Precautions of Paddy Crop: రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా కురిసిన అకాల వర్షాలకు వివిధ దశల్లో ఉన్న వరి పంట దెబ్బతినడం జరిగింది. దాళ్వా నారు మడి దశలో ఉన్న వరి పంట, విత్తనం చల్లిన 2,3 రోజుల వయసులో ఉన్నప్పుడు, మూడు రోజుల కన్నా ఎక్కువ నీట మునిగితే మొలక శాతం గణనీయంగా తగ్గుతుంది. ఈ దశలో వీలైనంత తొందరగా నీటిని పూర్తిగా బయటకు తీసివేయడం వల్ల విత్తనం కోర గాలిపోసుకొని ఎటువంటి నష్టం జరగదు. అలా కాక నీరు తీయడానికి వీలు లేక మొలక దెబ్బతింటే తిరిగి విత్తనం చల్లుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. విత్తిన 7 నుండి 30 రోజుల మధ్యలో నారుమడి 5 రోజుల కన్నా ఎక్కువగా నీట మునిగితే నారు దెబ్బతినే అవకాశం ఉంది, కాబట్టి నారు నీట మునిగిన 5 రోజుల లోపు, నీటిని పూర్తిగా బయటకు తీసివేసి పంటకు గాలి తగిలేలా చేయాలి. నష్ట నివారణకు నీటిని తీసివేసిన తరువాత, 5 సెంట్ల నారు మడికి ఒక కిలో యూరియా మరియు ఒక కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవడం వలన కొత్తఆకు వచ్చి ఊడ్పులకు అందుతుంది. అంతేకాక అధిక వర్షాలకు నారు మడి దశలో పంట తెగుళ్ళ బారిన పడకుండా, నీరు పూర్తిగా తీసివేసి మొక్క నిలదొక్కు కున్న తరువాత లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండిజం లేదా రెండు గ్రాముల కార్బెండిజం మాంకోజెబ్ కలిసిన మిశ్రమమందు గానీ కలిపి పిచికారి చేయాలి.
పంట ఊడ్చిన వెంటనే మరియు పిలక దశలో ముంపుకు గురైనట్లైతే, నీటిని పూర్తిగా బయటకు తీసివేసి తరువాత పైపాటుగా ఎకరాకు 20 కిలోల యూరియా 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అదనంగా వేసుకోవాలి. ఈ విధంగా బూస్టర్ డోస్ వేసుకోవడం వలన మొక్క ముంపు ప్రభావం నుండి త్వరగా కోలుకుంటుంది. మొక్క కోలుకున్న తరువాత కుళ్ళు తెగుళ్ళు రాకుండా లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండిజం కలిపి పిచికారీ చేయాలి. పిగులు పొట్ట మరియు పూత దశలో పైరు 1 నుండి 2 రోజుల కన్నా ఎక్కువ రోజులు నీట మునిగితే కంకి పూర్తిగా బయటకు రాకపోవడం, పుష్పాలలో నీరు చేరడం వలన ఫలదీకరణ శక్తి కోల్పోయి తాలు గింజలు ఏర్పడతాయి.
Also Read: Rice Stem Borer In Paddy: ఇటీవల వరిని ఆశిస్తున్న కాండం తొలుచు పురుగు నివారణ చర్యలు.!
పాలు పోసుకునే దశ : ఈ దశలో 2 నుండి 3 రోజులకన్నా ఎక్కువగా పంట నీట మునిగితే పిండి పదార్ధాలు గింజలలో చేరక గింజ బరువు తగ్గి తద్వారా దిగుబడి మరియు నాణ్యత తగ్గుతాయి. గింజ గట్టిపడే దశ నుండి కోత దశ చేను పడిపోకుండా ఉండి, నిద్రావస్థ కలిగిన రకాలలో నష్టం తక్కువగా ఉంటుంది. నిద్రావస్థ లేనటువంటి బి.పి.టి 5204 వంటి రకాలు నీటమునిగితే గింజ మొలక వచ్చి నష్టం ఎక్కువగా ఉంటుంది. నిద్రావస్థ ఉన్నరకాలలో కూడా చేను పడిపోయి వారం రోజులకన్నా ఎక్కువగా నీట మునిగినట్లైతే గింజలలో నిద్రావస్థ తొలిగి చేనుపైనే మొలకవచ్చే అవకాశం ఉన్నది. గింజ తోడుకునే లేదా గట్టిపడే దశలో వెన్ను యొక్క బరువువల్ల మొక్కలు కొద్దిపాటి గాలి, వర్షాలకే కణుపుల వద్ద విరిగి నేలకి వరుగుతాయి. ఈ విధంగా పడిపోవడం వల్ల పిండి పదార్ధం గింజలకు సరిగా చేరక గింజ బరువు తగ్గడం లేదా తాలు గింజలు ఏర్పడటం జరిగి, తద్వారా దిగుబడి తగ్గే అవకాశం ఉన్నది.
దీనితోపాటూ పడిపోయిన చేల నుండి వచ్చే ధాన్యం మిల్లింగ్ సమయంలో విరిగిపోయి నూక ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. పడిపోయిన చేలలో యంత్రాలతో కోత కోయడానికి ఎక్కువ సమయం పట్టడం వల్ల కోతఖర్చు కూడా పెరిగిపోతుంది. పడిపోయిన చేలలో వీలైనంత తొందరగా దుబ్బులను లేపి నిలబెట్టి కట్టలుగా కట్టి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలి.
కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లైతే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేవిధంగా పిచికారీ చేయాలి. వర్షాలు తగ్గి ఎండ రాగానే పనలను తిరగేసి ఎండబెట్టి నూర్చుకోవాలి. పొలంలో నీరు లేకపోయినట్లయితే మడిలోనే పనలపై ఉప్పు చల్లుకోవచ్చు. ఒక వేళ పొలం లో నీరు నిలిచి ఉన్నట్లయితే పనలను గట్ల పైకి తెచ్చుకొని విడగొట్టి ఉప్పు ద్రావణం చల్లుకోవాలి. తుఫాను వాతావరణ నేపధ్యంలో పూర్తిగా ఆరని పనలను కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేసుకోవడం వల్ల నష్టాన్ని నివారించుకోవచ్చు. నూర్చిన ధాన్యం 2`3 రోజులు ఎండ బెట్టడానికి వీలు కాకపోతే కుప్పలలో గింజ మొలకెత్తడమే కాక రంగు మారి చెడు వాసన వస్తుంది. ఇటువంటి పరిస్థిల్లో నష్టాన్ని నివారించడానికి ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పు మరియు 20 కిలోల పొడి ఊక కలిపి ధాన్యం పోగు పెట్టడం వల్ల గింజ మొలకెత్తి చెడిపోకుండా నివారించుకోవచ్చు. ఎండ కాసిన తరువాత ధాన్యాన్ని ఎండబోసి, తూర్పార బట్టి నిల్వ చేసుకోవాలి. రంగు మారి, తడిచిన ధాన్యం పచ్చి బియ్యం కంటే ఉప్పుడు బియ్యంగా అమ్ముకోవడం వల్ల నష్టాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చు.
Also Read: Paddy Cultivation: చౌడు పొలాల్లో వరి యాజమాన్యము
Also Watch: