Plant Nutrition: మొక్కలు వాటికి అవసరమైన పోషకాలను నేల నుండి గ్రహిస్తాయి. మొక్కల పెరుగుదలకి, ప్రత్యుత్పత్తికి 16 రకాల పోషకాలు అవసరం అవుతాయి. మొక్కలలో పోషకాల వినియోగం చాలా ఉంటుంది. పోషక పదార్థాలు లేకపోతే మొక్కల పెరుగుదల కూడా ఆగిపోతుంది. పోషక పదార్థాలు మొక్కలకి చాలా ముఖ్యమైనవి.
మూడు రకాల పోషక పదార్థాలు ఉన్నాయి.
1. మూల పోషకాలు: కర్బనము, ఉదజని, ఆమ్లజని పదార్థాలు ఉంటాయి. ఈ పోషక పదార్థాలు మొక్కలు గాలి నుండి గ్రహిస్తాయి. ఈ పదార్థాలు మొత్తం మొక్కలో 96% ఉంటుంది.
2. స్థూలపోషకాలు: కర్బనము, ఉదజని, ఆమ్లజని తర్వాత ఎక్కువ మొత్తంలో మొక్కలు గ్రహించే పోషకాలను స్థూలపోషకాలు అంటారు. ఇందులో మరల రెండు రకాలు:
i). ప్రధాన (ముఖ్య పోషకాలు): నత్రజని, భాస్వరం, పొటాషియం పదార్థాలని ప్రధాన పోషకాలు అంటారు.
ii) ద్వితీయ పోషకాలు: సున్నం, మెగ్నీషియం, గంధకం పదార్థాలని ద్వితీయ పోషకాలు అంటారు.
3. సూక్ష్మ పోషకాలు: సూక్ష్మ పోషకాలు మొక్కకు చాలా తక్కువ పరిమాణంలో అవసరం అవుతాయి. కానీ ఈ పోషకాలు మాత్రం చాలా ముఖ్యమైనవి. ఇనుము, జింక్, రాగి, బోరాన్, మాలిబ్దినం, మాంగనీసు, క్లోరిన్ పోషకాలని సూక్ష్మ పోషకాలు అంటారు. అనేక జీవరసాయన క్రియలు మీద ఆధారపడి జరుగుతాయి. కొన్ని ఎంజైములకు చైతన్యకారకంగా పనిచేస్తుంది.ఈ సూక్ష్మ పోషకాలు ఉండటం వల్ల పూత, పిందె కట్టడం ఎక్కువవుతుంది. నీటి నిలువ తట్టుకునే శక్తిని పెంచుతుంది.
పోషకాలు నాలుగు గ్రూపులుగా విభజించారు:
గ్రూపు – 1: మొక్క మూలాధారిత నిర్మాణ వ్యవస్థకు తోడ్పడే పోషకాలు కర్బనము, హైడ్రోజన్, ఆక్సిజన్.
గ్రూపు-2: మొక్కలలో శక్తి నిలువ సరఫరా, బాండింగ్ నిర్వహించే పోషకాలు, నత్రజని, గంధకం, భాస్వరం, ఇవి మొక్క నిర్మాణ వ్యవస్థ చురుకుగా పనిచేయటానికి సహకరిస్తాయి.
గ్రూపు – 3: మొక్కలలో చార్జ్ బ్యాలన్స్ చేయటానికి అవసరమయ్యే పోషకాలు: పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం.
గ్రూపు – 4: ఎంజైముల ఉత్తేజకారకాలుగాను, ఎలక్ట్రాన్లను సరఫరా చేయుటలోను ఇతర పదార్థాల రవాణాలోను ఇనుము, జింక్, రాగి, బోరాన్, మాలిబ్దినం, మాంగనీసు, క్లోరిన్ పోషకాలు అవసరమవుతాయి.
Also Read: Irrigation System: నీటి పారుదల పద్దతులతో నీటిని ఎలా ఆదా చేసుకోవచ్చు.!
మొక్క ఎదుగుదలలో పోషక పదార్థాల పాత్ర :
1. నత్రజని: మొక్కలో ఉండే మొత్తం నత్రజనిలో 70% ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఇంకా వివిధ రకాల మాంసకృత్తులలో, ఎంజైములలో ఉంటుంది. మొక్క ఎదుగుదల పూత, పిందె పట్టడం, కాయ పరిమాణం ఎదుగుదలలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. వివిధ రకాల ఎంజైములకు ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. నత్రజని లోపంతో మొక్క పెరుగుదల, పూత రాలిపోవడం. ఆకులు చిన్నవిగాను, ముదిరిన ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. మొక్కలు ఎదుగుదల తగ్గి, పొట్టిగా, పీలగా ఉండి, త్వరగా పూతకు వస్తాయి. పంట దిగుబడి తగ్గుతుంది.
నత్రజని అధికమైతే కలిగే అనర్థాలు : శాఖీయ ఉత్పత్తి అధికమవుతుంది. కాండం, ఆకులు ముదురాకు పచ్చగా మారుతాయి, చీడపీడల ఉధృతి ఎక్కువవుతుంది. పూత, కాత ఆలస్యమవుతుంది.
2. భాస్వరం: భాస్వరం సూక్లియో ప్రొటీన్లలో, కేంద్రక ఆమ్లాలలో, ఫాస్ఫోలిపిడ్స్, సుగర్ ఫాస్పేట్ లో, కో-ఎంజైములలో ఉండే ముఖ్యమైన పోషకం వేరు వ్యవస్థ అభివృద్ధికి ముఖ్యం.
భాస్వరం లోపలక్షణాలు : వేరు వ్యవస్థ పెరుగుదల తగ్గి, మొక్క ఎదుగుదల తగ్గుతుంది. పత్ర దళం అడుగుభాగం, ఈ నెల , అంచులు, కాండం ఎర్రని రంగుకు మారుతాయి.
భాస్వరం అధికమైతే కలిగే అనర్థాలు: నత్రజని , ఇనుములోపాలు ఎక్కువవుతాయి. మొక్కలు పొట్టిగాను, వేరు పెరుగుదల తగ్గిపోతాయి.
3. పొటాషియం : మొక్కలో తయారైన పిండి పదార్థాలు తయారైన చోటు నుండి నిలువ చేసే ప్రదేశాలకు సరఫరా చేయటంలో పొటాషియం, ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
పొటాషియం లోపలక్షణాలు : ఆకుల అంచులు, కొనమొగ్గలు ఎండి పోతాయి ఆకులు ఆకుపచ్చ రంగు కోల్పోయి, ముడుచుకు పోతాయి. చీడపీడలు త్వరగా ఆశిస్తాయి. దిగుబడి తగ్గుతుంది.
4. కాల్షియం: కణ కవచంలో “కాల్షియం పెక్టేటు” గా ఉండి ధృఢత్వాన్ని, కొన్ని ఎంజైములకు చైతన్య కారకంగా, పిండి పదార్థాల ఏర్పాటు చేయడంలో తోడ్పడుతుంది. కాల్షియం లోపిస్తే వేర్లు చనిపోతాయి.
5. మెగ్నీషియం : అనేక ఎంజైములకు ఉత్ప్రేరకంగాను, భాస్వరం రవాణాకి తోడ్పడుతుంది. ఈనెలు మాత్రం ముదురాకుపచ్చ రంగు ఉండి. ఆకుపచ్చ రంగును కోల్పోతాయి.
6. గంధకం: సిస్టీన్, మిథియోనిన్లో ఉండే ప్రొటీన్ల తయారీకి వాడుతారు.గంధకం లోపిస్తే ఆకులు పూర్తి పసుపు రంగుకు మారుతాయి.
7. ఇనుము: అనేక జీవ రసాయన చర్యల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది లోపిస్తే ఆకులు తెలుపుగా మారుతాయి. మొక్క పెరుగుదల తగ్గి, సన్నగా ఉంటాయి.
8. జింకు: మొక్క పెరుగుదలకు, హార్మోన్ల ఉత్పత్తిలోను, ఎంజైములను ఉత్తేజపరచటంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. జింకు లోపిస్తే, ఆకులు చిన్నవిగా మారి వంచినప్పుడు ఫట్ మని విరిగి పోతాయి. ఆకుల మొదటి భాగంలో పధ్య ఈనె ఆకుపచ్చ రంగును కోల్పోయి పసుపు రంగుకు మారుతుంది.
9. మాంగనీసు : ఇది శ్వాసక్రియలో, కిరణజన్య సంయోగక్రియ, నత్రజని స్థిరీకరణలో, ఎంజైములను ఉత్తేజపరచటంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. దీని లోపం వల్ల ఆకులు లేత ఆకుపచ్చరంగుకు మారి, గోధుమ రంగుల మచ్చలను కలిగి ఉంటాయి.
10. రాగి ఇది కొన్ని ఎంజైములను ఉత్తేజపరుస్తుంది. దీని లోపం వల్ల లేత ఆకులు ముదురాకు పచ్చగామారి, వంకర్లు తిరుగుతాయి.
11. బోరాన్ : మొక్కలో పిండి పదార్థాల మార్పుకు, చక్కెర పదార్థాల రవాణాకు అవసరం. బోరాన్ లోపించిన మొక్కలలో శిఖరాగ్రం పనిచేయదు, వేర్లు చనిపోతాయి.
12. మాలిబ్దినం : నత్రజని స్థిరీకరణకు అవసరమైన ఎంజైములలో ఇది అంతర్భాగంగా ఉంటుంది. ఇది లోపిస్తే ఆకులు ముడుచుకుపోయి, ఆకు పచ్చ రంగును కోల్పోయి, ఆకులపై కుళ్ళి ఎండిన మచ్చలు ఏర్పడుతాయి.
13. క్లోరిన్: ఆక్సిన్స్ హర్మోన్ల ఉత్పత్తికీ ఎంజైముల చైతన్యానికి క్లోరిన్ అవసరం. దీని లోపం వలన ఆకులు ఆకుపచ్చరంగును కోల్పోయి ముదురు గోధుమ రంగుకు మారుతాయి.
Also Read: Different Types of Water Soil: నేలలో ఉండే నీళ్లు ఎన్ని రకాలు ఉంటాయి?