Mango cultivation: వేసవికాలం వస్తుందంటే చాలు అందరికీ మామిడిపళ్లు గుర్తొస్తాయి. ఈ మామిడి సాగులో మంచి మెళకువలు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మామిడి పూత దశలో సరైన రక్షణ చర్యలు తీసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు. గత రెండెేళ్లుగా కరోనా ప్రభావంతో రైతులకు ఆశించిన ఫలితాలు రాలేదు. మరి ఈ సారి మంచి ఫలితాలు సాధించాలంటే రక్షణ చర్యలు తీసుకోవాల్సిందే.
సాధారణంగా మామిడి పూత డిసెంబర్ – జనవరి నెలల్లో మొదలై ఫిబ్రవరి వరకు పూస్తుంది. మామిడి సాగు రైతులకు పూతకు ముందు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన పూత ఆలస్యంగా రావడం జరుగుతుంది. కావున రైతులు నవంబర్ నుంచే కొమ్మలు కత్తిరించడం. దున్నడం చేయకుండా తోటలకు విశ్రాంతి ఇవ్వాలి. అలా అయితే పూత త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది రైతులు పూతకు ముందు కొమ్మల కత్తిరింపు, దున్నడం వంటివి చేస్తుంటారు. ఇలా చేస్తే పూత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.
ఈ పనులు చేయకూడదు.. నీటి సౌలభ్యం ఉన్న రైతులు రెండు నెలల ముందు నుంచే నీటి తడులు ఇస్తారు. ఇలాంటివి అస్సలు చేయకూడదు. కనీసం రెండు నెలల ముందే నీటి తడులు నిలిపివేయాలి. ఇక పూత సమయంలో ఆకుపచ్చ, పూతమాడు, నల్లమచ్చ తెగుళ్లు ఆశిస్తాయి. వీటిని నివారించేందుకు నిపుణులు సూచించిన మందులతో పిచికారీ చేయించాలి. పూత దశ దాటిన తర్వాత పిందె రాలకుండా సరైన చర్యలు తీసుకోవాలి. దానిని నివారించడానికి సరైన మందులు ఉపయోగించాలి. అలా ఐతే పిందే రాలకుండా ఉంటుంది. ఇలా చేస్తే సాగులో మంచి దిగుబడి సాధించవచ్చు. ఇక గతేడాదితో పోలిస్తే ఈసారి మామిడి పళ్ల ధరలు కొంత మేరకు పెరిగే అవకాశం కనిపిస్తుందని మార్కెట్ వర్గాలు అంచన వేస్తున్నాయి.