నీటి యాజమాన్యంమన వ్యవసాయం

Rainwater Harvesting: వాన నీటి సంరక్షణలో కందకాల ప్రాముఖ్యత.!

2
Rainwater Harvesting:ప్రపంచంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులకు ప్రకృతి సమతుల్యత దెబ్బతిని, భూగోళంపై జరుగుతున్న అనేక పరిణామాలు భయానకంగా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాధారిత భూములు ఎడారులైపోతున్నాయి. గత దశాబ్దకాలంలో ఎల్‌నినో ప్రభావంతో సంభవించిన వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. వాననీటి సంరక్షణకు సర్వత్రా ఆసక్తి ఏర్పడిరది. సహజ నీటి లభ్యత రోజు రోజుకూ కొరవడుతున్న నేపథ్యంలో అనివార్యంగా వర్షపు నీటికి ఒడిసిపట్టి, భూగర్భంలోకి ఇంకింపచేయడం, భూగర్భంలో జలాలను అభివృద్ధి చేయడం తక్షణ కర్తవ్యంగా మారింది.
Rainwater Harvesting

Rainwater Harvesting

వానదేవుడ్ని ఎంత ప్రార్ధించినా.., కప్పతల్లి పెళ్ళిళ్ళు ఎన్ని చేసినా… చెట్లను నరికివేసి మానవుడు తాను చేస్తున్న తప్పులకు నిష్కృతి లభించడంలేదు. పైపెచ్చు క్యిములోనింబస్‌ మేఘాలు ఏర్పడి పెద్ద పెద్ద శబ్దాలతో, పిడుగులతో అకాల వర్షాలు పడి భీభత్సం సృష్టించడం తప్ప ప్రయోజనం ఉండడం లేదు. ఎన్నో తరాలుగా ప్రకృతిని, జంతువులను మచ్చిక చేసుకొని మనుగడ సాగిస్తున్న మానవుడు ప్రధానంగా ఆధారపడిరది నీటివనరుపైనే. సముద్రంలోకి వెళ్ళిపోతున్న ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి మాగాణులకు నజరానా సమర్పించడానికి వాటర్‌షెడ్‌ రూపంలో జలయజ్ఞం ప్రారంభమైంది.
వాటర్‌షెడ్‌ అభివృద్ధికై నేల, నీటి సంరక్షణ పనులు పునాదిలాంటివి. పునాది బలంగా ఉంటేనే అనుకున్న ఫలితాలు సాధించవచ్చు. నేల, నీటి సంరక్షణా పనులు ఎక్కడపడిన వర్షపు నీటిని అక్కడే పట్టి ఉంచి, నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి, సారవంతమైన మట్టి కొట్టుకు పోకుండా చేసి నేలకోతను నివారించును.
వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడం ద్వారా పచ్చదనాన్ని పెంచి, పర్యావరణ సమతుల్యతకు తోడ్పడవచ్చు. పశుగ్రాసం కొరతతో కబేళాలకు తరలిస్తున్న పశు సంపదను సంరక్షించుకోవచ్చు. పచ్చని మొక్కల పెంపకం ద్వారా వరుణ దేవుడిని ఆకర్షించవచ్చు. మానవుడికి కావలసిన కలపను, వంట చెరకును వృద్ధి చేసుకోవచ్చు. వాటర్‌షెడ్‌, వివిధ ప్రభుత్వ పథకాల్లో నీటి యాజమాన్య పద్ధతులను ప్రామాణికంగా వివరించేందుకే ఏరువాక మాసపత్రిక ఈ పథకంలోని వివిధ అంశాలను రైతులు, ఇతర ప్రజాహిత సంస్థలకు దిక్సూచిగా ఉండేందుకు ఈ సాంకేతిక విజ్ఞానాన్ని మీ ముందుకు తెస్తుంది.
Rainwater Harvesting

Rainwater Harvesting

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న చిన్న నీటి వనరుల అభివృద్ధి కార్యక్రమానికి దిక్సూచిగా ఈ వ్యాసాన్ని భావించవచ్చు. భూగర్భ జల వనరుల అభివృద్ధికి ముఖ్యంగా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలోపలికి ఇంకింపచేసే సాంకేతిక ప్రయత్నాల్లో మొట్టమొదటిది భూమికి ఏటవాలుగా కందకాలు నిర్మించడం. 25 రకాల కందకాలను, వాటి వివరాలను ఈ వ్యాసం ద్వారా వివరించే ప్రయత్నం జరుగుతుంది.

Also Read: సాగు నీటి నాణ్యత – యాజమాన్యంలో మెళుకువలు.!

నిరవధిక సమతుల కందకాలు:
వాలు 8`30 శాతం గల వ్యవసాయేతర భూములు కొండ, గుట్టల్లో కాంటూరు (భూమి మీద ఒకే ఎత్తుగల బిందువులను కలుపుతూపోయే సమతల రేఖ) వెంబడి నిర్ణీత సమాంతర దూరంలో కందకాలు తవ్వగా అట్టి కందకాలను నిరవధిక సమతుల కందకాలు లేక సిసిటిలు అంటారు. కందకాలు తవ్వగా వచ్చిన మట్టిని 0.3`0.6 మీ. దూరంలో కందకాలకు దిగువభాగాన కట్టలుగా వేస్తారు. ఈ నిరవధిక సమతల కందకాలు వర్షపునీటిని పట్టి నేలలో తేమ శాతాన్ని పెంచి మొక్కల పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి. అంతేకాకుండా కొండ లేక గుట్టల నుండి వృధాగా పోయే వర్షపు నీటి వేగాన్ని తగ్గించి నేల కోతను అరికట్టి భూమిలోనికి నీటిని ఇంకింపచేయును.
ఖండిత సమతుల కందకాలు: 
వాలు 8`30 శాతం గల వ్యవసాయేతర భూములు, కొండ లేక గుట్టల్లో కాంటూరు రేఖ పొడవున ఒకే కందకం తవ్వకుండా, కందకం పొడవుకు (2`3 మీ.) సమానమైన ఖాళీలను తవ్వకుండా వదలివేస్తూ కందకాలు చేస్తారు. కిందవరుస కాంటూరు రేఖలో పై కాంటూరు రేఖ మీద తవ్వని కందకాలను తవ్విన అట్టి కందకాలను ఖండిత సమతుల కందకాలు అంటారు (ఎస్‌సిటి). ఒకే వాలుగల కొండ లేక గుట్టకు ఈ కందకాల వరుసల మధ్య సమాంతర దూరం నిరవధిక సమతల కందకాల మధ్య దూరంలో సగం ఉండును.
వాలు గల భూములు, కొండ, గుట్టల మీద రాళ్ళు, చెట్లు లేక తుప్పలు అడ్డుగా ఉండి పొడవైన నిరవధిక సమతల కందకాలు చేయ వీలులేనప్పుడు, సరాసరి వర్షపాతం మధ్యరకంగా లేక కొంచెం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పైన తెలిపిన కందకాలు అనుకూలం. కందకాలను తవ్వగా వచ్చిన మట్టిని సమతల కందకాలు వర్షపు నీటిని పట్టి నేలలో తేమ శాతాన్ని పెంచి మొక్కల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. అంతేకాక కొండ లేక గుట్టల నుండి వృధాగా పోయే వర్షపు నీటి వేగాన్ని తగ్గించి, నేల కోతను అరికట్టి భూమిలోనికి నీటిని ఇంకింపచేస్తాయి.
నీటి సోషణ కందకాలు (వాట్‌) : 
ఎక్కువ వాలు గల కొండ లేక గుట్టలకు అడుగు భాగంలో మట్టి లోతు తగినంత ఉన్నప్పుడు కాంటూరు రేఖ వెంబడి సమలంబ చతుర్భజ ఆకారంలో తవ్వే పెద్ద కందకాన్ని నీటి సోషణ కందకం అంటారు. కొండ లేక గుట్టలను నిరవధిక లేక ఖండిత సమతుల కందకాలతో ట్రీట్‌మెంట్‌ చేయనప్పుడు కూడా అధికంగా వచ్చే వరద నీటిని నిల్వ చేసి నీటిసోషణా కందకాలు కొండ / గుట్ట మధ్యలో మరియు చివరిన నిర్మిస్తారు. కందకాలు తవ్వగా వచ్చిన మట్టిని దిగువన కనీసం 0.5 మీ. ఖాళీ ప్రదేశం వదలి కట్టగా వేయాలి. ఈ కందకాలు కొండ వాలు నుండి వచ్చే వాననీటిని నిల్వ చేసి భూమిలోనికి ఇంకించి దిగువన గల పొలాలను వరద నీటి ఉధృతి నుండి కాపాడును. ఎక్కువ వాలు గల కొండల నుండి వృధాగాపోయే వర్షపునీటి వేగాన్ని తగ్గించి నేల కోతను తగ్గించడంతో పాటు ఆ ప్రాంతంలో పచ్చదనాన్ని ప్రతిఫలింపచేయును.
రాతి కట్ట: 
వాలు శాతం ఎక్కువగా ఉండి, మట్టి లోతు తక్కువగా ఉండి, రాళ్ళతో నిండి ఉన్న బంజరు, బీడు భూముల్లో వాలుకు అడ్డంగా నిర్ణీత దూరంలో కాంటూరు రేఖల మీద దాదాపు 225 మి.మీ. సైజు రాళ్ళను ఏరి కట్టలుగా వేస్తారు. అట్టి కట్టలను రాతి కట్టలు అంటారు. వాలు తక్కువగా ఉండి, మట్టి లోతు ఒక మాదిరిగా ఉన్న పొలాలను వ్యవసాయోగ్యంగా చేయడానికి కూడా రాతి కట్టలను వాలుకు అడ్డంగా కాంటూరు రేఖల మీద నిర్ణీత దూరం వరకు వేస్తారు. కొట్టుకుపోయే మట్టిని ఆపి భూసారాన్ని రకక్షించడానికి ఈ కట్టలు తోడ్పడుతాయి.
గులక రాళ్ళ కట్టలు: 
గులక రాళ్ళు (రెండు అంగుళాలు లేదా అంతకన్నా పెద్దవి) ఎక్కువగా ఉన్న భూముల్లో వాటిని ఏరి వాలుకు అడ్డంగా కాంటూరు మీద కట్టలుగా పోసి భూమిని వ్యవసాయానికి అనువుగా చేస్తారు. ఈ రాళ్ళ కట్టలు నీటి ప్రవాహవేగాన్ని తగ్గించి నీటిని ఇంకింపచేసేందుకు, కొట్టుకుపోయే మట్టిని ఆపి భూసారాన్ని రక్షించడానికి నేలలో తేమ శాతాన్ని సంరక్షించడానికి ఉపయోగపడును.
కాంటూరు బండిరగ్‌ :
తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో, వాలు 2`6 శాతం గల వ్యవసాయ, బీడు భూములందు వాలుకు అడ్డంగా కాంటూరు కందకాలు తీసి ఒక అడుగు బర్మ్‌ (కందకానికి, కట్టకు మధ్య ఖాళీ ప్రదేశం) వదలి తవ్విన మట్టిని సమలంబ చతుర్భుజాకారంలో పేర్చిన అట్టి కట్టలను కాంటూరు మట్టి కట్టలు అంటారు. ఈ కాంటూరు మట్టి కట్టలు వర్షపు నీటిని ఆపి పొలంలోని సారవంతమైన మట్టిని కొట్టుకుపోకుండా చేసి నేల కోతను అరికడుతుంది.
వర్షం పడిన తరువాత అధికంగా ప్రవహించు వరద నీటి ప్రవాహవేగాన్ని తగ్గించి పరిగెత్తే నీటిని అదుపుచేసి భూమిలోకి ఇంకింపచేస్తుంది. నేలలో తేమ శాతాన్ని పెంచి పంట దిగుబడులు పెంచుటకు తోడ్పడుతుంది.
టిసిబి (ట్రెంచ్‌ కం బండ్‌) :  
వాటర్‌ షెడ్‌లలో మధ్యస్థ, లోతట్టు ప్రాంతాల్లో మరియు వాలు శాతం 2.5 శాతం ఉన్న భూముల్లో వాలుకు అడ్డంగా 60`30 మీ. మధ్య దూరంలో వాలు శాతాన్ని బట్టి (తక్కువ వెడల్పు, ఎక్కువ లోతు) ఉన్న కందకాలు తవ్వి 0.3`0.5 మీ. బర్మ్‌ (ఖాళీ ప్రదేశం) వదలి కట్టలు వేసిన ఆ ట్రీట్‌మెంటును ట్రెంచ్‌ కం బండ్‌ (టిసిబి) అంటారు.
ఈ టిసిబిలు వర్షపునీటి ప్రవాహవేగాన్ని తగ్గించి భూమిపై ఉన్న సారవంతమైన మట్టిని కొట్టుకుపోకుండా ఆపుతాయి. కందకాలలో నిండిన వర్షపు నీరు మెల్లగా భూమిలోకి ఇంకిపోయి తేమను పెంచుతాయి. భూగర్భ జలాల మట్టాలను పెంచి ఈ కట్టలపై పశుగ్రాస విత్తనాలు చల్లి, తద్వారా కట్టలను బలపరచడంతో పాటు పశువులకు పోషకాహారం అందించవచ్చు. అంతేగాక గ్లైరిసిడియా, గానుగ, సుబాబుల్‌, టేకు, అవిశ, సరుగుడు, సీతాఫలం మొదలగు మొక్కలను ప్రతి 3`4 కి. మీ. ఒకటి చొప్పున పెంచవచ్చు. ఈ మొక్కలు జీవ కంచగా ఉపయోగపడడమే కాకుండా గాలి ఉధృతి నుండి పంటను కాపాడును. మట్టి కట్ట మీద బహువార్షిక కంది, ఆముదం విత్తనాలు విత్తాలి. ఈ విధంగా మూడంచెల విధానంలో చెట్లు, బహువార్షిక కంది, పశుగ్రాసం అభివృద్ధి చేసి అదనపు ఆదాయం పొందవచ్చు.
పొలాలలో వేసే మట్టి కట్టలు ` వర కట్టలు : 
వాలు 2`6 శాతం గల వ్యవసాయేతర భూములందు వాలుకు అడ్డంగా నిర్ణీత దూరంలో కందకాలు తీసి కనీసం ఒక అడుగు బర్మ్‌ (కందకానికి, కట్టకు మధ్య ఖాళీ ప్రదేశం) వదలి తవ్విన మట్టిని కట్టలుగా వేసిన అట్టి కట్టలను పీల్ట్‌ బండ్స్‌ మట్టి కట్టలు` వర కట్టలు అంటారు. ఈ కట్టలు వర్షపు నీటిని ఆపి పొలంలోని సారవంతమైన భూమికోతను నిరోధించును. ఈ కట్టలు వర్షపు వరద ప్రవాహాన్ని అడ్డుకొని విలువైన నీటిని భూమిలోకి ఇంకింపచేయడమే కాక నేలలో తేమ శాతాన్ని పెంచుతాయి.
రాతి చప్టా / మరవ : 
వ్యవసాయ భూముల్లో మట్టి కట్టలు (ఫీల్డ్‌ బండ్‌/ కాంటూరు బండ్‌/ టిసిబి వేసినప్పుడు) వర్షపు నీరు ఈ కట్టలకు ఆనుకొని ఒక మట్టానికి (సుమారు ఒక అడుగు ఎత్తు)కు చేరిన తరువాత కట్టలు తెగిపోకుండా అదనపు నీరు సురక్షితంగా కిందకు చేరడానికి కట్టకు రాతితో చేసే మార్గాలను రాతి చెప్టా లేక మరవ అంటారు.
చిన్న ఊట కుంటలు :
ఇది వాటర్‌షెడ్‌లో చిన్న వంకలకు / వాగుకు (మొదటి తరగతి లేదా రెండవ తరగతి) అడ్డంగా వర్షపు నీటిని నిలిపి భూమిలోనికి నీటిని ఇంకింపచేయుటకు తద్వారా భూగర్భజలాన్ని పెంచుటకు మట్టితో నిర్మించే కట్టడం. వంకలకు అడ్డంగా నిర్మించే కట్టకు కావలసపిన మట్టిని, కట్టకు ముందు భాగంలో నీరు నిలిచే ప్రదేశంలో తగినంత దూరంలో తవ్వి తీస్తారు. సాధారణంగా చిన్న ఊటకుంట కొరకు నిర్మించు కట్ట పొడవు 50 మీ. వరకు మరియు నీటి నిల్వలోతు 1 మీ. వరకూ ఉండవచ్చు.
ఫారం పాండు (నీటి కుంట) :
రైతు తన పొలంలోపడే వర్షపు నీటిని నిలువ చేసుకోవడం తన పొలం యొక్క లోతట్టు ప్రాంతంలో ఏర్పాటు చేసుకొనే చిన్న నీటి మడుగును ఫారంపాండ్‌ లేదా నీటి కుంట అందురు. ఫారం పాండ్‌లో నిల్వ చేసిన వర్షపు నీరు పశువులకు తాగునీరుగానూ, రైతులు పండిరచే పంటలకు అత్యవసర తడులు అందించడానికి మరియు పురుగు మందులను పంటలకు పిచికారి చేయుటకు ఉపయోగపడును.
మట్టి కట్టల మీద మొక్కల పెంపకం : 
ఫీల్డ్‌ బండ్‌ (మట్టి కట్టలు), కాంటూర్‌ బండ్‌, కాంటూర్‌ కందకాలు మొదలగు యాంత్రిక పద్ధతులు వర్షపునీటి ప్రవాహ వేగాన్ని కట్టడి చేసి సారవంతమైన మట్టిని కొట్టుకుపోకుండా కాపాడును. ఈ విధంగా చేయడం వల్ల మట్టిలో తేమ ఎక్కువకాలం లభ్యంగా ఉండి మొక్కల పెరుగుదలకు ఉపయోగపడును. అయితే ఈ యాంత్రిక పద్ధతుల ద్వారా నేలకోత నివారణ మరియు వర్షపునీటి సంరక్షణ తాత్కాలికం మాత్రమే. అందువల్ల ఈ యాంత్రిక పద్ధతులతో పాటుగా చెట్లను మరియు గడ్డిజాతి మొక్కలను పెంచి నేలకోతను అరికట్టి వర్షపు నీటి సంరక్షణను చేయవచ్చును. వాటర్‌షెడ్‌ ప్రాజెక్టులలో కానుగ, జత్రోపా, గ్లైరిసీడియా, తంగేడు, సుబాబుల్‌, సిసూ, గమహర్‌, వేప మొదలగు అడవిజాతి మొక్కలను డబ్ల్యు, ఎంటి, సిసిటి, సిబి, ఎఫ్‌బి కట్టల మీద పెంచుతారు.
బంజరు భూముల్లో చెట్ల పెంపకం :  
ప్రభుత్వ బంజరు, పోరంబోకు, వ్యక్తిగత లేక పట్టా బీడు భూముల్లో మొక్కలను సిఫార్సు చేసిన దూరంలో నాటి వాతావరణ సమతుల్యం కాపాడుటయేకాక గ్రామ ప్రజలకు వంట చెరకు, కలప మరియు పండ్లు అందించవచ్చు. సుబాబుల్‌, అవిశ, సీతాఫలం, వేప, చింత, కానుగ, తంగేడు, జట్రోపా, గోరింటాకు మరియు టేకు వంటి మొక్కలను సిఫారసు చేసిన దూరాన్ని అనుసరించి తగిన పరిమాణంలో గుంతలు తీసి నాటవలెను.
పండ్ల మొక్కల పెంపకం (సాగు నీటివసతి ఉన్న చోట) :
చిన్నకారు మరియు మధ్యస్థ రైతులు వాటర్‌షెడ్‌లో మధ్యస్థ ప్రాంతాలలోని సాగులోలేని మరియు నీటివసతిగల భూముల్లో పండ్ల మొక్కల పెంపకాన్ని చేపట్టి ఆదాయాన్ని పొంది జీవనోపాధిని మెరుగుపరచడమే కాక పర్యావరణ సమతుల్యం కాపాడవచ్చు. ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుకోవడానికి పండ్ల మొక్కలకు డ్రిప్‌ నీటి పారుదల పద్ధతి ద్వారా నీటిని అందించవచ్చు.
మెట్ట ఉద్యానవన పంటలు, కుండలతో నీటి పారుదల :
మెట్ట ప్రాంతాల్లో సీతాఫలం, రేగు, ఉసిరి, పనస మరియు చింత లాంటి ఉద్యానవన పంటలను చేపట్టి సన్న, చిన్న కారు రైతులకు జీవనోపాధి కల్పించడానికి వీలుంటుంది. మట్టితో చేసిన కుండల ద్వారా (అనగా పిచ్చర్‌ ఇరిగేషన్‌) మొక్కల వేర్లకు నీటిని అందించి తక్కువ నీటితో మొక్కలను పెంచవచ్చు. ఈ పద్ధతిలో అడుగు భాగాన రంధ్రం చేసిన మట్టి కుండలను మెడ పైభాగం మాత్రమే పైన ఉండునట్లు మొక్కకు 1`1.5 అడుగుల దూరంలో గోతిలో పూడ్చి నీటితో నింపవలెను. ఈ కుండల నుండి నీరు కుండల గోడల యొక్క మట్టి రంధ్రాల ద్వారా మరియు అడుగున ఉండే చిన్న రంధ్రం ద్వారా (దీన్ని పత్తితో గానీ, గుడ్డ పీలికతో గానీ మూసి ఉంచాలి) మొక్కల వేర్లకు సరఫరా అవుతుంది. తద్వారా మొక్కల పెరుగుదలకు దోహదపడును.
విడిరాళ్ళ కట్టలు :
పొలాలలోని చిన్న వంక లేదా వర్రెలకు అడ్డంగా, పొలాలలో దొరికే రాళ్ళతో కట్టే అడ్డకట్టను లేదా విడిరాళ్ళ కట్ట అందురు. ఈ రాళ్ళ కట్ట, లోతు తక్కువగా గల మొదటి తరగతి వంకల్లో, వర్రెల ప్రారంభ ప్రాంతాల్లో, నేల కోతకు గురి అయ్యే ప్రాంతాల్లో, రాళ్ళు అందుబాటులో ఉన్నచోట అనుకూలంగా ఉండును. ఈ విడిరాళ్ళ కట్టలు నీటి ప్రవాహవేగాన్ని తగ్గించి నేలకోతకు గురికాకుండా కాపాడును.
స్టోన్‌ గల్లీప్లగ్‌ :
చిన్న వంకలకు అడ్డంగా ఒడ్లు గట్టిగా ఉన్నచోట సుమారు 225 మి.మీ. సైజు రాళ్లు స్థానికంగా దొరికే వాటర్‌షెడ్‌లలో కట్టే రాళ్ళ కట్టను స్టోన్‌ గల్లీప్లగ్‌ అందురు. స్టోన్‌ గల్లీప్లగ్‌లు వర్షపునీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి కొట్టుకుపోయే సారవంతమైన మట్టిని ఆపును మరియు వంక వెడల్పు పెరగకుండా నిరోధించును స్టోన్‌ గల్లీప్లగ్‌కు ముందు మరియు వెనుక 2 మీ. దూరంలో ఇంకుడుగుంతలు తీసి వర్షపు నీటిని పట్టి భూమిలోనికి ఇంకింపచేసి తద్వారా భూగర్భజలాన్ని పెంచవచ్చు.
సాండ్‌ బ్యాగ్‌ స్ట్రక్చర్‌ (ఇసుక బస్తాలతో అడ్డు కట్టలు) :
సాండ్‌ బ్యాగ్‌ స్ట్రక్చర్‌లను చిన్న వంకలలో నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించుటకు, రాళ్ళు దొరకని ప్రాంతాల్లో, వంకల్లో విరివిగా ఇసుక దొరికే ప్రాంతాల్లో వంకలకు అడ్డంగా నిర్మిస్తారు. సాధారణంగా సిమెంట్‌ మరియు ఇసుక 1:15 లేదా 1 : 20 నిష్పత్తిలో కలిపి ఖాళీ సిమెంట్‌ బస్తాల్లో నింపి (ఒక ఖాళీ సిమెంటు బ్యాగులో సుమారు 0.035 ఘ.మీ. కల ఇసుక సిమెంట్‌ మిశ్రమం పట్టవచ్చు) వీటిని వంకలకు (వంక ఆరంభ ప్రాంతాల్లో) అడ్డంగా వేయుదురు.
బ్రష్‌ ఉడ్‌ డ్యాములు :
బ్రష్‌ ఉడ్‌ డ్యామ్‌ తక్కువ పరీవాహక ప్రాంతం నుండి వర్షపు నీరు వచ్చే చిన్న వంకలకు అడ్డంగా కర్రలతో నిర్మించే డ్యామ్‌. కర్రలను ఎంపిక చేసేటప్పుడు తిరిగి చెట్టుగా మొలకెత్త గల చెట్ల జాతి అనగా చిల్లకంప, అడవి ఆముదం, గ్లైరిసీడియా, వావిలి మొదలగునవి ఎంచుకోవాలి.
చిన్న కుంట కట్ట  :
రాళ్ళు దొరకని ప్రాంతాల్లో మొదటి తరగతి వంకల్లో చిన్నకుంట తవ్వి, తవ్విన మట్టిని వంకకు అడ్డంగా కట్టగా వేసి దానితోపాటుగా ఎక్కువగా వచ్చే వరద నీటిని సురక్షితంగా కిందకు పంపుటకు కట్టకు ఒక పక్క అలుగు / మరప అతి తక్కువ ఎత్తులో కట్టిన, అట్టి కట్టడమును డగ్‌ అవుట్‌ ఎర్తన్‌ గల్లీ ప్లగ్‌ లేదా చిన్న కుంట కట్ట అంటారు. ఈ చిన్న కుంట కట్టలు నీటి  ప్రవాహ వేగాన్ని తగ్గించి, కొంత నీటిని చిన్నకుంటలో నిల్వ ఉండేటట్లు చేసి, నేల కోతను తగ్గించి, భూగర్భజలాల అభివృద్ధికి సహాయపడును.
రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ : 
ప్రవహించే నీటి వల్ల కోతకు గురై విస్తరించడానికి అవకాశం గల 10 మీ. కంటే తక్కువ వెడల్పు ఉండే వంకల లేక వాగుల మధ్యస్థ ప్రాంతాల్లో సుమారు 225 మి.మీ. సైజు రాళ్ళు స్థానికంగా దొరికే వాటర్‌షెడ్‌లలో వంక లేక వాగులకు అడ్డంగా ప్రధాన గోడ, కోర్‌వాల్స్‌, పక్కగోడలు, రిటైనింగ్‌ గోడ, అప్రాన్‌లతో సహా కలిపి కట్టే రాళ్ళ కట్టను రాక్‌ఫిల్‌డ్యాం అంటారు. ఈ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌లు వర్షపు నీటి ప్రవాహక వేగాన్ని తగ్గించి కొట్టుకొని పోయే సారవంతమైన మట్టిని ఆపును మరియు వంక వెడల్పు పెరగకుండా నిరోధించును. ఈ కట్టడం పరిసర ప్రాంతాల్లో నేలలో తేమ పెరిగి మొక్కల పెరుగుదలకు సహాయపడును. ఈ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌కు కింద వైపు కనీసం 2 మీ. దూరంలో ఇంకుడు గుంతను తీసి వర్షపు నీటిని పట్టి భూమిలోనికి ఇంకింపచేసి తద్వారా భూగర్భజలాన్ని పెంచవచ్చు.
వంకల్లో ఇంకుడు గుంతలు : 
మొదటి తరగతి లేదా చిన్న వంకల్లో వృధాగా పరిగెత్తే వర్షపు నీటిని పట్టి భూమిలోకి ఇంకింపచేసి భూగర్భజలాలు పెంచుటకు చతురస్ర లేదా దీర్ఘచతురస్రాకారంలో వంకలలో తవ్వే గుంతలను సంకెన్‌ పిట్స్‌ లేదా ఇంకుడు గుంతలు అంటారు. ఈ ఇంకుడు గుంతలు నీటి వేగాన్ని తగ్గించి వంకకోతను అరికట్టి భూగర్భ జలమట్టం పెంచుటకు, వీటి పరిసర ప్రాంతంలో గడ్డి, మొక్కలు పెరుగుటకు సహాయపడును.
ఇంకుడు కుంట : 
వాటర్‌ షెడ్‌లో చాలా కాలంపాటు నీరు ప్రవహించే లోతు తక్కువగా ఉన్న వంక లేక వాగుల్లో, ఇసుక మేట వేయడానికి తక్కువ అవకాశం ఉన్న ప్రదేశంలో నీరు నిలువచేసే భూమిలోనికి ఇంకించి తద్వారా భూగర్భజలాన్ని పెంచుటకు వంక లేక వాగుల్లో తవ్వే కుంటలు లేక మడుగులను సంకెన్‌పాండ్‌ లేక ఇంకుడు కుంటలు అందురు. ఇవి సంకెన్‌పిట్‌ లేక ఇంకుడు గుంతల కంటే పెద్దవిగా ఉండును.
డగౌట్‌ పాండ్‌ : 
వర్షపు నీరు పారే మొదటి / రెండవ తరగతి వంక పక్కన 5`10 మీ. దూరంలో నీటిని మళ్ళించి నిల్వ చేయుటకు మట్టిని తవ్వి దీర్ఘచతురస్ర లేదా చతురస్రాకారపు నీటి మడుగు లేదా కుంటలను డగౌట్‌ పాండ్‌ అందురు. ఎక్కువకాలం ప్రవహించు వంకలు మరియు ఒండ్రు / ఇసుక మేట వేయు వంకల్లో సంకెన్‌పాండ్‌ నిర్మించకుండా అట్టి వంకలను 5`10 మీ. దూరంలో సరైన ప్రదేశంలో నీటి మడుగు / కుంటలను తవ్వి, వంక నుండి నీటిని ఒక కాలువ ద్వారా దీనికి మళ్ళించెదరు. ఇటువంటి డగౌట్‌ పాండ్‌ నీటితో నిండిన తరువాత అదనపు నీరు బయటకు పోవడానికి ఒక (అవుట్‌ లెట్‌)ను ఏర్పాటు చేసి దీన్ని మరలా కాలువ ద్వారా వంకకు కలపాలి. డగౌట్‌ పాండ్‌ తొందరగా పూడిపోకుండా ఉండేందుకు పైవైపు 1`2 మీ. దూరంలో ఒక పూడికగుంతను ఏర్పాటు చేయాలి. డగౌట్‌ పాండ్‌లో నిల్వ చేసిన నీరు పశువులకు తాగు నీరు గానూ, రైతులు పండిరచే కూరగాయ పంటలకు అత్యవసర సాగు నీరు అందించడానికి, పురుగు మందులను పంటలకు పిచికారి చేసేందుకు ఉపయోగపడును.

Also Read: నీటిని ఆదా చేసే మార్గాలు

Leave Your Comments

Health Benefits of Honey: మానవ శరీరానికి అమృతంలా తేనే…

Previous article

Success Story: ముగ్గురు అక్కాచెల్లెళ్లు – నెలకు 25 లక్షల సంపాదన

Next article

You may also like