సేంద్రియ వ్యవసాయం

ప్రకృతి వ్యవసాయం చేయు విధానం..

0

రసాయన ఎరువులు, పురుగుల మందులు, కలుపు మందులు అవసరం లేకుండా ఒక్క దేశీ ఆవుతో 30 ఎకరాల భూమిని సాగుచేయవచ్చు అనేది పాలేకర్ పద్ధతి. పాలేకర్ వ్యవసాయ విధానంలో 4 చక్రాలుంటాయి. అవి 1. బీజామృతం, 2. జీవామృతం, 3. అచ్చాదన, 4. వాఫ్స. ఈ వ్యవసాయానికి ప్రథమంగా ప్రతి 30 ఎకరాలకి ఒక దేశవాళీ గోవు అవసరం. ఈ వ్యవసాయానికి ద్రవ జీవామృతం, ఘన జీవామృతం వంటి సేంద్రియ ఎరువులు, బీజామృతం వంటి విత్తన శుద్ధి రసాయనం, నీమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కీటక నాశనులు తయారు చేసుకోవాలి. ప్రకృతి వ్యవసాయంలో కేవలం దేశీ విత్తనాలనే విత్తుకొని సొంత విత్తన భాండాగారాలను ఏర్పాటు చేసుకోవాలి.
1. బీజామృతం:
కావాల్సిన పదార్థాలు: బోరు / నది / బావి నీరు 20 లీటర్లు, నాటు ఆవు మూత్రం 5 లీటర్లు, నాటు ఆవు పేడ 5 కిలోలు (7 రోజులలోపు సేకరించినది), పొడి సున్నం 50 గ్రాములు, పాటిమట్టి / పొలం గట్టు మన్ను దోసెడు.
తయారీ: ఆవు పేడ ను ఒక పల్చటి గుడ్డలో మూటగా కట్టి 20 లీటర్ల నీరు ఉన్న తొట్టెలో 12 గంటలు ఉంచాలి. ఒక లీటరు నీటిని వేరే పాత్రలో తీసుకోని అందులో 50 గ్రాముల సున్నం కలిపి ఒక రాత్రంతా ఉంచాలి. రెండవ రోజు ఉదయాన్నే నానబెట్టిన పేడ మూటను చేతితో పిసికి ద్రవ సారాన్ని నీటి తొట్టెలో కలపాలి. పేడ నీళ్ళున్న తొట్టెలో పొలం గట్టు మట్టిని పోసి కర్రతో కుడివైపునకు కలియ తిప్పాలి. 5 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని, సున్నపు నీటిని పేడ నీరున్న తొట్టిలో పోసి కలిసిపోయే వరకూ కుడివైపునకు కలియ తిప్పాలి. అన్నీ కలిపిన తర్వాత 12 గంటలపాటు ఉంచాలి. ఈ బీజామృతాన్ని ఒక రాత్రి అలాగే ఉంచి మరునాడు ఉదయం నుంచి 48 గంటలలోపే వాడుకోవాలి. విత్తనాలకు బాగా పట్టించి, వాటిని నీడలో ఆరబెట్టుకొని నాటడానికి సిద్ధం చేసుకోవాలి.
2. జీవామృతం:
జీవామృతాన్ని సహజమైన ఎరువుగా చెప్పవచ్చు. ఇది ద్రవ రూపంలోను, ఘన రూపంలోను రైతులు నేరుగా తయారుచేసుకోవచ్చు.
ద్రవ రూపం:
కావాల్సిన పదార్థలు: దేశీ ఆవు పేడ 10 కేజీలు (వారం లోపు సేకరించింది), దేశీ ఆవు మూత్రం 5 నుంచి 10 లీటర్లు, ద్విదళ పప్పుల పిండి( శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా) 2 కేజీలు, బావి / బోరు / నది నీరు 200 లీటర్లు, పాటి మన్ను/ పొలంగట్టు మన్ను దోసెడు.
తయారీ:
తొట్టెలో గానీ డ్రమ్ములో గానీ 200 లీటర్ల నీటిలో ఈ పదార్థాలన్నిటినీ కలిపి నీడలో 48 గంటలపాటు ఉంచాలి. ప్రతి రోజూ రెండు మూడు సార్లు కర్రతో కుడివైపునకు త్రిప్పాలి. (ఇది కేవలం ఎకరానికి మాత్రమే సరిపోతుంది. ఇలా తయారైన జీవామృతాన్ని 48 గంటల తర్వాత ఒక వారం రోజుల లోపే వాడేయాలి. అవసరమైతే మోతాదులో మరలా తయారుచేసుకోవాలి). పంటకు నీరు పారించే సమయంలో నీటితో కలిపి పారేలా చేసి పొలం మొత్తానికి జీవామృతం అందేలా చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి జావామృతం వాడితే పొలానికి ఎటువంటి ఎరువులు అవసరం ఉండదు.
ఘన రూపం:
కావాల్సిన పదార్థాలు: దేశీయ ఆవు పేడ 100 కేజీలు, దేశీయ ఆవు మూత్రం 5 లీటర్లు, బెల్లం 2 కేజీలు లేదా చెరుకు రసం 4 లీటర్లు, పప్పు ధాన్యం (శనగ, మినుము, పెసర, ఉలవ) 2 కేజీలు, పొలం గట్టు మన్ను 1/2 కేజీ.
తయారీ:
పై పదార్థాలన్నింటినీ చేతితో బాగా కలిపి 10 రోజులు నీడలో ఆరబెట్టాలి. ఆ తర్వాత బాగా చీకిన ఆవు పేడ లో కలిపి 1 ఎకరం పొలంలో వెదజల్లి దున్నాలి. దీన్ని తయారు చేసిన 7 రోజులలో వాడుకోవాలి. పంటకాలం మధ్యలో కూడా ఎకరానికి 100 కేజీల ఘన జీవామృతం వేసి మొక్కలకు ఆహారం అందించాలి.
మరో ఘన రూపం:
కావాల్సిన పదార్థాలు: 200 కేజీల బాగా చీకిన ఆవు పేడ , తయారుచేసుకున్న 20 లీటర్ల జీవామృతం.
ముందుగా పేడ ఎరువును పలుచగా పరచాలి. తర్వాత జీవామృతాన్ని పరచిన ఎరువుపై చల్లాలి. దీనిని బాగా కలియబెట్టి ఒక కుప్పలా చేసి దానిపై పట్ట కప్పాలి. 48 గంటలు గడిచిన తర్వాత దీనిని పలుచగా చేసి ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత గొనె సంచులలో నిల్వచేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవాలి. ఇలా తయారుచేసుకున్న ఘన జీవామృతం 6 నెలల వరకూ నిల్వవుంటుంది.
3. అచ్చాదన:
పొలంలో మట్టిని ఎండ నుండి, వాననీటి కోత నుండి, గాలి నుండి రక్షించుకోవాలి. దీన్నే అచ్చాదన కల్పించడం అని, మల్చింగ్ చేయడం అంటారు. అచ్చాదన వల్ల భూమిలో తేమ నిరంతరం కొనసాగుతుంది. పదేపదే నీరు పెట్టవలసిన అవసరం కూడా ఉండదు. కుళ్ళి నేలలో కలిసిపోయే గడ్డి, ఆకులు వంటి ఏ వ్యర్థ పదార్థంతోనైనా అచ్చాదన చేసుకోవచ్చు. భూమికి అచ్చాదన మూడు రకాలుగా కల్పించవచ్చు. మట్టిని రెండు అంగుళాల లోతున గొర్రుతో దున్నాలి. దీనిని మట్టితో అచ్చాదన అంటారు. ఎండు గడ్డి, కంది కట్టెలు, చెరకు పిప్పి, చెరకు ఆకు, రెమ్మలు, రాలిన ఆకులు వీటితో నేలను అచ్చాదన చేయవచ్చు. పంటకోత తర్వాత వీటిని కాల్చడం సరికాదు. నేలపై తక్కువ ఎత్తులో వ్యాపించే పంటలు వత్తుగా వేసుకోవడం లేదా వివిధ మొక్కలను వాటంతటవే పెరగనివ్వడం ద్వారా నేలకు అచ్చాదన కలిగించవచ్చు. దీన్నే సజీవ అచ్చాదన అంటారు.
4. వాఫ్స:
వాఫ్స అనగా నీరు పెట్టె విధానం, సూక్ష్మ వాతావరణం కల్పించడం. పొలం భూమిలో మట్టికణాల మధ్య 50 % నీటి ఆవిరి, 50 % గాలి ఉండేలా చేయడమే వాఫ్స ఉద్దేశం. పంట మొక్కలకు కావాల్సింది నీరు కాదు, నీటి ఆవిరి. మొక్క అవసరాన్ని గుర్తెరిగి సాగునీటిని అందిస్తేనే భూమిలో వాఫ్స ఏర్పడుతుంది. వాఫ్స క్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. మధ్యాహ్న వేళలో చెట్టు / పంట మొక్క నీడ పడే చోటులో వరకూ వేళ్ళు విస్తరించి ఉంటాయి. ఆ పరిధికి వెలుపలికి నీరందిస్తే వాఫ్స ఏర్పడి నీరు సద్వినియోగమవుతుంది.

Leave Your Comments

మల్లె సాగులో మెళుకువలు..

Previous article

ఖర్జూరం తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like