Vermicompost Beds Preparation: భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు మనకు వీలైనంత పొడవున వర్మీ కంపోస్టు బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. ఈ బెడ్ అడుగు భాగం గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటుచేసే వాటిని సిమెంట్తో గట్టిగా చెయ్యాలి లేదా పేడను ఉపయోగించి గట్టిపర్చవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్న బెడ్లపై సుమారుగా 45 సెం.మీ. ఎత్తువరకు వర్మీ కంపోస్టు చెయ్యలనుకొంటున్న కుళ్ళుతున్న వ్యర్థ పదార్ధాలను (చెత్త, ఆకులు, పేడ మున్నగునవి) వెయ్యాలి. ఈ వ్యర్థపదార్థాలపైన 5 నుండి 10 సెం.మీ. మందం వరకు పేడను వెయ్యాలి. వ్యర్థపదార్ధాలు, పేడను వేసేటప్పుడు బెడ్పైన నీరు చల్లాలి. ఇలా ఒకవారం వరకు నీరు అడపాదడపా చల్లుతుండాలి.
వారం రోజుల తరువాత పైన సూచించిన వానపాములను వదలాలి. వానపాములను వదిలేటప్పుడు బెడ్ను కదిలించి వదిలితే మంచిది. ఈ వానపాములు ఆహారాన్ని, తేమను వెదుక్కొంటూ లోపలికి వెళతాయి. ఇవి ప్రతి రోజు తమ బరువుకు తగ్గ ఆహారాన్ని తీసికొంటాయి. ప్రతి చదరపు మీటరుకు 1000 వరకు వానపాములను వదలాల్సి ఉంటుంది.
బెడ్పైన పాతగోనె సంచులనుగాని, వరిగడ్డినిగాని పర్చాలి. ఇలా చెయ్యటం వలన తేమను కాపడటమే కాక, వానపాములకు కప్పులు, పక్షులు, చీమల నుండి రక్షణ కల్పించవచ్చు. ఈ బెడ్లకు పందిరి నీడను కల్పించాలి. వానపాములను వదిలిన బెడ్లపై ప్రతిరోజు పలుచగా నీరు చల్లుతుండాలి. ఈ విధంగా చెయ్యటం వలన వ్యర్థ పదార్ధాలను 2 నుండి 3 నెలల్లో వర్మీ కంపోస్టుగా తయారుచేసే వీలుంది.
Also Read: Bio Fertilizers Importance in Agriculture: వ్యవసాయంలో జీవన ఎరువుల వాటి ప్రాముఖ్యత.!
బెడ్ నుండి వర్మీకంపోస్టును తీయటానికి 4,5 రోజుల ముందు నీరు చల్లటం ఆపివెయ్యాలి. ఇలా చెయ్యటం వలన వానపాములు తేమను వెదుకుతూ లోపలికి వెళ్ళి అడుగుభాగానికి చేరతాయి. బెడ్పైన కప్పిన గోనె సంచులను లేదా వరిగడ్డిని తీసివెయ్యాలి. తరువాత ఎరువును శంఖాకారంగా చిన్న చిన్న కుప్పలుగా చెయ్యాలి. వానపాములు లేని ఎరువును 2-3 ఎమ్.ఎమ్ జల్లెడతో జల్లించి సంచుల్లో నింపి నీడగల ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి.
ఎరువును తొలగించిన బెడ్లపైన వ్యర్థ పదార్థాలను 45 సెం.మీ. ఎత్తు వరకు పరచి మరల పైన చేసిన విధంగా కంపోస్టును తయారు చేసుకొవచ్చు. ఇలా సంవత్సరానికి 6 సార్లు వరకు వర్మీకంపోస్టును తయారుచేసే వీలుంది.
వానపాముల ఎరువుల తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- బెడ్లలో ప్లాస్టిక్ పదార్ధాలనుగాని కోడిగుడ్డు పెంకులుగాని వేయరాదు.
- బెడ్ పైన పక్షులు, ఉడతలు, తొండలు, ఎలుకలు ఆశించి వానపాముల తినకుండా, గడ్డితో బెడ్లను అడుగు కప్పాలి.
- పది రోజులకోసారి పేడ నీళ్ళను చల్లాలి.
- వర్మికంపోస్టు షెడ్ చుట్టూ వలను కట్టి కాకులు, గ్రద్దలు, కొంగలు, పాములు, ఎలుకలు రాకుండా చూసుకోవాలి.
- బెడ్ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
- బెడ్ కు చీమలు పట్టకుండా జాగ్రత్త వహించాలి.
Also Read: Fowl Pox in Poultry: కోళ్ళలో ఫౌల్ పాక్స్ వ్యాధి వుందా అయితే ఇలా చెయ్యండి.!