Shoot And Fruit Borer in Brinjal: వంగ ముఖ్యమైన కూరగాయాలలో ఒకటి, దీనిని శాఖాహార మరియు మాంసాహార రెండు వంటకాలలో కూడా ఎక్కువగా వాడతారు. అందుకే వంగను కూరగాయల రాజు గా కూడా పిలుస్తారు. ఇందులో డైటరీ ఫైబర్, ఆస్కార్బిక్ యాసిడ్, విటమిన్ K, ఫోలేట్, నియాసిన్, విటమిన్ B6, పాoటొథినిక్ యాసిడ్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ మరియు కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఖరీఫ్, రబీ, వేసవిలో ఏ సీజన్ లో అయినా సాగు చేయవచ్చు.
ఈ పంటను చాలా రకాల పురుగులు, తెగుళ్లు మరియు నులి పురుగులు ఆశించి దిగుబడిని ఎంతగానో తగ్గిస్తున్నాయి. వీటిలో వంగ రైతులకు కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు ప్రధాన ఆటంకంగా మారింది. ఈ పురుగు నివారణకు సుమారు 6-10 సార్లు పురుగు మందు పిచికారి చేసినా పురుగు వలన జరిగే నష్టం తగ్గట్లేదు. పూర్తిగా పురుగు మందులపై ఆధారపడి పోవడం, చిన్న మరియు సన్నకారు రైతులకు మంచి నాణ్యత కలిగిన పురుగు మందులు అందుబాటులో ఉండకపోవడం, ఇతర యాజమాన్య పద్దతులపై రైతులకు అవగహన లేకపోవడం వలన ఖర్చులు పెరగడమే కాకుండా పంట నష్టం కూడా తగ్గట్లేదు.
కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు చేసే నష్ట లక్షణాలు:
కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు ( ల్యుసినోడ్స్ ఆర్బోనాలిస్) గుడ్డు, లార్వా, ప్యూపా, తల్లి పురుగులతో కూడిన తన జీవిత చక్రాన్ని 27-32 రోజుల్లో పూర్తి చేస్తుంది. ఈ పురుగు 5-6 తరాలను పూర్తి చేసుకొని, ప్రధానంగా వంగ పంటను ఆశిస్తుంది. పురుగు దశలలో లార్వా మాత్రమే హాని చేస్తుంది. ఇది మొక్కలో కొమ్మలు, పువ్వులు, పువ్వు మొగ్గలు మరియు కాయలను ఆశించి నష్ట పరుస్తుంది. రైతులు ఖరీఫ్లో పంట వేస్తే ఎక్కువ ఈ పురుగు యొక్క కొమ్మ యద్దడి ఆగస్ట్- సెప్టెంబర్ లో మరియు కాయ యద్దడి అక్టోబర్- నవంబర్ గమనిoచవచ్చు.
Also Read: చామంతి సాగులో మెళకువలు
కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు చేసే నష్ట లక్షణాలు:
తల్లి పురుగు సుమారు 250 తెల్లని రంగులో ఉండే గుడ్లను, ఆకుల వెనుక భాగాన, పచ్చని కాండం పైన, పువ్వు మొగ్గల పైన లేదా కాయ కాడ దగ్గర పెడుతుంది. ఈ గుడ్లు 3-5 రోజుల్లో పొదిగి దాని నుండి వచ్చిన లార్వా పింక్ రంగులో ఉంటాయి. ఈ చిన్న లార్వా లేత కొమ్మల లోపలికి ప్రవేశించి, కొమ్మలోని లోపలి భాగాలని తినివేస్తుంది. దీనివలన కొమ్మ పైభాగలకి నీరు మరియు పోషకాలు అందక అవి వాడిపోయి తర్వాత చనిపోతాయి. ఇలా కొమ్మ వాడి ఉండడం ఈ పురుగు వలన కనిపించే మొట్టమొదటి లక్షణం.
వాడిన కొమ్మల మొదళ్ళలో లార్వా చేసిన చిన్న రంధ్రాన్ని చూడవచ్చు. తర్వాత దశలో లార్వా పువ్వులు, పూమొగ్గలు మరియు కాండాలను కూడా ఆశించి వాటిని ఆహారంగా తినివేస్తుంది. కాయలు రాగానే కాయకు కూడా రంధ్రం చేసి లోపలికి కాయలోని ఆహారాన్ని తినేస్తుంది, ఒక్కోసారి చేసిన రంధ్రాలను ఎండిన మలంతో మూసివేస్తుంది. పురుగు ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు కొమ్మలు వాడిపోయి మరియు మొక్కలు బలహీనపడటం జరిగి దిగుబడి నష్టానికి దారి తీస్తుంది. పురుగు ఆశించిన పువ్వు మొగ్గలు కూడా వాడి రాలిపోవును మరియు లార్వా తొలిచిన కాయలు మార్కెట్ లో అమ్మడానికి పనికి రాకపోవచ్చు.
యాజమాన్యం:
పురుగు యద్దడిని తట్టుకునే పూస పర్పల్ లాంగ్, పూస పర్పల్ క్లస్టర్, అర్క కేశవ్, అర్క కుసుమకర్ రకాలను వాడాలి. పొడవగా మరియు సన్నగా ఉండే రకాలలో గుండ్రని రకాల కంటే తక్కువ యద్దడి ఉంటుంది. అధిక దిగుబడిని ఇచ్చే ఇతర రకాలు లేదా హైబ్రిడ్లు వాడితే పంట సాగులో ముందు నుండే జాగ్రత్తలు వహించాలి.
పురుగు యద్దడి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో జొన్న, మొక్కజొన్న, అపరాలు వంటి ఇతర పంటలను 1-2 సంవత్సరాలు వేస్తే మంచిది. దీనివలన పురుగుకి వంగ ఆహారంగా దొరకక తర్వాత సీజన్లో యద్దడి తగ్గును. వంగలో బంతి, కొత్తిమీర లేదా ఉల్లి ను అంతర పంటగా వేసినా కొంతవరకు పురుగు హాని తగ్గును.
పంట తొలి దశలో, 15-20 రోజులకు ఎకరానికి 10-12 లింగాకర్షక బుట్టలు వాడి మగ తల్లి పురుగుల సంఖ్యను తగ్గించవచ్చు. తద్వారా పంటపై ఆడ తల్లి పురుగు గుడ్లు తక్కువగా పెట్టును. ఎరను 20 రోజులకు ఒకసారి తప్పని సరిగా మార్చాలి.
తల్లి పురుగులు పంట తొలిదశలో కనబడిన వెంటనే ట్రైకోగ్రామా చిలోనిస్ పరాన్నజీవి (ట్రైకోకార్డ్) ని వారానికి 20,000 చొప్పున 3-4 సార్లు వాడాలి.
25-30 రోజుల సమయంలో గుడ్లను మరియు చిన్న లార్వాలను చంపే వేప నూనె ( 3000 లేదా 5000 పి. పి. ఎమ్) 5 మి. లీ ను ఒక లీటరుకు చొప్పున పిచికారి చేయాలి. పురుగు తీవ్రత బట్టి 2-3 సార్లు వారం రోజుల వ్యవదిలో వాడాలి.
పురుగు ఆశించి కొమ్మలు వాడినట్లు అయితే ఒక అంగుళం క్రిందికి ఆ కొమ్మను తుంచి నాశనం చేయాలి. వీలైతే ఆ కొమ్మలను పొలానికి దూరంగా పడివేయాలి.
లార్వా ఆశించిన కాయలను కూడా చిన్న కాయల దశలోనే ఏరి దూరంగా పడివేయాలి.
కొమ్మ లేదా కాయ నష్టం 5 % కంటే మెoచితే సిఫారసు చేసిన రసాయన పురుగు మందులను మాత్రమే వాడాలి. వంగలో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు యాజమాన్యం కొరకు ప్రొఫినోఫాస్ 50 EC @ 2 మి. లీ/లీ (ఎకరాకు 400 మి. లీ) లేదా థయోడికార్బ్ 75 WP @ 2.0 గ్రా. /లీ (ఎకరాకు 400 గ్రా.) లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5% SC @ 0.3 మి. లీ/లీ ( ఎకరాకు 60 మి. లీ) లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 5 % SG @ 0.4 గ్రా. /లీ. (ఎకరాకు 80 గ్రా) చొప్పున పిచికారి చేయాలి. వాడిన మందును ఎక్కువ సార్లు వాడకుండా వేరే మందులతో మార్చి వాడితే మంచిది.
ఈ లార్వా మొక్క భాగాల లోపలి నివాసం ఉండి తినే స్వభావం కలది కాబట్టి పురుగు మందు దాని శరీరంలోకి వెళ్ళడానికి చాలా ఆటంకాలు ఉన్నాయి. అందువలన రైతులు ఈ విషయం గుర్తుపెట్టుకొని విచక్షణా రహితం గా మందుల పిచికారి చేయడం ఆపాలి. అదేవిధంగా ముందునుండే పైన తెలిపిన సమగ్ర సస్య రక్షణా పద్దతులను పాటించి, పంటను దాని చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకోవాలి.
Also Read: అమృతాన్ని తలపించే .. రాజానగరం సీతాఫలం.!