నేలల పరిరక్షణ

Soil Testing: భూసార పరీక్ష గురించి సందేహాలు- సలహాలు.!

1
Soil Testing
Soil Testing

Soil Testing: 1. భూసార పరీక్ష ఎందుకు చేయించుకోవాలి?
నేలలో ఉన్న పోషక విలువల స్థాయిని తెలుసుకోవడం కోసం భూసార పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు తగ్గి అధిక, సుస్థిర దిగుబడులను పొందవచ్చు.

Soil Testing

Soil Testing

Also Read: Timber Plantations: లాభసాటిగా కలప మొక్కల పెంపకం.!

2. భూసార పరీక్ష చేయించుకోవడం వలన ఉపయోగాలు ఏమిటి?
. నేలలోని పోషక లోపాలని గుర్తించవచ్చు.
. ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులని తగ్గించుకోవచ్చు.
. అధిక మరియు సుస్థిర దిగుబడులను పొందవచ్చు.
. భూసార పరీక్ష ఫలితాలను అనుసరించి ఆ నేలలకి అనువైన పంటలు, రకాలను సూచించవచ్చు.
. అవసరమైన పచ్చి రొట్ట ఎరువులు మరియు జీవన ఎరువులను సూచించవచ్చు.

3. రైతులు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్ష చేయించుకుంటే మంచిది?
రైతులు తమ పొలంలోని మట్టిని రెండు సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. నేలలోని పోషకపదార్థాల స్థాయి గురించే కాక భూమిలోని చౌడు గుణాలను,సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు కూడా మృత్తిక పరీక్ష ఉపయోగపడుతుంది.

4. మట్టి నమూనా సేకరణకి అనుకూల సమయం తెల్పండి?
పంట తీసిన తర్వాత వేసవికాలంలో మట్టి నమూనా సేకరణకు అత్యంత అనుకూలమైన సమయం.

5. పొలంలో మట్టి నమూనా కొరకు మట్టిని సేకరించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మొదటగా సేకరించిన మట్టిలో పంట వేర్లు, రాళ్లు లేకుండా చూసుకొని నీడలో ఆరబెట్టాలి.ఈ విధంగా చేసిన తర్వాత ఆ మట్టిని ఒక దగ్గరగా చేర్చి, బాగా కలిపి నాలుగు భాగాలుగా చేసుకుని అందులో ఎదుటి భాగాలు తీసుకొని మిగతా భాగాన్ని తీసివేసి ఈ విధంగా మట్టిని అరకిలో వచ్చే వరకు చేయాలి. అదే విధంగా మట్టి నమూనా సేకరణకు రసాయనిక లేదా సేంద్రియ ఎరువుల సంచులను వాడకూడదు. శుభ్రమైన ప్లాస్టిక్‌ షీటును వాడాలి.

6. వాలు ఎక్కువగా ఉన్న పొలంలో  భూసారపరీక్ష  కొరకు మట్టినమునా సేకరణ ఏ విధంగా చేయాలి?
పొలంలో వాలు ఎక్కువగా ఉన్నప్పుడు దానిని ఎత్తు, పల్లపు ప్రాంతాలుగా విభజించి వేరు వేరుగా మట్టి నమూనాలని సేకరించాలి. గట్ల దగ్గర, పంట కాల్వలలోను మరియు చెట్ల క్రింద ఉన్న పొలం భాగం నుండి మట్టిని  సేకరించరాదు.ఎరువు కుప్పలు వేసి ఉంచిన చోట, ఎప్పుడు నీరు ఎక్కువగా నిలబడి ఉండే పల్లపు ప్రాంతాల్లో కూడా మట్టిని సేకరించరాదు.

7. పొలంలో మట్టి నమూనా సేకరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
చెట్ల క్రింద ఉన్న నేల భాగం నుండి మట్టిని తీసుకోరాదు. పంట కాలువలలోనూ, గట్ల దగ్గరలోనూ మట్టిని సేకరించరాదు. ఎప్పుడు పల్లపు స్థలాల్లో మట్టిని సేకరించరాదు. కంపోస్టు ,పశువుల పేడ, పచ్చిరొట్ట, వర్మి కంపోస్ట్‌ కుప్పలు వేసి ఉంచిన చోట మట్టిని తీసుకోరాదు.

8. నేను మట్టి పరీక్ష చేయించాలి అనుకుంటున్నాను. మట్టిని పొలంలో ఎన్ని చోట్ల సేకరించాలి?
మీరు కూరగాయలు మరియు ఇతర వ్యవసాయ పంటల కొరకు అయితే ఎకరాకు 8 నుండి 10 చోట్ల మట్టిని సేకరించాలి. పండ్ల తోటల్లో ఎకరాకు 2`4 చోట్ల తీసుకుంటే సరిపోతుంది.

9. భూసార పరీక్ష కేంద్రానికి ఎంత పరిమాణంలో మట్టినమూనా పంపించాలి?
భూసార పరీక్ష కేంద్రానికి పంపిచడానికి అరకిలో మట్టినమూనా సరిపోతుంది. పొలంలో మట్టి నమూనా సేకరించేటప్పుడు ఎక్కువ మొత్తంలో ఎక్కువ స్థలాలలో సేకరించాలి. సేకరించిన మట్టిని నీడలో ఆరబెట్టి, ఆ మట్టిని  బాగా కలిపి నాలుగు భాగాలుగా చేసుకుని అందులో ఎదుటి భాగాలు తీసుకొని మిగతా భాగాన్ని తీసివేసి ఈ విధంగా మట్టిని అరకిలో వచ్చే వరకు చేయాలి.

10. మట్టి నమూనాను భూసార పరీక్షా కేంద్రానికి పంపునప్పుడు ఏ ఏ వివరాలు తెలియజేయాలి?
భూసార పరీక్ష కేంద్రానికి మట్టి నమూనాను ఈ క్రింది సమాచారంతో పంపించాలి.
. రైతు పేరు, సర్వే నెంబర్‌, గ్రామం, మండలం.
. కావలసిన పరీక్ష (చౌడు, భూసార, పండ్ల తోట ఎంపికకు)
. ఇంతకు మునుపు పంట దానికి వాడిన ఎరువులు.
. వేయ బోవు పంట సాధారణంగా రైతులు కాగితం పై పైన తెలిపిన విషయాలు రాసి మట్టి నమూనా తో పాటు సంచిలో వేసి భూసార పరీక్ష కేంద్రానికి పంపించాలి.

11. నా పొలంలో అక్కడక్కడ చౌడు ప్రాంతంగా ఉన్నట్టు అనుమానం కలుగుతుంది. మట్టి నమూనా సేకరణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పొలంలో అక్కడక్కడా చౌడు ప్రాంతంగా ఉన్నట్లు అనుమానం కలిగితే అక్కడి నుండి ప్రత్యేకంగా నమూనాను తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కొరకు పంపించాలి.  అటువంటి మట్టిని మంచిగా ఉన్న ఇతర ప్రాంతపు మట్టితో కలపరాదు.

12. పొలంలో పంట ఉన్నప్పుడు మొక్కల మధ్య మట్టి నమూనా సేకరించవచ్చా?
పంట ఉన్నప్పుడు మొక్కల మధ్యలో మట్టి నమూనా సేకరించరాదు. దీనివలన ఖచ్చితమైన ఫలితాలు రావు. మట్టి నమూనా సేకరణ పంటకాలం ముగిసిన తర్వాత చేసుకోవాలి ఏప్రిల్‌, మే నెలలో మట్టి నమూనా సేకరణకు అనుకూలం.

13. పండ్ల తోటల్లో సమస్యల గుర్తింపుకు మట్టి నమూనా ఎంత లోతులో సేకరించుకోవాలి?
సాధారణంగా పంటను బట్టి మూడు నుండి ఆరు అడుగుల లోతు గుంత తవ్వి ప్రతి అడుగుకి కొంత మట్టిని సేకరించాలి. మట్టి నమూనా తీయునప్పుడు క్రింది లోతు నుండి మొదటి మట్టి నమూనా తీసుకొని, ఆ తర్వాత పై పొరల నుండి మట్టిని సేకరిస్తే పై మట్టి క్రింది మట్టితో కలవదు. మట్టి నమూనా కొరకు గుంత తవ్వుతున్నప్పుడు ఏవైనా గట్టి పొరలు ఉన్నట్లయితే వాటి లోతు మరియు లక్షణాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎకరాకు రెండు నుండి నాలుగు చోట్ల మట్టి నమూనా సేకరిస్తే మంచిది.ఈ నమూనాని పరీక్ష కొరకు పంపినప్పుడు పండ్లతోటలకు అనువైన పరీక్షల కొరకు అని తెలియజేయాలి.

14. భూసార పరీక్ష కేంద్రాలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి?
ప్రతి జిల్లాలోని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మరియు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ వారి వ్యవసాయ పరిశోధన కేంద్రాలు మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో భూసార పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇతర వివరాల కొరకు దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించగలరు.

15. ఒక మట్టి నమూనాని పరీక్షించుటకు ఎంత ఖర్చు అవుతుంది?
ఒక మట్టి నమూనా యొక్క ఉదజని సూచిక, లవణసూచిక, సేంద్రీయ కర్బనం, లభ్య నత్రజని, లభ్య భాస్వరం మరియు లభ్య పొటాష్‌ ని తెలుసుకోవడానికి   సుమారు 300 రూపాయల రుసుము, వీటితో పాటుగా లభ్య సుక్ష్మపోషకాలు కూడా తెలుసుకోవడానికి సుమారు రూ. 800/` రుసుము చెల్లించవలసి ఉంటుంది.

16. భూసార పరిరక్షణ కోసం వేసవిలో రైతులు చేపట్టవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి?
భూసారాన్ని కాపాడుకోవడానికి రైతులు ముఖ్యంగా ఆరు పద్ధతులను పాటించడం ద్వారా వేసవిలో భూసార పరిరక్షణ సాధించవచ్చు.

. భూసార పరీక్షలు చేసి రైతులు తమ యొక్క నేలలోని పోషక విలువలు స్థాయి ని గుర్తించడం ముఖ్యం. ఈ పరీక్షలు రానున్న రోజుల్లో ఎంత మొత్తంలో ఎరువులను వాడుకోవాలో తెలియజేస్తూ అధిక ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తుంది.

. వర్షాకాలానికి ముందు మే నెలలో వేసవి దుక్కులు ఉండడం వల్ల ఎన్నో రకాలైన చీడపీడలు తగ్గించుకోవడమే కాక నేల యొక్క నీటి నిలువ స్థాయిని పెంచుకుని దిగుబడిని పెంచుకోవడానికి అవకాశం ఉంది.

. సేంద్రియ ఎరువులను వాడుకోవడం వల్ల రసాయన ఎరువుల స్థాయిని తగ్గించుకుని పంట ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాక ఆహార ధాన్యాల నాణ్యతను కూడా పెంచుకోవచ్చు.

. పచ్చి రొట్ట ఎరువులను వాడుకోవడం ద్వారా నేలలోని సేంద్రియ పదార్థం స్థాయిని పెంచుకుని సూక్ష్మజీవులకు అనువైన పరిస్థితులను నెలకొల్పి మొక్కలకు సరైన మోతాదులో అన్ని రకాల ధాతువులను అందేలా చూసుకోవచ్చు. అదేవిధంగా గాలిలోని నత్రజని స్థిరీకరించి పంటకు అనువుగా మార్చి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించు కోవచ్చు.

. చెరువు మట్టిని కూడా రైతులు తమ నేలలో వేసుకుని నేల యొక్క పోషక విలువల స్థాయిని పెంచుకోవచ్చు.

. నేల చదునుగా లేని ప్రదేశాలలో వాలుకు అడ్డంగా సాగు చేసుకుని నేల యొక్క క్రమక్షయంని తగ్గించుకుంటూ సారవంతమైన నేల పై పొరను కొట్టుకు పోకుండా కాపాడుకోవచ్చు.

ఎం. జ్యోతి, డా. ఎం. రాజేశ్వర్‌ నాయక్‌ (కార్యక్రమసమన్వయకర్త),
డా. ఐ. తిరుపతి (పంట ఉత్పాదక శాస్రవేత్త), డా. శివకృష్ణ కోట (వ్యవసాయ విస్తరణ శాస్రవేత్త),
ఏ.నాగరాజు (కీటక శాస్రవేత్త), డా. ఉల్లంగుల స్రవంతి (ఉద్యాన శాస్రవేత్త),
డా. బొల్లవేణి సతీష్‌ కుమార్‌ (వాతావరణ శాస్రవేత్త), కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా.

Also Read: Heliconia Crop: కొబ్బరి మరియు ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతరపంటగా హెలికోనియా.!

Leave Your Comments

Timber Plantations: లాభసాటిగా కలప మొక్కల పెంపకం.!

Previous article

Tholakari Suggestions: తొలకరి -సలహాలు-సూచనలు

Next article

You may also like