రైతులు సరైన సమయంలో టమాటా సాగు చెయ్యక ధరలు లేక , అనేక ఇబ్బందులు పడుతున్నారు. టమాటా సాగు చేయటానికి సరైన సమయం, సరైన పద్ధతిలో సాగు చేస్తే అధిక లాభాలను ఆర్జించవచ్చు. టమాటా సాగు చేయడంలో మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. భూమిపై సాగు చేయడం, స్టేకింగ్ పద్ధతిలో సాగు చేయడం, షెడ్ నెట్ కింద సాగు చేయడం.
స్టేకింగ్ పద్ధతి అంటే టమాటా మొక్కలకు దారాలు కట్టి భూమిని తగలకుండా పెద్ద కర్రలకు కట్టడం. టమాటాను షెడ్ నెట్ కింద స్టేకింగ్ పద్ధతిలో సాగు చేస్తే 30 – 40 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. సాధారణంగా భూమిపై స్టేకింగ్ పద్దతిలో సాగు చేస్తే 15 – 25 టన్నుల దిగుబడి వస్తుంది. ఇంకా మాములుగా భూమిపై సాగు చేస్తే 8 – 10 టన్నుల దిగుబడి వస్తుంది.
టమాటా సాగుకు శీతాకాలం బాగా అనుకూలం. ఎందుకంటే టమాటా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న దగ్గర బాగా పండుతుంది. అందుకని రైతులు నవంబర్, డిసెంబర్,జనవరి, ఫిబ్రవరి నెలల్లో టమాటా పంటను పండిస్తారు. కానీ అప్పుడు రేటు ఎక్కువగా ఉండదు.అందరూ అదే సమయంలో పండించడం వల్ల ఉత్పత్తి పెరిగి రేటు తగ్గుతుంది.
జూన్, జులై, ఆగష్టు నెలల్లో టమాటాకు బాగా రేటు ఉంటుంది. ఎందుకంటే వేసవిలో టమాటా సాగు ఆశించినంత రాదు. ఉష్ణోగ్రతలు 30 – 45 డిగ్రీల వరకు ఉంటాయి. కాబట్టి టమాటా కాత, పూత రాలిపోతుంది. దిగుబడి కూడా తగ్గుతుంది. దాంతో డిమాండ్ ఎక్కువగా ఉండి రేటు పెరుగుతుంది. అందుకని వేసవిలో టమాటా సాగు చేస్తే లాభాలు ఆర్జిస్తారు.
టమాటా నాటిన 60 – 70 రోజులకి టమాటా కాపుకు వస్తాయి. వేసవిలో టమాటా సాగు చేయాలనుకునే వారు మూడు నెలల ముందే టమాటా నారు వేసుకుంటే మంచిది అంటే ఏప్రిల్ నెలలో నారు వేసుకుంటే జూన్ నెలకి టమాటా కాపు వస్తుంది. అధిక లాభాలను ఆర్జించవచ్చు.