ఉపయోగాలు:
Tomato Cultivation: టమాటను అధికంగా కూరగాయగానే కాకుండా సూపుగాను, జ్యూసుగాను, కెచప్, ప్యూరీ, పేస్టు మరియు పొడి రూపంలో కూడా వాడతారు. టమాటలో అధికంగా విటమిన్ ‘సి’ వుంటుంది. వీటి ఉత్పత్తులకు అనేక దేశాలలో గిరాకీ ఉంటుంది. టమాట విత్తనములో 24% నూనె వుంటుంది. దీని నూనెను సలాడ్ నూనెగా మార్గరైన్ పరిశ్రమలలో వాడుతారు. టమాట గుజ్జుకు రక్తశుద్ది మరియు జీర్ణాశయమునకు సంబంధించిన వ్యాధులను నయము చేయు గుణము కలదు. భారతదేశములో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో టమాటాను పండిస్తున్నారు. కాని ఎక్కువగా వ్యాపార సరళిలో హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పండిస్తున్నారు.
విస్తీర్ణం :
భారతదేశంలో 80,85,840 హెక్టార్ల విస్తీర్ణంలో హెక్టారుకు 19.5 టన్నుల సగటు దిగుబడితో మొత్తం 1,96,96,920 టన్నుల దిగుబడి వస్తుంది.
తెలంగాణలో 53,640 హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేయబడి హెక్టారుకు 12.6 టన్నుల సగటు దిగుబడితో మొత్తం 13,64,930 టన్నుల దిగుబడి వస్తుంది.
నారుమడుల పెంపకం:
నేలను శుభ్రంగా 3-4 సార్లు నాగలితో దుక్కి దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో 40 కిలోల మాగిన పశువుల ఎరువు మరియు 4 కిలోల సూపర్ ఫాస్ఫేట్ (40 చ.మీ.ల నారుమడికి) వేసి కలియదున్నాలి. 4.0 మీ|| పొడవు, 1.0 మీ. వెడల్పు, 15 సెం.మీ. ఎత్తు కలిగిన నారుమడులను తయారు చేసుకోవాలి. మురుగు నీరు పోవుటకు మడికి మడికి మధ్య 50 సెం.మీ. వ్యత్యాసం ఉంచాలి. ఒక ఎకరాకు 10 నారుమడులు సరిపోతాయి.
నేల ద్వారా ఉత్పన్నమయ్యే శిలీంధ్రాలను అరికట్టడానికి ఒక శాతం బోర్డోమిశ్రమమును లేదా రాగిధాతు శిలీంద్రనాశనితో నారుమడి తడిచేలా పిచికారి చేసి రోగ రహితం చేయాలి.
నారుమడిలో విత్తనాలను 10 సెం.మీ. ఎడముగల వరుసలలో పైపైన 1-2 సెం.మీ. లోతులో విత్తాలి. విత్తనాలను ఎక్కువ ఒత్తుగా విత్తరాదు. ఆ తరువాత రోజ్కాన్తో నీరు పెట్టాలి. మొలకెత్తే వరకు నారుమడులపై ఎండు గడ్డి కప్పాలి. దీని వలన విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. మొలకెత్తగానే కప్పిన గడ్డిని తీసివేయాలి.
నారుమడులలో ఎప్పటికప్పుడు కలుపు తీసి వేయాలి. 40 చ.మీ. నారుమడికి కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు 100 గ్రా॥లు చల్లి కీటక రహితం చేయాలి. రసం పీల్చే పురుగులు మరియు ఆకుమచ్చ తెగులును నిరోధించటానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి.
నారు మొక్కలు త్వరగా పెరగడానికిగాను అధిక మోతాదులో నత్రజని ఎరువులను వాడటం లేదా అధిక నీటి తడులు ఇవ్వడం లాంటి ప్రయత్నాలు చేయరాదు. నారు మొక్కలు పీకడానికి 7-10 రోజుల ముందుగా క్రమక్రమంగా నీటి తడులు తగ్గించుట వలన నారు ధృఢంగా తయారవుతుంది.
నారు పీకడానికి 6-12 గం॥ల ముందు విత్తన మడులను నీటితో తడపాలి. తద్వారా నారు పీకడం సులభతరం అవడమే కాకుండా మొక్క ధృడంగా ఉండి వేర్లకు రక్షణగా ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో నారును ప్రోట్రేలలో పెంచుతున్నారు.
ఎరువుల యాజమాన్యం :
ఆఖరి దుక్కిలో ఎకరాకు దాదాపు 8-12 టన్నుల పశువుల ఎరువుతో పాటు 24 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాష్ను ఇచ్చు ఎరువులు వేసి బాగా కలియదున్నాలి. 40 కిలోల నత్రజనిని మూడు సమపాళ్ళుగా చేసి నాటిన 30వ రోజు, 45వ రోజు మరియు 60వ రోజున వేయాలి. సంకరజాతి రకాలు వేసుకున్నప్పుడు రసాయనిక ఎరువులను 50 శాతం పెంచి వేసుకోవాలి.
జీవన ఎరువులు :
ఎకరాకు 2 కిలోల అజటోబాక్టర్ను 50 కిలోల పశువుల ఎరువులో కలిపి, నీళ్ళు చల్లుతూ 7-10 రోజులు మాగనిచ్చి తర్వాత ఆఖరు దుక్కిలో వేయాలి. దీనితో పాటుగా ఎకరాకు 2 కిలోలు ఫాస్ఫో బాక్టీరియా (పిఎన్బీ)ను పొలం అంతా సమంగా చల్లుకోవాలి. ఈ జీవన ఎరువులు వేసినప్పుడు సిఫార్సు చేసిన 25% నత్రజని, భాస్వరం ఆదా అవుతుంది.
డా. కె. శైలజ మరియు AELP-SHM విద్యార్థులు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం
వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్.