Bottle Gourd Cultivation: సొర సాగుకు నల్ల రేగడి నేలలు, ఎర్రలనేలలు, నీరు ఇంకే నేలలు అనువైనవి. లవణ శాతం ఎక్కువగా ఉన్న నేలలు, నీరు ఇంకకుండా నిల్వ ఉండే నేలలు పనికిరావు. విత్తనం వేసే ముందు నేల వదులుగా అయ్యే వరకు దమ్ము చేసుకోవాలి. చివరి దమ్ములో ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువును వేసుకొని దున్నుకోవాలి.
దీనిని మూడు విధాలుగా విత్తుకోవచ్చు పై పందిరి పద్ధతి, అడ్డు పందిరి పద్ధతి, బోదెల ద్వారా నేల మీద పండించే పద్ధతి. ఈ పంట, తీగ పంట కావున విత్తనాల మధ్య కాస్త ఎక్కువ దూరాలు పాటించవలసి ఉంటుంది. సాలుల మధ్య దూరం 6 అడుగులు, మొక్కల మద్య దూరం 3 అడుగులు ఉండేలా చూసుకొని విత్తుకోవాలి. విత్తనాలు ఒక్క ఎకరానికి 600 – 800 గ్రాముల విత్తనాలు అవసరం పడుతాయి.
సొర పంట (Bottle Gourd) కు నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. పంట పూత దశలో నీటిని ప్రతిరోజు అందించవలసి ఉంటుంది. కాయల ఎదుగుదలలో నీటిని ఎక్కువగా తీసుకుంటాయి. సొరకాయలు 70-80 శాతం వరకు నీటితోనే నిండి ఉంటాయి. కావున నీటి అనువు ఎక్కువగా ఉన్నపుడు మాత్రమే ఈ పంటను సాగు చెయ్యాలి. ఈ పంటకు డ్రిప్ ఇరిగేషన్ ఎంచుకోవడం కొంతవరకు మంచిది. దీని వల్ల నీటి వృధా కాకుండా, పంటచేనులో నీరు నిల్వ ఉండకుండా ఉంటుంది.
Also Read: గోరుచిక్కుడు ని ఏ నెలలో పండిస్తే ఎక్కువ లాభాలు వస్తాయి.!

Bottle Gourd Cultivation
ఈ పంట వయస్సు 130-150 రోజుల వరకు ఉంటుంది. పంట వయస్సు 50వ రోజు నుండి మొదటి దిగబడి మొదలవుతుంది. కాయ యొక్క బరువు 800 గ్రా -1కిలో బరువు మధ్యలోనే పంట కోత చెయ్యాలి. ఈ బరువు ఉన్న కాయలు మార్కెటింగ్ కి అనువైనవి. పంట కోత సరైన సమయములో చేపట్టలేకపోతే వేరే ఎదుగుతున్న కాయలపై ప్రభావం పడి వాటి ఎదుగుదల నెమ్మదిస్తుంది.
సొర పంటలో అధిక దిగుబడులు సాధించి కాయ నాణ్యత బాగుండాలంటే పై పందిరి పద్ధతిని ఎంచుకోవడం మంచిది. దీని ద్వారా కాయ యొక్క నాణ్యత బాగుంటుంది. కాయల ఎదుగుదల బాగుంటుంది. కాయ యొక్క ఆకృతి కూడా బాగుంటుంది. నేల మీద పండించడం వల్ల కాయలు వంకరలు తిరిగి ఉండటం జరుగుతుంది. అలాగే కాయలు నేల మీద పెరగడం వల్ల కాయ నేల మీద తగిలిన వైపు తెల్లగా ఉండటం జరుగుతుంది. దీనివల్ల కాయ నాణ్యతపై పై ప్రభావం పడి మార్కెట్లో రేటు తక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ. కావున ఈ పై పందిరి పద్ధతిని వినియోగించుకొని పండించడం వల్ల రెట్టింపు దిగుబడులు రావడమే కాకుండా కాయ నాణ్యత బాగుండడం వల్ల మార్కెట్లో మంచి ధర వచ్చే అవకాశాలున్నాయి.
Also Read: వరి పంటలో సుడిదోమ … సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడి…!