మన వ్యవసాయం

మిద్దె తోటలో తీగ జాతి కూరగాయలు

0
Terrace Garden

తీగ జాతి కూరగాయలను పాదులు అంటారు. పాదులు చాలా రకాలు ఉన్నాయి. అన్ని కాలాల్లో, అన్ని రకాలు పండించుకోలేము. తీగ జాతి కూరగాయలలో ప్రధానంగా అందరూ పండించుకునేవి బీర, సొర, పొట్ల, కాకర, నేతి బీర, చమ్మకాయ, దొండ, చిక్కుడు, లాంగ్ బీన్స్, అలసందలు ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఎండాకాలంలో బాగా పెరుగుతాయి, కొన్ని వర్షాకాలంలో, కొన్ని రకాలు చలికాలంలో బాగా పెరుగుతాయి. మిద్దె తోటలో స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఏ కాలంలో ఏ పంట వేసుకుంటే ఎక్కువ దిగుబడిని పొందగలమో తెలుసుకుని వేసుకోవాలి. అప్పుడే ఒక కుటుంబానికి సరిపడా దిగుబడిని పొందవచ్చు. చలికాలంలో చిక్కుడు జాతికి చెందిన రకాలు వేసుకొంటే బాగా దిగుబడి సాధించవచ్చు. బీర, సొర, నేతి బీర, లాంటి రకాలు దాదాపుగా సంవత్సరం అంతా పండించుకోవచ్చు. పెరటి తోటలో పాదులు పెంచుకోవడానికి మట్టి, విత్తనం, నీరు ఉంటే చాలు.

అలా కాకుండా మిద్దె తోటలో పెంచుకోవాలంటే దానికి ఏమేమి అవసరమో తెలుసుకుందాం. ముందుగా ఏదైనా ఒక మొక్క పెంచుకోవాలంటే మనకు కావలసినది ఒక కుండీ లేక కంటైనర్. తీగ జాతులకు ఎలాంటి కంటైనర్లు ఉంటే అవి బాగా పెరుగుతాయో ముందు తెలుసుకోవాలి. ఏదో ఒక దానిలో విత్తనం పెడితే దిగుబడి సాధించలేము. కాబట్టి మిద్దె తోటలో తీగ జాతులకు కంటైనర్ల ఎంపిక ముఖ్యం. వీలున్న వాళ్ళు పర్మినెంట్ మడులు ఏర్పాటు చేసుకుంటే పాదులు బాగా పెరిగి దిగుబడి బాగుంటుంది. అలా మడులు ఏర్పాటు చేసుకోలేని వారు నాలుగు అడుగుల వెడల్పు, ఒక అడుగు ఎత్తు ఉన్న కంటైనర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటి కంటైనర్లు ఫైబర్ టబ్బులు, గ్రో బాగ్స్ రూపంలో ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. అవి కూడా ఏర్పాటు చేసుకోలేని వారు కనీసం రెండు అడుగుల వెడల్పు, ఒక అడుగు లోతు ఉన్న గ్రోబాగ్స్ కానీ, ఫైబర్ టబ్బులు కానీ ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకున్న కంటైనర్లలో మట్టి మిశ్రమం నింపుకోవాలి. మట్టి మిశ్రమం కోసం గార్డెన్ సాయిల్ (ఎర్రమట్టి), ఇసుక లేదా కోకోపీట్, ఎరువు, కొంచెం వేప పిండి తీసుకోవాలి. మట్టి గుల్లగా ఉండడం కోసం పైవన్నీ కలుపుకోవాలి. చాలా మంది కోకోపీట్ కలుపుతున్నారు. కోకోపీట్ వలన మట్టి మిశ్రమంలో అడుగున తేమ ఎక్కువగా ఉండి మొక్కల వేర్లకు హాని జరుగుతుంది. అందుకని ఇసుక కలుపుకుంటే అలాంటి హాని జరుగకుండా ఉంటుంది. ఇసుక లేకపోతే మట్టి, ఎరువు సమపాళ్లలో కలిపినా చాలు. అందుబాటులో ఉన్న ఏ ఎరువు అయినా కలుపుకోవచ్చు. పశువుల, మేకుల, ఆవుల ఎరువులు వాడుకోవచ్చు. అది బాగా మాగినది అయి ఉండాలి.

Vegatables

Vegatables ( కూరగాయలు )

వర్మీ కంపోస్టు కూడా వాడుకోవచ్చు. మట్టి, ఎరువు, ఇసుక లేదా కోకోపీట్ సమాన భాగాలుగా తీసుకొని దానిలో గుప్పెడు వేపపిండి కలుపుకోవాలి. తీగ జాతి విత్తనాలను మట్టిలో నేరుగా విత్తుకోవాలి. తీగ జాతి విత్తనాలను నానబెట్టి వేసుకుంటే విత్తనాలు మొలకెత్తే శాతం ఎక్కువగా ఉంటుంది. తీసుకునే కంటైనర్ సైజును బట్టి అంటే రెండు అడుగుల వెడల్పు ఉన్న కంటైనర్ లో రెండు విత్తనాలు విత్తుకోవాలి. పెరటి తోటలో అయితే రెండు విత్తనాలు విత్తుకుంటే సరిపోతుంది. కానీ మిద్దె తోటలో దిగుబడి బాగా రావాలంటే ఏదో ఒకటి రెండు విత్తనాలను పెట్టుకుంటే సరిపోదు. కనీసం నాలుగైదు విత్తనాలైనా పెట్టుకోవాలి. తీగ జాతికి పందిరి అవసరం. మిద్దె తోటలో నిలువు పందిరి వేసుకుంటే స్థలం కలిసి వస్తుంది. తీగ జాతి మొక్కలకు మట్టిలో తేమ ఆరిపోకుండా నీళ్ళు అవసరం. మట్టిలో ఎప్పుడు తేమ ఉండేలా చూసుకోవాలి. ఎండాకాలంలో రెండు పూటలా నీళ్ళు ఇవ్వాలి కానీ ఎక్కువ నీరు ఇవ్వకూడదు. తేమ ఆరిపోకుండా మల్చింగ్ చేయాలి.

తీగ జాతి మొక్కలలో తీగలు బాగా సాగి మొక్క పెరగాలంటే తీగల చివర్లు తుంచాలి. ఇలా తుంచడం వలన ఆడ, మగ పువ్వులు బాగా వస్తాయి. మిద్దె తోటలో పిందె పువ్వులకు (ఆడ) హ్యాండ్ పాలినేషన్ చేయాలి. పాలినేషన్ జరగాలంటే హనీ బీస్, కందిరీగలు, తుమ్మెదలు లాంటివి తోటలో తిరుగుతుండాలి. అవి తోటలో తిరగాలంటే మిద్దె తోటలో ఎక్కువగా పసుపు రంగు పూల మొక్కలను తప్పకుండా పెంచుకోవాలి. పాలినేషన్ చేసినా ఒకోసారి పిందె పువ్వులు పండిపోతాయి. అలా పండిపోతే పాలినేషన్ సరిగా చేయలేదని అర్ధం. పాలినేషన్ కాకముందే పిందెలు పండిపోతే నీళ్ళు ఎక్కువ లేదా తక్కువ అయినట్లు. తీగ జాతి మొక్కలకు పోషకాలు ఎక్కువ అవసరం. పదిహేను ఇరవై రోజులకు ఒకసారి కంపోస్టు గుప్పెడు వేయాలి. అప్పుడప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవైనా ఇస్తూ ఉండాలి. వర్షాకాలంలో ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. అలా అయితే మొక్కలకు నీళ్ళు ఎక్కువ అయినట్లు.

Pumpkin

Pumpkin ( గుమ్మడి కాయ )

 Also Read : ధాన్యాన్ని బంగాళాఖాతంలో పారబోయాలా ?

తీగ జాతి మొక్కలకు వచ్చే చీడపీడలు గురించి తెలుసుకుందాం :

తీగెజాతి మొక్కలు పెరిగేటప్పుడు కింద నుంచి ముదిరిన ఆకులన్నీ తీసేయాలి. అలా చేయకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అన్ని తీగ జాతి కాయలకు సాధారణంగా పండు వలన నష్టం ఎక్కువగా ఉంటుంది. పండు ఈగ బారినుండి కాపాడడానికి పాలినేషన్ జరిగిన తర్వాత ఆ పిందెలకు గుడ్డ సంచులు కానీ, ప్లాస్టిక్ కవర్స్ కానీ పెట్టాలి. లేకపోతే ఫెరొమొనీ ట్రాప్స్ తోటలో అక్కడక్కడా పెట్టుకోవాలి.

అఫిడ్స్  : దాదాపుగా అన్ని తీగ జాతి ఆకులకు వెనకాల అఫిడ్స్ చేరుతాయి. చిక్కుడు జాతికి ఆకులు, తీగెలు, పూలు కాయలు అన్నిటికీ అఫిడ్స్ ఆశిస్తాయి. వీటి నివారణకు ముందుగా అఫిడ్స్ ఆశించిన ఆకులన్నీ తీసేయాలి. తీయడానికి సాధ్యం కానప్పుడు నీటితో ఫోర్స్ గా కడిగేయాలి. తడి మీద బూడిద చల్లాలి. బూడిద తడికి బాగా అతుక్కుని అఫిడ్స్ ను నివారిస్తుంది.బూడిద లేకపోతే సబ్బు నీళ్ళు కానీ, కుంకుడు కాయ రసం కానీ, షాంపూ కానీ ఏదైనా నీటిలో కలిపి మొక్కలకు స్ప్రే చేయాలి.

బూడిద తెగులు, ఆకుమచ్చ తెగుళ్ళు

బూడిద తెగులు : తీగ జాతి మొక్కలకు బూడిద తెగులు ప్రధానంగా వస్తుంది. నివారణకు పాలు ఒక వంతు, తొమ్మిది వంతులు నీళ్ళు కలిపి మొక్కలకు స్ప్రే చేయాలి. పుల్లటి మజ్జిగ, ఇంగువ, నీటిలో కలిపి కూడా మొక్కలకు స్ప్రే చేయవచ్చు.

రకరకాల ఆకుమచ్చ తెగుళ్ళకు నివారణ : పుల్లటి మజ్జిగ, ఇంగువ నీటిలో కలిపి మొక్కలకు స్ప్రే చేయాలి. లేదా బేకింగ్ సోడా 2 గ్రా, వెనిగర్ 2 ఎం ఎల్, వేపనూనె 5 ఎం ఎల్, లిక్విడ్ డిష్ వాష్ సబ్బు 2 ఎం ఎల్ లీటరు నీటిలో కలిపి మొక్కకు స్ప్రే చేయాలి. లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ ను లీటరు నీటికి 3.గ్రా కలిపి మొక్కలకు స్ప్రే చేయాలి. బేకింగ్ సోడా ద్రావణం, కాపర్ ఆక్సీ క్లోరైడ్ ద్రావణం మొక్కలకు స్ప్రే చేసేముందు ఖచ్చితంగా రెండు ఆకుల మీద టెస్ట్ డోస్ చేసి అప్పుడు మాత్రమే మొక్కలకు స్ప్రే చేయాలి.

మొజాయిక్ వైరస్ : దీని నివారణకు మూడు టేబుల్ స్పూన్ల పసుపు, 500 ఎం ఎల్ నీళ్ళు తీసుకొని మరిగించి చల్లార్చి దానిలో ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు పేస్ట్ చేసి వేసి బాగా కలిపి ఒక రోజు ఉంచి ఆ ద్రావణానికి సమానమైన నీటిని కలిపి మొక్కలకు స్ప్రే చేయాలి. మట్టిలో పోయాలి ఈ విధంగా వారానికి రెండుసార్లు రెండు వారాలు చేయాలి. ఆవుపాలు ఒక వంతు, నీళ్ళు తొమ్మిది వంతులు కలిపి కూడా మొక్కలకు స్ప్రే చేయవచ్చు. ఈవిధంగా తీగ జాతి మొక్కలకు వచ్చే చీడపీడలు నివారించుకోవాలి.

        లత కృష్ణమూర్తి

 

Also Read : తెలుగు రాష్ట్రాలలో పెసర ప్రధానమైన పంట

 

Leave Your Comments

ఆర్థిక శాఖకు వన్నె తెచ్చిన రోశయ్య

Previous article

మేలు జాతి పశువుల్లో పిండమార్పిడి

Next article

You may also like