Drumstick Farming Techniques: దక్షిణ భారతదేశంలో పెరటిలో పెంచే బహువార్షిక మొక్కగా మునగ ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఏకవార్షిక రకాలు అందుబాటులోకి రావడంతో రైతులు మునగకున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని వ్యాపార సరళిలో ఈ పంట సాగుపై ఉత్సాహం చూపుతున్నారు.
మునగలో ఎక్కువగా మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, ఐరన్, భాస్వరం, కాల్షియం, విటమిన్-ఎ, సిలతో పాటు మరెన్నో ఔషధ గుణాలున్నాయి. ఆకుల నుంచి తీసిన రసానికి బాక్టీరియా నిరోధక గుణం ఉంది. దీనిలో ఔషధ గుణాలున్న కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఆకుల గుజ్జును పండ్లపై పూతగా కూడా వాడతారు. మునగ గింజలను ఎండబెట్టిన తరువాత వీటి నుంచి నూనెను తీస్తారు. ఈ నూనెను బెన్ అయిల్ అంటారు. దీనిని వివిధ యంత్రాలలో జిగురు పదార్ధంగా వాడడం వలన దీనికి మంచి అంతర్జాతీయ మార్కెట్ ఉంది.
రకాలు : వార్షిక మునగ రకాలలో ముఖ్యంగా పి.కె.యం -1, కె.యం.-1, జి.జే.వి.కె.-1,2,3 బాగా ప్రాచుర్యం పొందాయి.
నేలలు : నీరు ఉండే స్వభావం గల అన్ని రకాల నేలలు అనుకూలం, అధిక సేంద్రియ ప్రదార్ధం గల ఇసుక నేలలు శ్రేష్టం. నేలలు ఉదజని సూచిక 6.0-7.0 మధ్యన ఉంటే మంచిది.
వాతావరణం : మునగ ఉష్ణ మండలపు పంట, వేడి పోడి వాతావరణం బాగా అనుకూలం, ఆధిక చలిని, మంచుని తట్టుకోలేదు. 30-35 డి. సెం. పగటి ఉష్ణోగ్రత గల ప్రాంతాలు అనుకూలం అయితే 40 డి. సెం.కంటే ఉష్ణోగ్రత మించితే పూత రాలిపోతుంది.
నర్సరీ : వార్షిక మునుగును కొమ్మల ద్వారా ప్రవర్తనం చేయవచ్చు. అయితే విత్తనం నాటు సాగు చేయడం సులువైన పద్ధతి. ఒక ఎకరాకు 250 గ్రా. విత్తనం కావాలి. ఒక కిలోకు సుమారు 2600-2700 విత్తనాలు వస్తాయి. నారు పెంచడానికి 4I9 అంగుళాల పాలిథీ¸న్ సంచుల్లో ఎర్ర మట్టి, పశువుల ఎరువు, (2:1:1) నిష్పత్తిలో కలిపి నింపి వరుస క్రమంలో అమర్చుకోవాలి. సంచుల కింద సగం భాగంలో 4-6 రంధ్రాలు చేసి నీరు వెలుపలికి పోయేలా ఏర్పాటు చేయాలి. సంచులలోని మిశ్రమం అంతా తడిచేటట్లు నీరు పోయాలి. ఆరిన తరువాత ఒకొక సంచిలో ఒక విత్తనం చొప్పున 2 సెం.మీ. లోతులో నాటి పల్చగా నీరు పోయాలి. ప్రతి రోజు అవసరం మేరకు నీరు పోయాలి. గింజలు సేకరించి 2-3 నెలలలోపే విత్తాలి. అలస్యమైన కొద్ది మొలక శాతం తగ్గుతుంది. మొక్కలను సంచులలో 30-35 రోజులు పెంచిన తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి.
నాటే విధానం : పొలాన్ని 2 సార్లు దుక్కి దున్ని చదును చేయాలి. చేసిన తరువాత ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేసి భూమిలో కలపాలి. పొలంలో 2.5I2.5 లేదా 3I2 మీటర్ల దూరంలో 45I45I45 ఘన సెం.మీ. గుంతలు తీయాలి. ఈ విధంగా తీస్తే ఎకరాకు 640-666 మొక్కలు నాటవచ్చు. ఇందులో 3ఐ2 మీ. దూరంలో నాటడం వల్ల అంతర పంటలు సాగు చేయడానికి, దున్నడానికి, ఇతర అంతరకృషి పనులకు, మొక్కల పెరుగుదల, దిగుబడి పెరుగుతుంది. నాటేటప్పుడు వేర్లకు ఏ మాత్రం హాని కలిగించకుండా పాలిధీన్ సంచిని మాత్రమే తొలగించి మట్టితో సహా మొక్కలను గుంతలో నాటుకోవాలి లేదా గుంతకు 2 గింజలు చొప్పున 2 సెం.మీ. లోతులో నాటి నీరు పెట్టాలి.
గింజలు మొలకెత్తిన తరువాత 30 రోజులకి ఏపుగా ధృడంగా ఉన్న ఒక మొక్కని ఉంచి రెండవ దానిని తీసివేయాలి. ఈవిధంగా నింపేటప్పుడు కూడా కొన్ని గింజలను పాలిథీన్ సంచులలో పెంచుకుంటే ఎక్కడైనా గింజలు మొలకెత్తకపోయినా లేదా మొలకెత్తిన గింజలు చనిపోవడం వల్ల ఖాళీలు ఏర్పడితే అక్కడ ఈ సంచుల్లోని మొక్కలను నాటి ఖాళీలను పూరించాలి. దీనివల్ల అన్ని మొక్కలు ఒకే దశలో అభివృద్ధి చెందుతాయి.
నాటే కాలం : మునగను జూన్- ఆగష్టు నెలలో నాటుకోవడం లాభాదాయకం అంటే సుమారుగా ఫిబ్రవరి – మార్చిలో కోతకు వస్తాయి.
నీటి యాజమాన్యం : నాటిన వెంటనే నీరు పెట్టాలి. నేల స్వభావాన్ని బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి 7-10 రోజులకి ఒకసారి నీరు పారించాలి. మునగ కొంతవరకు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. కానీ పూత సమయంలో నీటిపారుదలలో ఒడిదుడుకులుంటే పూత రాలిపోతుంది. పూత కాపు సమయంలో 4-6 రోజులు ఒకసారి నీరు పెట్టుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చు.
Also Read: Agriculture: భారతదేశంలో వ్యవసాయం లాభమా? నష్టమా?
ఎరువుల వాడకం : మునగ మొండి జాతి మొక్కయినప్పటికీ అధిక దిగుబడులు పొందడానికి ఎరువులు అవసరం. ముఖ్యంగా మొక్కలు నాటేటప్పుడు గుంతలో 10 కిలోల పశువుల ఎరువులతో పాటు 250 గ్రా. వేపపిండి, 250 గ్రా. సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. నాటిన 3,6, 9 నెలలకు ఒక్కో మొక్కకు 100 గ్రా. యూరియా, 75 గ్రా. మ్యూరేట్ ఆఫ్‌పొటాష్ వేసి నీరు పారించాలి.
చిగుళ్ళు తుంచివేయడం : మొక్కలు 3 అడుగులు పెరిగిన తరువాత పెరిగే కొన చివరలను తుంచి వేయాలి. దీనివల్ల పళ్ళు కొమ్మలు అధికంగా వస్తాయి. పక్కు కొమ్మలు కూడా 1-2 అడుగులు పెరిగే లోపల మళ్ళీ చిగుర్లు తుంచివేయాలి. దీనివల్ల ప్రక్క కొమ్మలపైనా చిరుకొమ్మలు ఎక్కువగా పుట్టుకొచ్చి చెట్టు గుబురుగా పొట్టిగా ఏర్పడుతుంది. దీనివల్ల పూత ఎక్కువగా రావడానికి తద్వారా ఎక్కువగా కాయలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. సస్యరక్షణ చర్యలకు పంట కోతకు సులువుగా ఉంటుంది. ఈ విధంగా చిరు కొమ్మలు తుంచి వేయడాన్ని పించింగ్ అంటారు. దీనివల్ల మునగలో అధిక దిగుబడులు పొందవచ్చు.
అంతర పంటలు : మునగలో మొక్కల వరుసలకు మధ్య 8-10 అడుగులు దూరం ఉండడం వలన 4 నెలలు అంతర పంటలుగా, నీటి సౌకర్యం బట్టి ముల్లంగి, క్యారెట్, వంగ, బెండ, బీన్స్ వంటి కూరగాయలు కూడా సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు.
దిగుబడి మొక్కలు నాటిన 5-6 నెలలకు పూత ప్రారంభం అవుతుంది. గింజలు, కాయలు ముదరక ముందే లేతకాయలు కోయాలి. కోసిన వెంటనే నీడలో ఉంచి సంచులను నింపి మార్కెట్‌కు తరలించాలి. ఒక మొక్క నుంచి ప్రతి పంటకు ఏప్రిల్ – సెప్టెంబరుకు సుమారు 200-250 కాయలు లభిస్తాయి.
Also Read: July Gardening Works: జూలై మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన పనులు మరియు సూచనలు.!