Organic Fertilizers: అధిక మోతదులో రసాయనిక ఎరువుల వాడకం వలన నేల భౌతిక స్థితులు దెబ్బతిని నేల సారం తగ్గిపోతుంది. అంతే కాదు రైతుకు పెట్టుబడి కూడా పెరుగుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే రైతులు తప్పని సరిగా సేంద్రీయ ఎరువులు వాడాలి. సేంద్రీయ ఎరువులలో జీవన ఎరువులు కూడా ఒకటి. జీవన ఎరువులను వాడటం వలన నేలలో జీవరాశులు పెంపొందించడంతో పాటు నేలకు సారం పెరిగి నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు.
జీవన ఎరువులలో నత్రజనిని స్థిరీకరించేవి, భాస్వరాన్ని అందించేవి ఉన్నాయి.ఈ ఎరువులు పొడి రూపంలోనె కాక ద్రవ రూపంలోను అందుబాటులో ఉన్నాయి. అసలు ఈ జీవన ఎరువులు ఎందుకు వాడుకోవాలి, ఏలా వాడుకోవాలి, వాడకం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో రైతులు రసాయనిక ఎరువుల అధికంగా వాడటం వలన నేలలో రకరకాల మార్పులు వచ్చి కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. అదే విధంగా రైతులకు పెట్టుబడి కూడా పెరుగుతుంది. జీవన ఎరువులు వాడకం వలన రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు .
నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు
రైజోబియం :
ఈ రైజోబియం జీవన ఎరువును అపరాల పంటలలో ఎక్కువగా వాడతారు. ప్రధానంగా పెసర, మినుము, కంది ,సోయచిక్కుడు, వేరుశెనగ పంటలలో ఎక్కువగా వాడతారు.
వాడే విధానం:
100 మిల్లీ లీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం వేసి కలిపి మరిగించి చల్లార్చుకోవాలి. ఈ చల్లార్చిన ద్రావణం 10 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేలా చేయాలి. ఈ ప్రక్రియ రైతులు పాలిథిన్ సంచిని గాని, ప్లాస్టిక్ తొట్టిని గాని ఉపయోగించి చేసుకోవచ్చు. పట్టించిన విత్తనంను 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి తరువాత పొలంలో నాటుకోవాలి.
Also Read: Okra Ladies Finger Farming: వర్షాకాలం బెండ సాగులో మెళకువలు.!
అజటోబాక్టర్ :
పప్పు జాతి పంటలకు తప్ప మిగతా అన్ని పంటలలో నత్రజని జీవన ఎరువుగా వాడతారు. చెఱకు, ప్రొద్దు తిరుగుడు, జొన్న, మొక్క జొన్న, ప్రత్తి, మిరప పంటలలో వాడతారు.
వాడే విధానం:
ఏ పంటకు వాడినా గాని 2 కిలోల కల్చర్ ను 200 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో ఒక ఎకరం నేలపై వేదజల్లవలేను.
అజోస్పైరిల్లుం :
మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వ్రేళ్ళలోకి చొరబడి కూడా జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులో ఉంటుంది. వరి, చెఱకు, ప్రొద్దు తిరుగుడు, జొన్న, మొక్క జొన్న, సజ్జ, ప్రత్తి, మిరప, అరటి పంటలలో వాడతారు.
వాడే విధానం:
2 కిలోల కల్చర్ ను 80-100 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో విత్తనం క్రింద పడేటట్లు వేసుకోవాలి. వరి లాంటి పంటలకు నారు నటేటప్పుడు, నారు వ్రేళ్ళను ఈ జీవన ఎరువు ద్రావణం లో ముంచి నాటుకోవాలి. అలాగే చెఱకు కూడా ముచ్చెలను నాటే ముందు ఈ జీవన ఎరువు ద్రావణం లో ముంచి నాటుకోవాలి.
నీలి ఆకుపచ్చ నాచు:
ఇది వరికి మాత్రమే ఉపయోగపడే నత్రజని జీవన ఎరువు. ఒక చిన్న ప్లాస్టిక్ తొట్టెలలో గాని, చిన్న మడులలో గాని పెంచుకొని వృద్ధి చేసుకోవాలి.
వాడే విధానం:
ఒక ఎకరం పొలంలో వరినాట్లు వేసిన తరువాత అంటే 3-7 రోజుల వ్యవధిలో 4-6 కేజీల ఈ జీవన ఎరువు 40-60 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి చల్లుకోవాలి. ఒక 15-20 రోజులలో పొలమంతా వ్యాపించి పెరుగుతుంది. ఆ తర్వాత పొలంలో నుంచి నీళ్ళను తీసినట్లైతే భూమికి అనుకొని కుళ్ళి నత్రజిని ని అందిస్తది.
అజోల్లా – అనబినా:
ఈ జీవన ఎరువు నీటిపై తేలియాడుతూ వరి పొలంలో పెరిగే ఫెర్న్ జాతి చిన్న మొక్క.నత్రజనిని స్థిరీకరించి వరి పైరుకు అందిస్తుంది. నత్రజని తో పాటు సేంద్రియ కర్బనం మరియు పొటాషియం అందిస్తుంది.
వాడే విధానం :
వరి నాటిన వారం తరువాత సుమారు 200 కిలోల అజోల్లా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15-20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి.ఆ తర్వాత పొలంలో నుంచి నీళ్ళను తీసినట్లైతే భూమికి అనుకొని కుళ్ళి నత్రజని తో పాటు సేంద్రియ కర్బనం మరియు పొటాషియం అందిస్తుంది.
భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు :
ఫాస్ఫో బ్యాక్టీరియా : ఈ జీవన ఎరువు నేలలోని భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తుంది. ఈ జీవన ఎరువు అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు.
ఈ జీవన ఎరువులతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి రైతులు ఈ జీవన ఎరువుల ను సేంద్రియ ఎరువులుతో పాటుగా అలాగే అవసరమైన రసాయన ఎరువులుతో సమగ్రంగా వాడుకున్నట్లైతే అధిక లాభాలు పొందవచ్చు.