Ulli Kodu Management: మన రాష్ట్రంలో సాగుచేసే ఆహారధాన్యపు పంటలలో వరి పంట ప్రాధానమైనది. ఈ పంట ప్రతి ఏటా సుమారు 58 లక్షల ఎకరాలలో సాగుచేయబడుతూ 93 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ పంటపై ఉల్లికోడు సమస్య ఉధృతమవుతున్నది. కావున ఉల్లికోడు యాజమాన్యం పై రైతులు అవగాహన ఏర్పరుచుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఉల్లికోడు తల్లిపురుగు దోమ ఆకారం మరియు పరిమాణంలో ఉంటుంది. ఆడ పురుగులు లేత ఎరుపు రంగులోనూ, మగ పురుగులు ముదురు ఎరుపు రంగులోనూ ఉంటాయి. ఒక ఆడ పురుగు 100`200 వరకు గుడ్లను విడివిడిగా గానీ, 3`4 గుడ్లను కలిపిగాని ఆకులపైన, ఆకు తొడిమెల పైన పెడుతుంది. గుడ్డు దశ 3`4 రోజులు ఉంటుంది. గుడ్ల నుండి బయటకు వచ్చిన పురుగులు లేత ఎరుపు రంగులో ఉండి, సూది మొన లాంటి ముందు భాగాలు కలిగి ఉంటుంది. ఈ పిల్ల పురుగులు ఆకు పొరల్లోనికి చొచ్చుకుపోయి అక్కడి కణజాలం తింటూ బ్రతుకుతుంది. లార్వా దశ సుమారు 15 రోజుల వరకు ఉండి, ఉల్లికోడు గొట్టంలో కోశస్థ దశ పూర్తి చేసుకుంటుంది. కోశస్థ 2`8 రోజుల వరకు ఉంటుంది.
పురుగు ఉధృతి / ఉనికి :
తొలకరి వర్షాలు పడిన వెంటనే ఉల్లికోడు తల్లి పురుగులు ముందుగా పొలం చుట్టూ ఉండే కలుపు మొక్కలను ఆశించి, కలుపు మొక్కలపై 1`2 తరాలు పూర్తి చేసుకొని నాట్లు వేసిన తరువాత వరి పంటను ఆశించి నష్టం కలుగజేస్తుంది. ఆలస్యంగా నాట్లు వేసిన పొలాలలో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సార్వాలో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో దాళ్వాలో కూడా ఈ పురుగు ఆశించి పంటకు నష్టం కలుగజేయడం గమనించడమైనది.
Also Read: పురుగు మందులతో జాగ్రత్త.!
నష్ట లక్షణాలు :
గుడ్ల నుండి బయటకు వచ్చిన మొదటి దశ లార్వాలు ముందుగా ఆకు ఒరలలోనికి చొచ్చుకు పోయి కణజాలం తింటూ పెరుగుతుంది. తరువాతి 6`12 గంటలలో లేత మొక్కల అకురాన్ని చేరుకొని అంకురాన్ని తింటూ పెరుగుతుంది. ఎదిగే క్రమంలో అంకురంలోనికి ‘‘సెసిడోజిన్’’ అనే రసాయనాన్ని చొప్పించడం వలన అంకురం ఉల్లికాడ వలె పొడవాటి గొట్టం లాగా మారి బయటకు వస్తుంది. ఇటువంటి గొట్టంలాగ మారిన పిలకల నుండి కంకులు/ వెన్నులు ఏర్పడవు.
యాజమాన్యం :
. ఈ పురుగు సాధారణంగా నారుమడి దశ నుండి పిలక దశ వరకు మాత్రమే వరి పంటను ఆశిస్తుంది.
. పొలం చుట్టూ ఉన్న గడ్డిజాతి కలుపు మొక్కలను పెరికి నాశనం చేయడం ద్వారా తరువాత వేసే వరి పంటకు ఆశించకుండా నివారించవచ్చు.
. ఉల్లికోడు ఎక్కువగా ఆశించే ప్రాంతాలల్లో తట్టుకునే రకాలైన కాకతీయ, సురేఖ, ఎర్రమల్లెలు, కావ్య, పోతన, శ్రీకాకుళం సన్నాలు వంటి రకాలను సాగుచేసుకోవాలి.
. ఆలస్యంగా వేసిన పోలాలలో ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది కనుక సాధ్యమైనంత తొందరగా నాట్లు వేయడం పూర్తి చేసుకోవాలి.
. జీవ నియంత్రణలో భాగంగా ఉల్లికోడును సమర్ధవంతంగా నియంత్రించే ‘‘ప్లాటిగాస్టర్ ఒరైజే’’ అనే పరాన్నజీవులు పొలంలో కనిపిస్తే తాత్కాలికంగా పురుగుమందుల పిచికారీ నిలిపివేయాలి.
. ఈ పురుగు ఆర్థిక నష్ట సహన పరిమితి దాటిన వెంటనే రసాయనాల ద్వారా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నారు మడి దశలో చదురపు మీటరుకు ఒక ఉల్లి కోడు సోకిన గొట్టం గానీ, పిలక దశలో చదరపు మీటరుకు 5% పురుగు ఆశించిన గొట్టాలు గానీ లేక దుబ్బుకు ఒక ఉల్లికోడు ఆశించిన పిలక ఉంటే ఆర్థిక నష్ట సహన పరిమితి దాటినట్టుగా గుర్తించి రసాయన మందులతో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
. నారుమడిలో నారు మొలకెత్తిన 10`15 రోజులకు ఒక సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున కార్బోఫ్యురాన్ 3 జి పలుచగా నీరు పెట్టి పొలంలో చల్లి, రెండు రోజుల పాటు ఆ నీరు బయటకు పోకుండా కంతలు కట్టివేయడం ద్వారా నాట్లువేసిన నెల రోజుల వరకు పురుగు పంట ఆశించకుండా చేయవచ్చు.
. ప్రధాన పొలంలో, నాట్లు వేసిన 10`15 రోజులకు ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యురాన్ 3 జి గుళికలు వేయాలి.
. 50`60 రోజుల తరువాత ఎటువంటి సస్యరక్షణ చర్యలు అవసరం లేదు.
ఈ విధముగా ఉల్లికోడు ఆశించే ప్రాంతాలలో పురుగును సకాలంలో గుర్తించి, సిఫారసుచేసిన నివారణా చర్యలు పాటించడం ద్వారా వరి పంటలో అధిక దిగుబడి సాధించే అవకాశం ఉన్నది.
Also Read: దమ్ము చేసిన పొలంలో వరిని నేరుగా విత్తే పద్ధతి.!