ఈ నెల పంటచీడపీడల యాజమాన్యం

Maize Major Problems In Summer: ప్రస్తుత యాసంగి మొక్కజొన్న లో ప్రధాన సమస్యలు – యాజమాన్యం

0
Maize Major Problems In Summer
Maize

Maize Major Problems In Summer: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి కాలంలో మొక్కజొన్నను 4.6 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరుగుచున్నది. ముఖ్యంగా ఈ పంటను నిర్మల్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, కామారెడ్డి మరియు జగిత్యాల్ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న మోకాలెత్తు దశ నుండి కోత దశ వరకు ఉంది. ప్రస్తుత మొక్కజొన్నలో కలుపు, భాస్వరంలోపం, కత్తెర పురుగు మరియు కాండంకుళ్ళు తెగులు గమనించడమైనది.

Maize Major Problems In Summer

Maize Plants

కలుపు యాజమాన్యము:

విత్తిన తరువాత అట్రజిన్ అనే కలుపు మందును ఎకరానికి తేలిక నేలల్లో 800 గ్రా లేక బరువు నేలల్లో 1200 గ్రా 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2-3 రోజుల లోపు నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేయడం వలన వెడల్పాటి ఆకులు గల కలుపు మొక్కలను దాదాపు ఒక నెల వరకు మొలవకుండా అదుపు చేయవచ్చు. ఆ తర్వాత 25-30 రోజులకు కలుపు ఉధృతిని బట్టి, టంబోట్రయాన్ 34.4% ఎస్.సి. ద్రావణాన్ని 115 మి.లీ. లేదా హెలోసల్ఫ్యూరాన్ మిథైల్ 75 డబ్ల్యూజి 36 గ్రా.లేదా టోప్రామిజోన్ 33.6% ఎస్.సి. 40 మి.లీ. + అట్రజిన్ 400 గ్రా లేదా అట్రజిన్ +మీసోట్రయాన్ 1400 మి.లీ 200 లీ. నీటిలో కలిపి కలుపు 4 ఆకుల దశలో పిచికారి చేసినట్లయితే వివిధ రకాల కలుపు మొక్కలను నియంత్రించవచ్చు.

పోషక లోపాలు:

భాస్వరం:

ఈ పోషక ధాతు లోపం ఉన్నపుడు మొక్క పెరుగుదల తగ్గి ఆకులు ఊదా రంగులోకి మారుతాయి. ముఖ్యంగా వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు లేదా పొలంలో నీరు నిలిచిన యెడల ఈ సమస్య కనిపిస్తుంది. దీని నివారణకు దుక్కీలో సిఫారసు మేరకు భాస్వరపు ఎరువును వేయాలి. పంటపై డి.ఎ.పి లేదా 19-19-19 ద్రావణాన్ని లీటరు నీటికి 10 గ్రా. చొప్పున 4 నుంచి 5 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారి చేసి లోపాన్ని చాలా వరకు సవరించవచ్చును.
కత్తెర పురుగు

గత 5 సంవత్సరాల కన్నా ఈ యాసంగిలో కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా గమనించడమైనది. కత్తెర పురుగు మొదటిదశ లార్వాలు పత్ర హరితాన్ని గోకి తినుటవలన ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది. రెండు మరియు మూడవ దశ లార్వాలు ఆకుసుడిలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తినటం వలన విచ్చుకున్న ఆకుల్లో వరుస రంధ్రాలు ఏర్పడుతాయి. ఈ పురుగు సమస్య ఎక్కువైతే గొడ్డు మొక్కలు కూడా ఏర్పడుతాయి. అధికంగా ఆశించినప్పుడు మొక్క అంతా కత్తిరించినట్లు కనిపించును. మొక్క సూడూలలో పసుపు పచ్చని రంపపు పొట్టు లాంటి లార్వా విసర్జితాలు కనిపించును.

యాజమాన్యం:

పంట విత్తిన వారానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించాలి.
పొలంలో నలుమూలల తిరిగి పురుగు ఆశించిన మొక్కలను గమనించాలి.
పురుగు గ్రుడ్లను, మొదటి దశ పిల్ల పురుగులను నివారించుటకు, వేపసంబంధిత మందైన అజారిడిక్టిన్ (1500 పి‌పి‌ఎం) 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
రెండవ దశ దాటిన లార్వాల నివారణకు స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 0.4 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి నివారించాలి.
పురుగు ఉదృతి ఎక్కువగా ఉన్నచో ఎదిగిన లార్వాల నివారణకు క్లోరానిట్రానిలిప్రోల్‌ 0.4 మి.లీ. లేదా స్పెనిటోరం 0.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
65 రోజుల పైబడిన మొక్కజొన్న పంట అనగా పూత దశ తరువాత పురుగును గమనించినట్లైతే పురుగు మందులు పెద్దగా పనిచేయవు. ఎదిగిన లార్వాలను మనుషులతో ఏరించి కిరోసిన్ డబ్బాలో వేసి చంపివేయాలి. విషపు ఎరను వేసుకోవాలి.

కాండం కుళ్ళు:

పూతనంతరం కాండం కుళ్ళు తెగులు వేడి వాతావరణంలో మొక్కజొన్న సాగుచేయు ప్రాంతాలలో అగుపిస్తుంది. పంటకోత సమయంలో ఈ తెగులు స్పష్టంగా అగుపిస్తుంది. తెగులు సోకిన కణుపు మధ్య భాగాలు క్రుళ్లి నలుపుగా మారి మొక్కలు ఎండిపోతాయి. పంటకోతకు రాక ముందే కాండం భాగం విరిగి నేలపై పడిపోతుంది. కాండము చీల్చి గమనించినచో అనేకమైన స్కిరోషియా బీజాలు కణజాలం పైన మరియు బెండు క్రింది భాగంలో అగుపిస్తాయి. ఈ తెగులు నేల పై భాగంలోని ఒకటి లేక రెండు కణుపులకు మాత్రమే సోకుతుంది. పూత దశనుండి నీటి ఎద్దడి ఉన్న పైరులో ఈ తెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉంది.
కాండం కుళ్ళును కలిగించే శిలీంద్ర బీజాలు నేలలో మరియు మొక్కల అవశేషాలలోజీవించి ఉండి, నేలలో తేమ శాతం తగ్గినప్పుడు మరియు వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగినప్పుడు మొక్కజొన్న పంటను తీవ్రంగా ఆశిస్తాయి.

Maize Major Problems In Summer

Maize

నివారణ:

పంట వేసే ముందు పచ్చిరొట్ట పంటలను పండించి నేలలో కలియదున్నాలి.
ట్రైకోడర్మా శిలీంద్రాన్ని పశువుల ఎరువులో వృద్ధి చేసి వరుసగా 3-4 సంవత్సరములు భూమిలో కలపాలి.
మాంకోజెబ్ 2.5 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి
ఎండాకాలంలో నేలను లోతుగా దున్నుకోవాలి
పంట కోసిన తరువాత తెగులు ఆశించిన మొక్కల భాగాలను కాల్చివేయాలి

చీడపీడలు, కలుపు మరియు పోషకలోపాలు ఉన్నపుడు ఏ పంటలోనైనా దిగుబడులు గణనీయంగా తగ్గి రైతుకు అపారమైన నష్టం కలుగజేస్తాయి. కావున సరియైన సమయంలో మొక్కజొన్నలో సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం వలన రైతు సోదరులు సాగు ఖర్చులు తగ్గించుకొని అధిక దిగుబడులు మరియు నిఖరాదాయం పొందవచ్చును.

Leave Your Comments

Tomato Cultivation: టమాటా నారుమడి పెంపకం మరియు ఎరువుల యాజమాన్యం

Previous article

Coleus Plants: పాషాణ బేది సాగు (కోలియస్ ఫోర్ స్కోలై)

Next article

You may also like