Uncultivated Green Leafy Vegetables: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు, గర్భిణీలు, కౌమర దశ అమ్మాయిలలో చాలా మంది పోషకాహార లోపంతో భాదపడుతున్నారు, పోషకాహార లోపంను నివారించుటలో ఆకు కూరలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఆకు కూరల్లో క్యాల్షియం, ఇనుము, కెరోటిన్, విటమిన్ ‘A’, రైబోప్లావిన్ ఫోలిక్ యాసిడ్ వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి.
అయితే మనలో చాలా మందికి పోషకాల గనిగా పిలువబడే సాగు చేయబడని ఆకు కూరల గురించి తెలియదు. జొన్న చెంచలి, దొగ్గలి, ఎలుక చెవుల కూర, తగరించ, పాయల ఆకు, తలైల, ఉత్తరేణి, గునుగు, తుమ్మి, పొన్నగంటి, నల్ల కాశ, తెల్ల కాశ, బుడ్డ కాశ, గోరుమాడి, సన్నపాయల, తెల్ల గర్జల, చెన్నంగి, యన్నాద్రి, అడివి సోయ కూర, చిత్ర మాల, అంగి బింగి, అడవి పుల్ల కూర, బంకటి కూర, నల్లనేల ఉసిరి, ముల్లు దొగ్గలి, పొల పత్రం, గంగ వాయిలి వంటి ఎన్నో రకాల సాగు చేయబడని ఆకు కూరలను సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ ప్రాంతంలో చూడవచ్చు. వానకాలంలో సహజంగా ఎటువంటి సాగు చేయకుండా లభించే ఆకు కూరల్లో ఎన్నో ముఖ్యమైన అరుదైన పోషకాలు లభిస్తాయి.
సాధారణంగా ఇవి మనకు రైతులు తమ పంటను సేంద్రీయ పద్ధతిలో ఎటువంటి రసాయనాలు వాడకుండా పండిరచినట్లయితే ఈ ఆకు కూరలన్ని తమంతటే తామే పెరుగుతాయి. చాలా మంది ఇవి కలుపు మొక్కలుగా భావించి తొలగిస్తుంటారు. రసాయన మందులు వాడకం మరియు ఆహారపు అలవాట్ల మార్పుల వల్ల మనకు ఎన్నో పోషకాలను అందించే ఆకు కూరలు కనుమరుగై పోతున్నాయి. మనం సాగు చేసి పండిరచే ఆకు కూరల కంటే సాగు చేయబడని ఆకు కూరల్లోనే అధిక మొత్తంలో సూక్షపోషకాలు మరియు ఔషద గుణాలు లభిస్తాయి.
Also Read: మిరపను ఆశించే కొత్త రకం తామర పురుగులు – యాజమాన్యం
` జొన్న చెంచలిని అత్యంత సాధారణ సాగు చేయబడని ఆకుకూరల్లో ఒకటి, ప్రతి 100 గ్రా॥ తినదగిన భాగానికి 3237 మి.గ్రా క్యాల్షీయం 111.3 మి.గ్రా ఇనుము లభిస్తుంది. పాల కూరతో పోలిస్తే 8 రెట్లు ఎక్కువైన పాస్పరెస్ మరియు 4 రెట్లు విటమిన్ జొన్న చెంచలిలో ఎక్కువగా ఉంటుంది.
` తలైల ఆకును మెంతి కూరతో పోలిస్తే ఇనుము 20 రెట్లు అధికంగా లభిస్తుంది. 100 గ్రాముల అడవి పుల్ల కూరలో 139 మి.గ్రా ఐరన్ ఉంటుంది మరియు ఇది సంవత్సరాంతం దొరుకుతుంది. సాగు చేయని ఆకుకూరలను సహజంగానే క్యాల్షియం, కెరోటిన్, ఇనుము వంటి పోషకాలతో ఫోర్టిఫైడ్ చేయబడినది అని చెప్పవచ్చు. పచ్చి ఆకు కూరల్లో విటమిన్ ‘A’ పుష్కలంగా ఉండడం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తహీనత సమస్యను నివారించడంలో తలైలి ఆకు దివ్య ఔషదంలా పని చేస్తుంది.
వాణిజ్యంగా పండిచే ఆకుకూరలు, సాగు చేయబడని ఆకు కూరల పోషకాల పోలిక పట్టిక
పాల కూర తోట కూర మెంతి కూర సాగు చేయబడని ఆకు కూరలు
వాణిజ్యపరంగా బయట అందుబాటులో ఉండే ఆకు కూరలను పండించడానికి రసాయనాలు వాడుతారు, ఇవి దీర్ఘకాల ఆరోగ్య సమస్యలను తీసుకువస్తాయి. అదే సాగు చేయబడని ఆకు కూరలో రసాయనాలు వాడకం ఉండదు, కాబట్టి ఇవి శరీరానికి అధిక మొత్తంలో పోషకాలను అందించడంతో పాటు మంచి రుచిని కూడా అందిస్తాయి.
ఎటువంటి ఖర్చు లేకుండా ప్రకృతి మనకు అందించే సహజమైన సాగు చేయబడిన ఆకు కూరలను గుర్తిస్తే రక్త హీనత, రేయి చీకటి, పోషకాహార లోపం వంటి సమస్యలను అధిగమించవచ్చు. మిశ్రమ పంటలను ప్రోత్సాహించడం, కలుపు మందుల వాడకంను నివారించడం వల్లన ఈ ఆకు కూరలను కాపాడుకోగలము.
Also Read: మిద్దెతోట పెంపకం మరియు యాజమాన్య పద్ధతులు.!