నేలల పరిరక్షణ

Nano Urea: నానో యూరియాతో వ్యవసాయానికి సుస్థిరత, పర్యావరణ భద్రత.!

0
Nano Urea
Nano Urea

Nano Urea: వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ జనాభా, అనూహ్యమైన వాతావరణ మార్పులు, వ్యవసాయ ఉత్పాదకత తగ్గడం, అస్థిర శ్రామిక శక్తి, పెరిగిన పట్టణీకరణ వంటి సమస్యలను పరిష్కరించడం ద్వారా మరింత ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి 21వ శతాబ్దంలో వ్యవసాయం అనేక రకాల సవాళ్లను ఎదుర్కొంటోంది. సాంప్రదాయ ఎరువుల యొక్క పోషకాల వినియోగ సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా నత్రజనిలో సుమారు 40`70 శాతం, ఫాస్ఫరస్‌ 80`90 శాతం, మరియు 50`90 శాతం పొటాషియం ఎరువులు పంటకు అందక పర్యావరణంలో కలిసిపోతున్నాయి. దీని వలన గణనీయమైన ఆర్థిక నష్టాలను చూడవలసి వస్తున్నది. ఈ సమస్యలు 2050 వ సంవత్సరం నాటికి ఇంకా తీవ్రతరమవుతాయి. అప్పటికి 900 కోట్ల ప్రపంచ జనాభాకు ఆహారం అందించాల్సి వస్తుంది. ఎల్లప్పుడూ తగ్గుతున్న వనరులు, పెరుగుతున్న ప్రపంచ జనాభాతో ఉన్న ప్రపంచంలో ఆహారం, మేత మరియు ఫైబర్‌ వంటి వనరులకు వ్యవసాయం మరింత ముఖ్యమైనది. ఈ సమస్యను  ఎదుర్కోవడానికి, వ్యవసాయ ఆధారిత దేశాలు మరింత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు, శ్రమను ఆదా చేసే పద్ధతులు మరియు పద్ధతులను అవలంభించాలి.

Nano Urea

Nano Urea

Also Read: Timber Plantations: లాభసాటిగా కలప మొక్కల పెంపకం.!

నానోటెక్నాలజీ ఒక ఆశాజనక సాధనం మరియు ఖచ్చితమైన వ్యవసాయ పద్ధతుల యొక్క కొత్త శకానికి ఊతమిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందువల్ల ఈ సమస్యలకు పరిష్కారంగా ఆవిర్భవించవచ్చు. నానో టెక్నాలజీ వలన మారుతున్న వాతావరణ పరిస్థితులలోను వ్యవసాయంలో పర్యావరణానికి హానికలుగ చేయకుండా అధిక దిగుబడులను సాధించేందుకు దోహదపడుతుంది.

ఇఫ్కో నానో యూరియా అనేది నానోటెక్నాలజీ ఆధారిత విప్లవాత్మక అగ్రి ఇన్‌ పుట్‌. ఇది మొక్కలకు నత్రజనిని అందిస్తుంది. రైతులకు నానో యూరియా అనేది ఆధునిక వ్యవసాయం చేపట్టడానికి మరియు వాతావరణ మార్పులను అధిగమించడానికి ఒక స్థిరమైన ఎంపిక. నానో యూరియా ఎరువుగా మొక్క యొక్క పోషక అవసరాలను తీర్చడంలో దోహదపడుతుంది. ఎందుకనగా దీని  యొక్క కణ పరిమాణం సుమారు 20-50  మరియు అంతకంటే ఎక్కువ ఉపరితల వైశాల్యం (1 మిమీ యూరియా ప్రిల్‌ కంటే 10,000 రెట్లు) మరియు కణాల సంఖ్య (1 మిమీ యూరియా ప్రిల్‌ కంటే 55,000 నత్రజని కణాలు) కారణంగా నానో యూరియా ఆకులపై పిచికారీ చేయడం వలన మొక్క మరింత ప్రభావవంతగా గ్రహిస్తుంది.  అందువల్ల, నానో యూరియా పంటకు దాని లభ్యతను 80% కంటే ఎక్కువగా పెంచుతుంది, దీని ఫలితంగా అధిక పోషక వినియోగ సామర్థ్యం ఏర్పడుతుంది. దీనికి అదనంగా, పంట పొలాల నుండి ఆవిరి రూపంలోను మరియు నేల నుంచి నీటిలో కరిగే పోషకాలను కోల్పోవడం వలన పెరిగే పర్యావరణ కాలుష్యం మరియు వాతావరణ మార్పులను  తగ్గించడంలో నానో యూరియా సహాయపడుతుంది.

ఇఫ్కో నానో యూరియా ఉపయోగాలు:

. ఆకులలో పత్రహరితం మరియు కిరణజన్య సంయోగక్రియ పెరగడం మరియు వేరు బయోమాస్‌ పెరగడం మరియు పిలకలు/కొమ్మలు సంఖ్య పెరగడం వల్ల అధిక దిగుబడులు లభిస్తాయి.

. సూక్ష్మ పరిమాణం మరియు ఎక్కువ ఉపరితల వైశాల్యం మరియు ఘనపరిమాణం నిష్పత్తి కారణంగా, ఇఫ్కో నానో యూరియా కణాలు మొక్కకు  సులభంగా లభిస్తుంది.

. పెట్టుబడి  ఖర్చులు తగ్గించడం, అధిక దిగుబడులు మరియు నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా  రైతుల ఆదాయం పెరగడానికి దోహదపడుతుంది.

. ఇఫ్కో నానో యూరియా ఉపయోగించిన పంటలు వినియోగానికి సురక్షితంగా ఉంటాయి. అలాగే పంటలో ప్రోటీన్‌ మరియు పోషకాల యొక్క నాణ్యత మెరుగ్గా ఉంటుంది.

. పంట యొక్క క్లిష్టమైన ఎదుగుదల దశల్లో ఇఫ్కో నానో యూరియా ఆకులపై పిచికారీ చేయడం వలన పంటకు అవసరమైన నత్రజనిని సమకూరుస్తుంది.

. ఇఫ్కో నానో యూరియా యొక్క ఒక బాటిల్‌ (500 మిలీ) యొక్క మెరుగైన వినియోగ సామర్థ్యం వలన కనీసం 1 బ్యాగు సంప్రదాయ యూరియాను భర్తీ చేయగలదు.

. వ్యవసాయంలో సుస్థిరత మరియు పర్యావరణ భద్రతను ఇఫ్కో నానో యూరియా వాడడం వలన సాధించవచ్చు.

. నానో యూరియా వాడడం వలన  సాంప్రదాయ యూరియా ద్వారా జరిగే నష్టాలను అనగా  పంట పొలాల నుండి ఆవిరి రూపంలోను మరియు నేల నుంచి నీటిలో కరిగే పోషకాలను కోల్పోవడం తగ్గిస్తుంది.

. సంప్రదాయ యూరియా బస్తా ఎరువులతో పోలిస్తే ఇఫ్కో నానో యూరియా తక్కువ పరిమాణంలో అవసరం అవుతుంది. రవాణా మరియు గోదాము ఖర్చు పరంగా ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. యూరియా బస్తాలతో పోలిస్తే నానో యూరియా బాటిల్స్‌ ని రైతులు తేలికగా తీసుకెళ్లవచ్చు.

నానో యూరియా పిచికారీ కొరకు అనువైన  పంటలు:
ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పూల తోటలు, ఔషధ మొక్కలు  మరియు ఇతర పంటలకు నానో యూరియాను పిచికారీ చేయవచ్చు.

నానో యూరియా ఎంత మోతాదులో మరియు ఎప్పుడు వాడాలి?
ఒక లీటరు నీటిలో 2-4 మి.లీ నానో యూరియా ని కలపి పంట క్రియాశీల దశల్లో ఆకులపై పిచికారీ చేయాలి.

మొదటి పిచికారీ: మొలకెత్తిన 30-35 రోజుల తరువాత లేదా నాటిన 20-25 రోజుల తరువాత.

రెండొవ పిచికారీ: మొదటి పిచికారీ చేసిన 20-25 రోజులు తరువాత లేదా పంట పూతదశకు  ముందు
గమనిక `దుక్కిలో నత్రజనిని అందించే డిఎపి లేదా సంక్లిష్ట ఎరువులను వేయడం ఆపకూడదు. పంట, దాని కాలవ్యవది, మొత్తం నత్రజని అవసరాన్ని బట్టి పిచికారీ సంఖ్యను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.

టి.స్వామి చైతన్య, శాస్త్రవేత్త (వాతావరణ విభాగం),
కె. నీలిమ, యువ నిపుణులు (బయోటెక్‌ కిసాన్‌ హబ్‌,
డా. డి.వి. శ్రీనివాసులు, శాస్త్రవేత్త (సేద్య విభాగం),
డా. ఎ. వీరయ్య ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌, కే.వి.కే ఊటుకూరు, కడప.

Also Read: Green Manure Cultivation: పచ్చి రొట్ట పైర్లసాగుతో భూమికి సారం- రైతుకు లాభం

Leave Your Comments

Silage: పచ్చిమేతను పాతర (సైలేజి) వేసుకోవడం ఎలా?

Previous article

Saffron Flowers: కుసుమ పువ్వులతో అధిక ఆదాయం.!

Next article

You may also like