Bio Fertilizers Importance in Agriculture: ప్రస్తుత వ్యవసాయ రంగంలో హరిత విప్లవం మొదలైన వాటి నుండి అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ వంగడాల ను ప్రవేశపెట్టడం ద్వారా రసాయనిక ఎరువుల వాడకం నానాటికి పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో రైతులు సిఫార్సు చేసిన ఎరువుల మోతాదు కంటే అధికంగా రసాయన ఎరువులు వాడటం వలన తాత్కాలికంగా దిగుబడులు పెరిగినప్పటికీ నేలలో భూ భౌతిక మరియు రసాయన స్థితిలో అననుకూల మార్పులు రావడం, నేలలో పోషకాల సమతుల్యత క్షీణించటం, అలాగే మరీ ముఖ్యంగా భూమిలోని జీవరాశులలో అతి ముఖ్య సముదాయమైన సూక్ష్మ జీవులపై ప్రభావం పడి వాటి సంఖ్య తగ్గుతూ, ఇవి జరిపే రసాయనిక చర్యలపై గణనీయమైన మార్పులు సంతరించుకొంటున్నాయి.
తద్వారా భూసారం మరియు నేల ఉత్పాదక శక్తి క్రమేణ తగ్గిపోవడం జరుగుతుంది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు రసాయనిక ఎరువుల వాడకం కొంత వరకు తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పంటకు కావాల్సిన పోషకాల మోతాదు పూర్తిగా సేంద్రీయ ఎరువుల నుండి లభ్యం కావాలంటే రైతులకు అధిక పరిమాణంలో ఈ సేంద్రీయ ఎరువులు కావాల్సి ఉంది.
సేంద్రీయ ఎరువులలో చాలా రకాలు మరియు వీటి అధ్యత దృష్ట్యా రైతులకు క్షేత్ర స్థాయిలో వీటి కొరత ఏర్పడింది. దీనివలన రైతులు ఎక్కువగా రసాయనిక ఎరువుల వైపు మొగ్గు చూపటం వలన భూమి లోపల మరియు భూఉ పరితలంపై ఉన్న పర్యావరణం కాలుష్యం అగుటయేకాక రైతుకు పెట్టుబడి విషయంలో అధికమైన భారం పడుతుంది. ఈ నేపధ్యంలో మన వ్యవసాయ రంగంలో సమగ్ర పోషక యాజమాన్యం పద్ధతి ఎంతో ముఖ్యమైనది గుర్తించటం జరిగింది. దీనిలో సేంద్రీయ ఎరువుల వాడకంతో పాటు జీవన ఎరువుల వాడకం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుoది. జీవన ఎరువులు సేంద్రీయ ఎరువులలో ఒక భాగంగా చెప్పవచ్చు.
Also Read: Female Calf Rearing:పెయ్య దూడల పెంపకంలో మెళుకువలు.!
ప్రకృతిలో ఉండే పోషకాలను సూక్ష్మ జీవుల ద్వారా మొక్కలకు అందించే సేంద్రీయ తయారీలను “జీవన ఎరువులు” అంటారు. సమగ్ర పోషక యాజమాన్యంలో జీవన ఎరువుల అవుతుంది. ప్రాముఖ్యత ప్రస్తుత కాలంలో అధికం అవుతుంది.
జీవన ఎరువుల వర్గీకరణ: మొక్కలకు అవసరమయ్యే ముఖ్యమైన ప్రధాన పోషకాలను స్థిరీకరించే లేదా లభ్యతను పెంచే దానిని బట్టి జీవన ఎరువులను ఈ క్రింది రకాలుగా విభజించారు.
అవి:
1. నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు: వీటిలో ముఖ్యంగా
ఎ) పరస్పర జీవనంతో నత్రజనిని స్థిరీకరించునవి. ఉదా: రైజోబియం (బాక్టీరియా), అజోల్లా అనబినా (ఆల్గే), ఫ్రాంకియా (అక్టినోమైసిటిస్)
బి) సహచర్యంతో నత్రజనిని స్థిరీకరించునవి. ఉదా: అజోస్పైరిల్లమ్
సి) స్వతంత్ర జీవనం సాగిస్తూ నత్రజనిని స్థిరీకరించునవి. ఉదా: అజటోబాక్టర్, క్లాస్ట్రీడియం, ఆకుపచ్చ నాచు.
2. భాస్వరం లభ్యతను పెంచే జీవన ఎరువులు: వీటిలో ముఖ్యమైనవి.
ఎ) భాస్వరాన్ని కరిగించేవి. ఉదా: ఫాస్పో బాక్టీరియా మరియు ఫాస్పోఫంగై
బి) భాస్వరాన్ని అందించేవి. ఉదా: ఫాస్పేటు మొబిలైజింగ్ మైకోరైజా (వ్యామ్)
3. పొటాషియంను అందించే జీవన ఎరువులు, ఉదా: పొటాష్ మొబిలైజర్స్
4. మిశ్రమ జీవన ఎరువులు ఉదా: పి.జి.పి.ఆర్.
Also Read: Fowl Pox in Poultry: కోళ్ళలో ఫౌల్ పాక్స్ వ్యాధి వుందా అయితే ఇలా చెయ్యండి.!