ఈ నెల పంటమన వ్యవసాయం

Rice Crop: వరి పంటలో రసాయనాల ద్వారా కలుపు నివారణ

0
Rice Crop
Weed In Rice crop

Rice Crop: వరి పంటలో కలుపు వల్ల జరిగే నష్టం 90 శాతం వరకు ఉండవచ్చు. వరిలో కలుపు రాకుండా నివారించే,పైరులో ఆశించిన కలుపును నివారించే పద్ధతులు పాటించాలి. అవకాశం ఉన్నంతవరకు పొలంలో కలుపు రాకుండా నివారించుకోవటం మంచిది.

కలుపు రాకుండా నివారించే పద్ధతులు :

* నేల సమతలంగా లేని ప్రాంతాల్లో కలుపు సమస్య ఎక్కువ. కాబట్టి పైరు విత్తేముందే నేలను చదును చేయాలి.
* వేసవిలో లోతు దుక్కులు దున్నటం వల్ల పొలంలో ఉన్న తుంగ, గరిక వంటి మొండి జాతి కలుపు నివారించవచ్చు.తొలకరి వర్షాలు మొదలైన వెంటనే నేలను వీలైనన్ని ఎక్కువసార్లు గొర్రు, గుంటకలతో దున్నటం వల్ల నేల
పైపొరలలోని కలుపు విత్తనాలు చాలా
వరకు మొలక దశలోనే అంతరించి, పంటతో పాటుగా వచ్చే కలుపు మొక్కలు చాలా వరకు తగ్గిపోతాయి.
* రైతులు సాగుచేసే భూములను ఎంతో జాగ్రత్తగా కలుపు లేకుండా చూసుకుంటారు. అంతే శ్రద్ధతో పొలంగట్లు, పొలాలకు వెళ్ళే డొంకలు, రోడ్ల పక్క ప్రదేశాలలో కలుపు లేకుండా చూసుకుంటే కలుపు విత్తనం ఉత్పత్తి చాలా వరకు
తగ్గిపోతుంది.
* గ్రామాలలో చెరువు గట్లు, కాలువ గట్లు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాలలో కలుపు మొక్కలు పెరగనీయకుండా చేస్తే పంట పొలాల్లో కలుపు సమస్య తగ్గుతుంది.
* పశువుల ఎరువు పొలానికి వేసినపుడు దానిలో ఉండే కలుపు విత్తనాల ద్వారా వచ్చే కలుపును నివారించుకోటానికి తొలకరి వర్షాలకు పొలాన్ని దున్ని ఎరువుతో పాటుగా వచ్చే కలుపు పైరు వేయకముందే మొలచి నశించేలా చేయాలి.
* కలుపు విత్తనాలు కలవకుండా పంట విత్తనాలు మాత్రమే విత్తేందుకు వాడాలి.
* పంట మొక్కల సాంద్రత పొలంలో సరిపడా ఉన్నపుడు కలుపు ఉదృతిని పైరు అడ్డుకుంటుంది.
* పంట విత్తనాలు చల్లటం కంటే, యంత్ర పరికరాలు ఉపయోగించి సిఫారసు చేసిన ఎడంతో, సిఫారసు మేరకు విత్తన మోతాదు పాటించి, సరైన పద్ధతిలో విత్తినపుడు కలుపు సమస్య తక్కువగా ఉంటుంది.
* పైరు వేయటానికి కొంత సమయం ఉన్నపుడు పొలంలో పచ్చి రొట్ట పైర్లు సాగుచేసి కలుపు ఉధృతి తగ్గించుకోవాలి.
* పంటకోసిన తరువాత పొలంలో మిగిలిపోయే కలుపు మొక్కలను వెంటనే నాశనం చేయాలి. అలా చేయనపుడు వాటి ద్వారా విత్తనం ఉత్పత్తి జరిగి తరువాత సాగు చేసే పైర్లలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది.

Rice Crop

Weed In Rice crop

1.నేరుగా విత్తే వరిలో :

సరైన పదునులో దుక్కిలో నేరుగా విత్తడం: ఈ విధానంలో రైతులు తొలకరి వర్షాలు పడిన వెంటనే లేదా కాలువలో నీరు వచ్చిన వెంటనే పొలం దుక్కి దున్ని విత్తనాలను నేలలో తగినంత పదును చేరినప్పుడు విత్తి, వర్షాధారంగా లేక ఆరుతడి పంటగా సాగుచేస్తూ కాలువల ద్వారా నీరు అందుబాటులోకి వచ్చిన తర్వాత మాగాణి వరిగా సాగుచేస్తారు. ఈ పద్ధతిలో రసాయనాలతో కలుపు నిర్మూలన మూడు దశల్లో చేయాలి.

* విత్తడానికి ముందు : పొలంలో తుంగ, గరిక, దర్భగడ్డి, బొంత ఊద వంటి మొండి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు, తొలకరి వర్షాలు పడి, కలుపు ఏపుగా పెరుగుతున్నప్పుడు ఒక లీటరు నీటికి 5 మి.లీ. పారాక్వాట్ 24% రసాయనాన్ని లేదా గ్లూపోసినేట్ 13.5% ద్రావకం 4 మి.లీ./ లీటరు నీటికి కలిపి ఎక్కడ కలుపు ఉంటే అక్కడ పిచికారి చేయాలి. ఈ మందు స్ప్రే చేసిన 10-15 రోజుల తర్వాత పొలం దున్ని వరి విత్తుకోవచ్చు.
* విత్తిన వెంటనే లేదా 1-2 రోజుల్లోపు : వరి విత్తిన వెంటనే లేదా 1-2 రోజుల్లోపు తేమ ఉన్నప్పుడు ఎకరాకు ఒక లీటరు పెండిమిథాలిన్ 30%(స్టాంప్, పెండిస్టార్) లేదా 700 మి.లీ.పెండిమిథాలిన్ 38.7% ద్రావకం లేదా 400 మి.లీ. ప్రెటిలాక్లోర్ 50% (రీఫిట్, ఎరేజ్) 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి.

* విత్తిన 15-20 రోజుల మధ్య : ఏ కారణం చేతనైన విత్తిన వెంటనే కలుపు మందులు (స్ప్రే చేయకపోతే పొలంలో ఊద వంటి గడ్డి జాతి మొక్కలు ఉంటే ఎకరాకు 400మి.లీ.సైహాలోఫాప్ బుటైల్ 10%(క్లించర్, రాప్ అప్) 200 లీ. నీటిలో కలిపి స్ప్రే చేయాలి. గడ్డి జాతి, వెడల్పాకు కలుపు మొక్కలు ఉంటే ఎకరాకు 100 మి.లీ. బిస్పైరిబాక్ సోడియం 10% (నామినీ గోల్డ్, తారక్) 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 15-25 రోజుల మధ్య పిచికారి చేయాలి.

* విత్తిన నెల రోజుల తర్వాత : పొలంలో వెడల్పాకు కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 400 గ్రా. 2, 4-డి సోడియం సాల్టు 80% (ఫెర్నాక్సోన్, గ్రీనోక్సన్, క్లీన్ 80, సాలిక్స్) 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి. ఈ మందు స్ప్రే చేసినప్పుడు పైరు కొంచెం ఎర్రబడుతుంది. కనుక పైపాటుగా నత్రజని ఎరువును వేసుకోవాలి లేదా ఎకరాకు 50గ్రా.ఇథాక్సిసల్ఫ్యూరాన్ 15% (సన్ రైస్) లేదా 8 గ్రా. మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్ + క్లోరిమ్యురాన్ఇథైల్ 20% (ఆల్ మిక్స్) 200 లీటర్ల నీటిలో కలిపి కలుపుపై పడేటట్లు పిచికారి చేయాలి.

2. దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తిన పైరులో:

* వరి విత్తిన 3-5 రోజుల్లోపు : పొలంలో నీరు పలుచగా ఉన్నప్పుడు ఎకరాకు 80గ్రా.పైరజోసల్ఫూరాన్ ఇథైల్ 10% (సాథి) ముందుగా అరలీటరు నీటిలో కలుపుకొని, ఆ ద్రావణాన్ని 20 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలంలో సమానంగా చల్లాలి. ఈ మందు చల్లిన 2-3 రోజుల వరకు పొలంలోని నీరు బయటకు పోనివ్వటం లేదా బయట నీరు పొలంలోకి పెట్టటం కానీ చేయరాదు.

* వరి విత్తిన 15-20 రోజుల మధ్య ఏదైనా కారణం వల్ల విత్తిన వెంటనే కలుపు మందులు స్ప్రే చేయకపోతే, పొలంలో ఊద మొదలగు గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరాకు 400 మి.లీ.సైహాలోఫాప్ బ్యుటైల్ 10% (క్లించర్, రాప్ అప్) 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి లేదా గడ్డిజాతి, వెడల్పాకు మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరాకు 100 మి.లీ. బిస్పైరిబాక్ సోడియం 10% (నామిని గోల్డ్, తారక్, అడోరా) 200 లీ. నీటిలో కలిపి విత్తిన 15-20 రోజుల మధ్య పిచికారి చేయాలి.

* విత్తిన నెల రోజుల తర్వాత: పొలంలో వెడల్పాకు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 400గ్రా. 2, 4-డి సోడియం సాల్టు 80% (ఫెర్నాక్సోన్, గ్రీనోక్సన్, క్లీన్ 80, సాలిక్స్) 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి. ఈ మందు స్ప్రే చేసినప్పుడు పైరు కొంచెం ఎర్రబారుతుంది. గనుక పై పాటుగా నత్రజని ఎరువును వేసుకోవచ్చు లేదా ఎకరాకు 50గ్రా.

ఇథాక్సిసల్ఫ్యూరాన్ 15% (సన్ రైస్) పొడి మందును లేదా 8 గ్రా. మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్+ క్లోరిమ్యురాన్ ఇథైల్ 20% (ఆల్ మిక్స్) 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

3. మాగాణి వరిలో :

* నారుమడి : నారుమడిలో ఊద నిర్మూలనకు ఒక ఎకరం నారుమడికి ప్రెటిలాక్లోర్ 50% ద్రావకం 400 మి.లీ. (రీఫిట్,ఎరేజ్) 200 లీటర్ల నీటిలో కలిపి నారుమడి విత్తిన 2 లేదా 3 రోజులలో పిచికారి చేయాలి లేదా విత్తిన 14-15 రోజులప్పుడు ఊద నిర్మూలనకు ఎకరం నారుమడికి 400 మి.లీ.సైహాలోఫాప్ బ్యుటైల్ 10% (క్లించర్, రాప్ అప్) 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఊద, వెడల్పాకు కలుపు మొక్కలు నారుమడిలో ఉన్నప్పుడు నారుమడి విత్తిన 15 రోజులకు ఎకరాకు 100 మి.లీ.బిస్పైరిబాక్ సోడియం 10% ద్రావకం
(నామిని గోల్డ్, తారక్, అడోరా) 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.

* నాటిన వరి పొలంలో :

ఊద మొదలగు ఏక వార్షిక గడ్డిజాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు 1.0 నుండి 1.5 లీటర్ల బ్యుటాక్లోర్ 50% (మాచెటి, హిల్టాక్లోర్) లేదా 80 గ్రా.పైరజోసల్ఫూరాన్ ఇథైల్ 10% పొడి మందు (సాథి) లేదా 400 మి.లీ. ప్రెటిలాక్లోర్ 50% (రీఫిట్, ఎరేజ్) లలో ఏదో ఒకదానిని ఎకరాకు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి, నాటిన 3 నుంచి 5 రోజుల్లో పలుచగా నీరు ఉన్నప్పుడు చల్లాలి.

* గడ్డి, తుంగ, వెడల్పాకు కలుపు మొక్కలు ఉన్నప్పుడు ఎకరాకు 4 కిలోలు బెన్ సల్ఫ్యురాన్ మిథైల్ (0.6%) + ప్రెటిలాక్లోర్ (6 %) (లోండాక్స్ పవర్) గుళికలు లేదా 4 కిలోలు బ్యుటాక్లోర్ 5% గుళికలు మరియు 4 కిలోలు 2,4-డి. ఇథైల్ ఎస్టర్ 4% గుళికలు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి, నాటిన 3 నుంచి 5 రోజులలో పొలంలో నీరు పలుచగా ఉన్నప్పుడు సమానంగా వెదజల్లాలి.

* నాటిన 15-25 రోజుల సమయంలో గడ్డి, వెడల్పాకు కలుపు మొక్కలు ఉంటే ఎకరాకు 100 మి.లీ. బిస్పైరిబాక్ సోడియం 10% (నామిని గోల్డ్, తారక్, అడోరా) 200 లీ. నీటిలో కలిపి పొలంలో నీరు తీసి పిచికారీ చేయాలి.

* నాటిన 25-30 రోజులప్పుడు పొలంలో వెడల్పాటి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరాకు 400 గ్రా. 2,4-డి సోడియం సాల్టు 80% (ఫెర్నాక్సోన్, గ్రీనోక్సన్, క్లీన్ 80, సాలిక్స్) లేదా 400 మి.లీ. 2,4-డి ఎమైన్ సాల్ట్ 58% ద్రావకం (వీడ్మార్ సూపర్, వీడార్ 58) లేదా 50గ్రా. ఇథాక్సిసల్ఫూరాన్ 15% (సన్ రైస్) లేదా 8 గ్రా. మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్+ క్లోరిమ్యురాన్ ఇథైల్ 20% (ఆల్మిక్స్) 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయడం ద్వారా వెడల్పాటి కలుపు మొక్కలను నివారించవచ్చు.

Rice Crop

Rice Crop

ఎన్. నాగేంద్ర బాబు,
డా. కె. ఫని కుమార్ ,
ఏరువాక కేంద్రం, ఏలూరు జిల్లా.

Leave Your Comments

PJTSAU: నేల ఆరోగ్య పరిశోధనా ప్రగతిపై సమీక్షా సదస్సు

Previous article

Telangana Budget 2024: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు !

Next article

You may also like