఒరిజినల్ వేస్ట్ డీ కంపోజర్‌లో మొక్కలకు అవసరం అయిన అన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. బెల్లం కలపడం వలన దానిలోని సూక్ష్మ జీవులు బెల్లంను ఆహారంగా తీసుకుని వృద్ధి చెందుతాయి.
ఇలా తయారైన ఒరిజినల్ వేస్ట్ డీ కంపోజర్ ద్రావణంలో మొక్కలకు అవసరమైన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. తయారైన ఒరిజినల్ వేస్ట్ డీ కంపోజర్ ద్రావణాన్ని మొక్కలకు పిచికారీ చేయవచ్చు. మట్టిలో పోయవచ్చు. తయారు చేసిన ద్రావణాన్ని ఒక 20 లీటరు వరకు ఉంచి, ఆ తర్వాత మొక్కలకు వాడుకోవాలి. ఉంచిన 20 లీటరు ద్రావణంలో మరల 180 లీటరు నీళ్ళు పోసి అంటే డ్రమ్ నింపి ఆ నీటిలో రెండు కేజీల బెల్లం మెత్తగా చేసి వేయాలి. మరల రోజు సవ్యదిశలో కలుపుతూ ఉంటే ఐదు రోజులలో ఒరిజినల్ వేస్ట్ డీ కంపోజర్ ద్రావణం తయారవుతుంది. ఈ ద్రావణాన్ని వాడుకునేటప్పుడు కొంత ఉంచి మరలా మరలా తయారు చేసుకోవచ్చు. కావాలంటే ఏడెనిమిది నెలల తర్వాత కొత్త ఒరిజినల్ వేస్ట్ డీ కంపోజర్ లిక్విడ్‌ను కొని మరల తయారు చేసుకోవచ్చు. లేదంటే తయారు చేసిన ద్రావణంలో కొంత ద్రావణాన్ని ఉంచి తయారు చేసుకోవచ్చు. దీనిని మొక్కలకు వాడటం వలన దీనిలో ఉన్న సూక్ష్మ జీవులు మొక్కలకు మనం ఇచ్చే పోషకాలు అందేలా చేస్తాయి. దీనివలన మొక్కలకు చీడపీడలు తట్టుకొనే శక్తి పెరుగుతుంది. రోజూ మొక్కలకు నీళ్ళ బదులుగా వాడుకునేట్లయితే నీళ్ళలో 50 శాతం ద్రావణాన్ని కలిపి మొక్కలకు ఇవ్వవచ్చు.
లేదంటే నీళ్ళు కలపకుండా అలాగే వాడుకోవచ్చు. అప్పుడే వేసిన నారు మొక్కలకు లీటరు నీటికి 100 మి.లీ. ద్రావణాన్ని కలిపి పోయాలి. అలాగే చిన్న మొక్కలకు మొదటిసారి పిచికారీ చేయాలి అనుకుంటే కూడా ఈ మోతాదులోనే వాడుకోవాలి. మొక్కలు కొంచెం పెరిగే కొద్దీ ద్రావణాన్ని కలిపే శాతాన్ని పెంచుకుంటూ నాలుగైదు సార్లు పిచికారీ చేసిన తర్వాత ద్రావణాన్ని నీళ్ళు కలపకుండా నేరుగా పిచికారీ చేయాలి. అలాగే పెద్ద మొక్కలకు పిచికారీ చేసేటప్పుడు 50 శాతం ద్రావణాన్ని నీటిలో కలిపి అంటే నీళ్ళు, ద్రావణం సమానంగా కలిపి మొక్కలకు పిచికారీ చేయవచ్చు. రెండవసారి చేసేటప్పుడు నీళ్ళు కలపకుండా నేరుగా పిచికారీ చేయవచ్చు. ఈ ద్రావణాన్ని స్ప్రే చేయడం వలన మొక్కలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చీడపీడలు దాదాపుగా రాకుండా ఉంటాయి. మట్టిలో పోయడం వలన మట్టిలో వచ్చే వ్యాధులు ముఖ్యంగా నెమటోడ్స్ రాకుండా ఉంటాయి. ఈ ద్రావణాన్ని కంపోస్టు తయారు చేసే డబ్బాలో చల్లడం వలన కంపోస్టు త్వరగా తయారవుతుంది. ఏదైనా కారణం చేత ఈ ద్రావణాన్ని వాడకుండా పక్కన పెడితే దానిలో 30 రోజులకు ఒకసారి బెల్లం కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఒరిజినల్ వేస్ట్ డీ కంపోజర్‌ను మొక్కలకు వాడుకోవచ్చు.
జీవామృతం తయారీ విధానం, ఉపయోగాలు:
ఒక బకెట్‌లో 20 లీ నీళ్ళు తీసుకొని దానిలో ఒక కిలో ఆవు పేడ, ఒక లీటరు ఆవు మూత్రం, 200 గ్రా. శనగపిండి, 200 గ్రా. బెల్లం, పిడికెడు పుట్టమన్ను వేసి బాగా కలపాలి. పుట్టమన్ను లేకపోతే రసాయన ఎరువులు కలవని మట్టి వేయాలి. ఇంకా బాగా పండిన అరటి పండ్లు ఉంటే రెండు మూడు వేయాలి.
ఇలా చేసిన దానిని ఉదయం, సాయంత్రం ఒక కర్రతో సవ్యదిశలో కలపాలి. నీడలో ఉంచాలి. ఆవు పేడ, ఆవు మూత్రంలో ఉండే సూక్ష్మజీవులు సెనగపిండి, బెల్లంను ఆహారంగా తీసుకుని వృద్ధి చెందుతాయి. ఇలా కలిపిన జీవామృతం రెండు రోజుల తర్వాత, 11 రోజుల లోపల వాడుకోవాలి.
కొంతమంది వారం రోజుల లోపల వాడుకోవాలి అంటారు. దీనిని మొక్కలు మీద పిచికారి చేయాలి అనుకుంటే లీటరు నీటికి 100 మి.లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. మట్టిలో కూడా అదే నిష్పత్తిలో కలిపి పోయాలి. వీలైతే నెలకు రెండుసార్లు మొక్కలకు ఇవ్వడం వలన జీవామృతం లోని సూక్ష్మజీవులు మొక్కలకు కావలసిన పోషకాలు అందేలా చేస్తాయి. జీవామృతం వ్యాధికారక సూక్ష్మజీవులను నిరోధించడానికి సహాయపడుతుంది. దీనిని మొక్కలకు ఇవ్వడం వలన మట్టిలో వానపాములు వృద్ధి చెందుతాయి. స్థూల, మరియు సూక్ష్మ పోషకాలు మొక్కలకు అందుతాయి. ఈ ద్రావణంలో విత్తనశుద్ధి కూడా చేయవచ్చు. దీనిని మొక్కలకు ఇచ్చేటప్పుడు ముందు నీళ్ళు పోసి ఒక అరగంట తర్వాత ఈ ద్రావణాన్ని మొక్కలకు ఇవ్వాలి. ఆకుకూరలకు అవసరం లేదు. పూత, పిందె దశలో ఈ ద్రావణాన్ని మొక్కలకు ఇవ్వకూడదు.
Also Read: మిద్దె తోటలలో టమాటా మొక్కల యాజమాన్యం
కిచెన్ వేస్ట్ వాటర్ తయారు చేసే విధానం, ఉపయోగాలు:
కిచెన్ వేస్ట్ వాటర్ అంటే బియ్యం, పప్పులు, కూరగాయలు కడిగిన నీళ్ళు. ఈ నీటిలో కిచెన్ వేస్ట్ కూడా వేసి ఫర్మెంట్ చేసి మొక్కలకు ఇవ్వడం వలన మొక్కలకు కావలసిన పోషకాలు అన్ని అందుతాయి. కిచెన్ వేస్ట్ వాటర్‌లో ఏమేమి కలిపి తయారు చేసుకోవాలి తెలుసుకుందాం. వంట ఇంట్లో వచ్చిన ఏ వేస్ట్ వాటర్ అయినా అంటే ఏది కడిగిన నీళ్ళు అయినా పారబోయకుండా ఒక బకెట్ లేదా ఒక డబ్బాలో పోసుకోవాలి. ఆ నీటిలో కిచెన్ వేస్ట్ అంటే కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, పాడైపోయిన కూరగాయలు, పండ్లు, ఉల్లిపాయ తొక్కలు, గుడ్డు పెంకులు ఇలా ఏవి ఉంటే అవి వేసుకోవాలి. ఈ ద్రావణాన్ని ఏరోజుకారోజు మొక్కలకు ఇవ్వడం వలన అంత ఉపయోగం ఉండదు. పైగా చీడపీడలు లాంటివి రావచ్చు. అటువంటప్పుడు ఈ నీటిని ఎలా ఉపయోగించాలి అంటే రోజూ సేకరించిన నీటిని, వ్యర్ధాలను ఒక పెద్ద బకెట్ కానీ డ్రమ్ కానీ, కుండ కానీ ఏది అందుబాటులో ఉంటే అది తీసుకుని దానిలో ఒక నెటెడ్ సంచీ అంటే ఉల్లిపాయల సంచీ కానీ, ఒక గుడ్డ సంచీ కానీ వేసి బకెట్ మూతి దగ్గర సంచిని కట్టి దానిలో పోయాలి.
దానిలోని సూక్ష్మ జీవులకు ఆహారంగా కొంచెం బెల్లం వేయాలి. వీలుంటే ఒక కప్పు మాగిన ఎరువు ఉంటే అది కూడా వేసుకోవాలి. బెల్లం, ఎరువు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఆ నీటిలోనే రోజూ వచ్చే నీళ్ళను పోయాలి. ఈ నీళ్ళు బాగా పులిసి వాసన వస్తాయి. అందుకని ఈ నీటిని పోసిన కంటైనర్ మీద కానీ, కుండ మీద కానీ మూత పెట్టాలి. ఈ ద్రావణంలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. మెన్యూర్ వేసాం కాబట్టి నైట్రోజన్ కూడా ఉంటుంది. వీలయితే పుల్లటి మజ్జిగ కూడా కలుపుకోవచ్చు. పుల్లటి మజ్జిగ కలపడం వలన మట్టిలో ఫంగల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. కావలసినప్పుడు ఆ నీటిని తీసుకొని ఒక కప్పుకు పది కప్పుల నీళ్ళు కలిపి మొక్కలకు పోయాలి. సంచిలో వేసిన వ్యర్ధాలను మూడు నాలుగు రోజులకు ఒకసారి తీసి కంపోస్టు డబ్బాలో వేసుకోవాలి. ఏ ద్రావణాన్ని అయినా మొక్కలకు ఇచ్చే ముందు నీళ్ళు పోసి ఒక అరగంట తర్వాత ద్రావణాన్ని ఇవ్వాలి.
కంపోస్టు టీ తయారు చేసే విధానం, ఉపయోగాలు:
అద్భుతమైన మరియు తక్షణ ఫలితాల కోసం
తయారీ విధానం:
1. కిచెన్ కంపోస్ట్ లేదా వర్మీకంపోస్ట్ 200 గ్రాములు లేదా ఏదైనా బాగా మాగిన ఎరువు.
2. ఆవపిండి కేక్ లేదా పల్లీ చెక్క లేదా ఏదైనా ఆయిల్ కేక్ 200 గ్రాములు (అన్ని ఆయిల్ కేక్స్ కలిపి వేసుకోవచ్చు)
3. 4 బాగా పండిన అరటి పండ్లు.
4. వేప కేక్ 200 గ్రాములు.
5. తాజా టీ పొడి 50 గ్రాములు.
పైవన్నింటినీ 20 లీటర్ల బకెట్‌లో వేసి, నీటితో నింపి పైన మూత ఉంచాలి. మూడు రోజులు పులియబెట్టండి మరియు ప్రతిరోజూ సవ్య దిశలో కదిలించండి. ఫంగస్‌ని పట్టించుకోకండి. మూడు రోజుల తర్వాత వడకట్టి, 1:10 నిష్పత్తిలో అన్ని రకాల కూరగాయలు, పూల, పండ్ల మొక్కలకు ఇవ్వవచ్చు. కంపోస్ట్ టీ మొక్కలకు అవసరమైన అన్ని స్థూల మరియు సూక్ష్మ పోషకాలను కలిగి ఉంటుంది. ఈ ద్రావణంను పదిహేను ఇరవై రోజులకు ఒకసారి ఇస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.
బయో ఎంజైమ్ తయారీ విధానం, ఉపయోగాలు:
50 గ్రా. బెల్లం, పూల రెక్కలు, పండ్ల తొక్కలు, కూరగాయల తొక్కలు కలిపి 150 గ్రా. (వీటిలో ఒకటే రకం తీసుకోవచ్చు. లేదా అన్నీ కలిపి కూడా తీసుకోవచ్చు). 500 మి.లీ. నీళ్ళు తీసుకొని ఒక లీటరు ప్లాస్టిక్ బాటిల్‌లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలిపి మూతపెట్టి ఉంచాలి. ప్రతిరోజూ ఒకసారి మూత తీసి దానిలోని గ్యాసెస్ బయటకు పోయే వరకు అంటే రెండు మూడు నిముషాలు ఉంచి మరల మూత పెట్టుకోవాలి. ఈవిధంగా 30 రోజుల పాటు మూత తీసి పెడుతూ ఉండాలి. ప్లాస్టిక్ బాటిల్ లోనే తయారు చేసుకోవాలి. గాజు సీసాల్లో చేసుకుంటే గ్యాసెస్ విడుదల అవుతాయి కనుక అవి పగిలిపోతాయి. ప్లాస్టిక్ బాటిల్‌ను నీడలో ఉంచుకోవాలి. ముప్పై రోజుల తర్వాత మూత తీయనవసరంలేదు. 90 రోజుల తర్వాత బయో ఎంజైమ్ తయారవుతుంది. ప్లాస్టిక్ బాటిల్ మీద మార్కర్ పెన్‌తో తేదీ, నెల, సంవత్సరం ఖచ్చితంగా వేసి పెట్టుకోవాలి.
అలా వేసుకోకపోతే 90 రోజుల సమయంలో దీనిని ఎప్పుడు మొదలు పెట్టాము అని మర్చిపోతాము. కనుక తేదీ ఖచ్చితంగా వేసుకోవాలి. తయారైన తర్వాత వడకట్టి గాజు సీసాల్లో పోసి ఉంచుకోవాలి. దీనికి తడి తగలకుండా చూసుకోవాలి. దీనిని లీటరు నీటికి 5 మి.లీ. కలిపి మట్టిలో పోయవచ్చు. 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి మొక్కలకు పిచికారీ చేయవచ్చు. దీనిని వాడడం వలన మొక్కలలో ఎదుగుదల, పూత దశలో ఇస్తే పూత బాగా రావడం, కాత దశలో ఇస్తే కాయలు బాగా పెరిగి మంచి రంగు వస్తాయి. దీనిని తయారు చేసేటప్పుడు రెండు నిమ్మకాయ చెక్కలు వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. ఈ బయో ఎంజైమ్ మొక్కలకు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్‌గా ఉపయోగపడుతుంది.
Leave Your Comments