Spotted Pod borer in Greengram: రైతులు యాసంగిలో సాగు చేసే అపరాల్లో పెసర ముఖ్యమైన పంట. ప్రస్తుతం పెసర పూత దశ నుండి కాయ దశ వరకు ఉంది, ఈ తరుణంలో పెసర ఆశించే ముఖ్యమైన చీడపీడలలో మారుకా మచ్చల పురుగు ముఖ్యమైనది. కావున, రైతులు సకాలంలో ఈ పురుగు యొక్క ఉధృతి గమనించి సకాలంలో సరిjైున యాజమాన్య పద్దతులు పాటించాల్సిందిగా వివరించడం జరిగింది.
పురుగు యొక్క లక్షణాలు :
ఈ పురుగు మొగ్గ, పూత దశలో ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరకు జేర్చి గూడుగా కట్టి, కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినటం వలన పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది. గూడు దగ్గర లార్వా విసర్జితములు కన్పిస్తాయి. గూళ్ళు విప్పినచో తెల్లపు వర్ణం కలిగిన పిల్ల పురుగులను గమనించవచ్చు. ఉధృతి ఎక్కువగా ఉన్నచో పూత గెల బూజుగా మారును.
అనుకూలమైన పరిస్థితులు :
పూత దశలో మేఘావృతమైనప్పుడు, పొగ మంచు మరియు అడపాదడపా చిరు జల్లులు కురిసినప్పుడు, ఈ పురుగు ఉధృతికి కారణమయ్యే అనుకూలమైన పరిస్థితులు.
Also Read: Peepal Tree Health Benefits: ఒక్క రావి చెట్టుతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు!
యాజమాన్యం :
. పూతదశలో తప్పనిసరిగా పైరుపై 5 శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనె (1500 పిపియం) 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులు గ్రుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గ్రుడ్లు కూడా పగిలి చనిపోతాయి.
. మొగ్గ పూత దశలో అక్కడక్కడా కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెరిచి పిల్ల పురుగులు ఉన్నాయోమోనని పరిశీలించాలి. పిల్ల పురుగులు గమనించినట్లయితే వెంటనే క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేదా థయోడికార్బ్ 1 గ్రా. లేదా ఎసిఫేట్ 75 ఎస్.పి 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
. పంటలో గూళ్ళు గమనించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా క్వినాల్ ఫాస్ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా నోవాల్యూరాన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి మందులను మార్చి మార్చి 2-3 సార్లు పూత మరియు కాయ దశల్లో పిచికారీ చేసుకోవాలి.
. పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మి.లీ. లేదా క్లోరాంట్రానిప్రోల్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.