Let’s Prepare For Yasangi Cultivation Like This: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రవ్యవసాయ విశ్వవిద్యాలయం, గత వానాకాలంలో అధిక వర్షాలవల్ల రైతులు కొన్ని ప్రాంతాలలో పంటలు సాగు చేయని పరిస్థితులను కూడా రైతులు ఎదుర్కొన్నారు మరికొన్ని ప్రాంతాలలో అధిక వర్షాలవల్ల పెసర, మినుము, కంది లాంటి పంటలలో మురుగు నీరు నిలిచి నష్టం జరిగింది. ఈ సందర్భాలలో రైతులు యాసంగి పంటలపై కొన్ని మేలైన యాజమాన్య చర్యలు చేసుకున్నట్లైతే యాసంగి పంటల్లో పోషకాల లోపం లేకుండా మరియు పంటలు బెట్టకు గురి కాకుండా కాపాడుకోవచ్చు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలంటే సమర్థ వనరుల వినియోగం, సరైన ప్రణాళిక ఎంతైనా అవసరం. అందుకు గాను రైతులు కొన్ని ఆచరణ సాధ్యమయ్యే తేలికపాటి సాంకేతిక అంశాలైన క్రింది పనులను చేపట్టాలని తెలియపరుస్తున్నాము.
పంట అవశేషాలు తొలగించడం: యాసంగిలో వేసిన పంట కోసిన తరువాత ఆ పంట యొక్క అవశేషాలను కాల్చకుండ ఆధునిక పద్ధతులతో విలువ జోడిరచి మెత్తగా వాడుకోవచ్చును. గత వానాకాలంలో ఏవైనా పచ్చిరొట్ట పైర్లు సాగు చేసినట్లయితే వాటి అవశేషాలను పూర్తిగా భూమిలో కలియదున్నాలి.
భూసార పరీక్షలు చేసుకోవడం: గత పంట అవశేషాల ద్వారా కూడా కొంత మొత్తంలో పోషకాలు భూమిలో ఉంచబడతాయి. పైర్లకు కావాల్సిన అన్ని పోషకాలు ఎంతో కొంత పరిమాణంలో నేలలో సహజంగానే ఉంటాయి. నేలలో పోషకాలు ఏ స్థాయిలో, ఏ మోతాదు లో తెలుసుకోవడం వీలైతే యాసంగి పంటలకు ముందుగా భూసార పరీక్ష చేయించాలి. నేల రంగు, స్వభావం వంటి భౌతిక లక్షణాలే కాక, ఉదజని సూచిక, లవణ పరిమాణం, సేంద్రియ కర్భనం, లభ్య భాస్వరం, లభ్య పొటాషియం నిర్దారించి సలహాలు, సూచనలు ‘‘సాయిల్ హెల్త్ కార్డ్’’ రూపంలో రైతులకు అందజేస్తారు. ప్రతి రైతు తప్పని సరిగా భూసార పరీక్ష చేయించడం మంచిది.
భూసార పరీక్ష లాభాలు:
- నేలలో ప్రధాన పోషకాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోవచ్చు.
- నేల సారం పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి తెలుస్తాయి.
- నేల రసాయన గుణాలైన ఆమ్లా, క్షార, తటస్థ గుణాలు తెలుస్తాయి.
- ఎరువులు వినియోగం పై అనవసర ఖర్చు తగ్గించి సమతుల ఎరువుల వాడకం సాధ్యమవుతుంది.
Also Read: Yasangi Maize Cultivation: యాసంగి మొక్కజొన్న సాగు సమగ్ర యాజమాన్యం.!
చెరువులోని పూడిక మట్టి తోలుకోవడం:
- చెరువు మట్టిలో అనేక పోషకాలతో పాటు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే కర్బనం కూడా ఉంటుంది. అందువల్ల చెరువు మట్టిని రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.
- చెరువు మట్టి వేసిన పొలాల్లో వేసవిలో ఉష్ణోగ్రతల్లో పెద్దగా హెచ్చుతగ్గులు ఏర్పడవు. దీని వలన యాసంగి పంటలు బెట్టకు గురికాకుండా ఉంటాయి.
- చెరువు మట్టి వేసిన పొలాల్లో తేమ నిలిచే కాలం పెరుగుతుంది.
- చెరువు మట్టి ఎర్ర, చెల్క, దుబ్బ నేల నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించి సమపాళ్లలో గాలి, నీరు నిల్వ ఉండేలా చేసి ఉత్పాదకతను పెంచుతుంది.
సేంద్రియ ఎరువులు వేసుకోవడం: పశువుల ఎరువులు నేల నిర్మాణంలో ఎంతో ఉపయోగపడతాయి.
కేవలం రసాయన ఎరువులపై ఆధారపడటం కాకుండా సేంద్రియ ఎరువులైన పశువుల పేడ, కోళ్ల పెంట, గొర్రె ఎరువులు నేల సారాన్ని పెంచుతాయి. వేసిన ఎరువులను సమాంతరంగా చల్లుకొని, వాలుకు అడ్డంగా లోతుగా దున్నడం వలన నీరుతో పాటు ఎరువులోని పోషకాలు నేలలోకి ఇంకి మొక్కలకు నేరుగా అంది ఉత్పాదకత పెరిగే అవకాశం వుంది.
-కె. శేఖర్, శాస్త్రవేత్త (సేద్య విభాగం) కె.సుజాత, సి. సుధాకర్, సి. సుధారాణి, యన్. ప్రవీణ్,
-టి. రాజేశ్వర్ రెడ్డి, సి. మాణిక్య మిన్ని, ఎ. సందీప్ మరియు యమున
వ్యవసాయ పరిశోధనా స్థానం , తాండూరు.
Also Read: యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగు…
Must Watch: