Paddy Crop Protection – సుడి దోమ:
పురుగు గుర్తింపు: పిల్ల పురుగులు మొదట్లో తెలుపు రంగులో ఉండి పెరిగిన తరువాత గోధుమ రంగులోకి మారుతాయి.పెద్ద పురుగుల రెక్కలు కలిగి గోధుమ రంగులో ఉండును. సగం రెక్కలు కలిగినవి కూడా ఉంటాయి.
లక్షణాలు: పిల్ల మరియు పెద్ద పురుగులు వరి దుబ్బు మొదళ్ళకి అనగా నీటి పై భాగాన ఉన్న మొదళ్ళకు గుంపులు, గుంపులుగా చేరి మొక్కలోని రసాన్ని పీల్చుట వలన మొక్కలు మొదట పసుపు రంగులోకి మారి క్రమేపి సుడులు, సుడులుగా ఎండిపోతాయి. దీనిని “సుడి తెగులు అంటారు.ఈ పురుగు మొదట్లో పొలంలో అక్కడక్కడ సుడులు, సుడులుగా లేక వలయాకారంలో పంట ఎండిపోతుంది. ఈ పురుగు ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు పైరు మొత్తం ఎండిపోతుంది. ఈ పురుగు గ్రాసీ స్టంట్ మరియు రాగ్డ్ స్టంట్ వైరస్ తెగుళ్ళను వ్యాప్తిచేస్తాయి.
నివారణ చర్యలు: ఈ పురుగును తట్టుకునే రకాలైన చైతన్య, క్రిష్ణవేణి, విజేత, ఇంద్ర, ప్రతిభ, అమర, కాటన్ దొర సన్నాలు, శ్రీధృతి రకాలను నాటుకోవాలి. సిఫార్సు మేరకు నత్రజని సంబంధమైన ఎరువులను వేయాలి.పొలాన్ని తరచు ఆరబెట్టాలి.బూప్రోఫెజిన్ 1.6 మి.లీ. (లేదా) డీనోటెప్యురాన్ 0.4 గ్రా.లు (లేదా) ఇమిడాక్లోప్రిడ్ + ఎథిప్రోల్ 0.25 గ్రా (లేదా) పైమెట్రోజైం 0.6 గ్రా.లు (లేదా) ఎసిఫేట్ 1.5 గ్రా. (లేదా) మోనో క్రోటోఫాస్ 2.2 మి.లీ., + డ్రైక్లోరోవాస్ 1.0 మి.లీ / 1 లీ॥ కలిపి మొక్క మొదళ్ళలో పిచికారి చేయాలి.ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటను వదలాలి. దీనినే “అల్లీస్” అని అంటారు.
Also Read: Paddy Gall Midge: వరిలో ఉల్లి కోడును ఎలా గుర్తించాలి.!
తెల్లమచ్చ దోమ:
లక్షణాలు: పిల్ల మరియు పెద్ద పురుగులు మొక్క నుండి రసం పీల్చుట వలన మొదటగా అవి పసుపు పచ్చగా మారి తరువాత గోధుమ రంగుకి మారుతాయి. దీనిని “హాపర్ బర్న్” అంటారు.ఈ పురుగు విసర్జించిన మలినం మీద శిలీంద్రాలు పెరగడం వలన “సూటిమోల్డ్” ఏర్పడుతుంది.
పచ్చదోమ:
పురుగు గుర్తింపు: పిల్ల పురుగులు లేత ఆకుపచ్చ రంగులోను, పెద్ద పురుగులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటి ముందు జత రెక్కల మద్యన నల్లని మచ్చ కలిగి మరియు రెక్కల చివర నల్లగా ఉండటం వలన సులభoగా గుర్తించవచ్చు.
లక్షణాలు: పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకులు మరియు మొక్కల నుండి రసంను పీల్చడం వలన ఆకులు పసుపు లేక గోధుమ రంగులోకి మారి మొక్కల గిడస బారిపోతాయి.ఈ పురుగులు వరిలో రైసుంగ్రోవైరస్ వ్యాధిని కలుగచేస్తాయి. ఈ వ్యాధి సోకిన మొక్కలు దుబ్బులలో పెరుగుదల తగ్గి, ఆకులు లేత పసుపు లేక నారింజ రంగుకి మారుతాయి. కంకిలో గింజలు పలుచగా ఉండి, కంకి బయటకు రాదు.ఈ వ్యాధి పిలకదశలో మాత్రమే ఆశిస్తుంది. కంకి దశలో ఆశించదు.
నివారణ చర్యలు: ఈ పురుగును తట్టుకునే రకాలైన విక్రమార్య, త్రిగుణ, దీప్తి, సురక్షలను నాటుకోవాలి.సిఫార్సు మేరకు నత్రజని సంబంధమైన ఎరువులను వేయాలి.వైరస్ తెగులు సోకిన మొక్కలను నాశనం చేయాలి.పిలక దశలో దుబ్బుకు 10 పురుగులు, ఈనిన తర్వాత దుబ్బుకు 20 పురుగులు ఉంచి నివారణ చర్యలు చేపట్టాలి.ఎకరానికి కార్బోప్యూరాన్ (3జి) 10 కే.జి లేదా మోనోక్రోటోఫాస్ 2.2 మి.మి. / 1 లీ నీటికి కలిపి పిచికారి చేయాలి.రసాయనికి పురుగు మందులైన ఇథోపెన్క్స్ 10% ఇ.సి. 2.0 మి॥లీ లేక ఎసిఫేట్ 75% డబ్ల్యూ.పి. 1.5 గ్రా. లేక బి.పి.యం.సి. 50 ఇ.సి. 2.2 మి.లీ లేక మోనోక్రోటోఫాస్ 2.0 మి.లీ లేక డాక్లోప్రిడ్ 0.4 మి.లీ లేక ఎసిటామిప్రిడ్ 0.25 గ్రా. లేక మోనోక్రొటోఫాస్ 2.2 మి.లీలు + డి.డి. వి.పి 1.0 మి.లీలు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Also Read: Techniques in Paddy Drying: ధాన్యం ఆరబెట్టుటలో కొన్ని మెళుకువలు.!