ఉద్యానశోభ

Terrace Gardening: టెర్రస్‌ గార్డెన్‌ మొదలు పెట్టడం ఎలా

1
Terrace Gardening
Terrace Gardening

Terrace Gardening: టెర్రస్‌ గార్డెన్‌ ఎందుకు మొదలు పెట్టాలి అంటే పట్టణాలలో పెరటి తోట పెంచుకోవడానికి కావలసినంత స్థలం ఉండదు కనుక ప్రత్యామ్నాయంగా మిద్దె తోట చేయవచ్చు.
మిద్దెతోట ఎలా మొదలుపెట్టాలి తెలుసుకుందాం…..

Terrace Gardening

Terrace Gardening

మిద్దె తోట మొదలు పెట్టేటప్పుడు ముందుగా రూఫ్‌ టాప్‌ (మిద్దె నేల) గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఇంజనీర్‌ చేత రూఫ్‌ ను పరీక్ష చేయించి, లీకేజీ ఉండదని, స్టాండ్స్‌, కుండీలు, మట్టి, మొక్కలు అన్నింటి బరువు భరించగలదని నిర్ధారించుకోవాలి. లీకేజీ సమస్య రాకుండా, రూఫ్‌ పాడవకుండా వాటర్‌ ప్రూఫ్‌ పెయింట్‌ వేసుకోవాలి. లేదంటే వీడ్‌ మాట్‌ వేసుకోవాలి.

రూఫ్‌ గురించి జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మిద్దె తోట మొదలు పెట్టడానికి ఏమేమి వస్తువులు కావాలో తెలుసుకోవాలి. మొదలు పెట్టేటప్పుడు ఎంత తక్కువ ఖర్చుతో మొదలు పెట్టుకుంటే అంత మంచిది. డబ్బు ఖర్చు పెట్టి మొదలు పెట్టిన తర్వాత మిద్దె తోట చేయలేక మధ్యలోనే ఆపి వేసే పరిస్థితి ఏర్పడితే చాలా నష్ట పోవాల్సి వస్తుంది.

మిద్దె తోట మొదలుపెట్టడానికి కావలసిన వస్తువులు:
కంటైనర్లు, స్టాండ్స్‌, పరికరాలు, మట్టి, ఎరువులు, విత్తనాలు కావాలి. నీటి సౌకర్యం ఉందా అని చూసుకోవాలి. ఏమి మొక్కలు పెట్టుకోవాలి, దేనిలో పెట్టుకోవాలి, ఎలాంటి కంటైనర్లు కావాలి అని నిర్ధారించుకోవాలి. అవకాశం ఉంటే శాశ్వత మడులు కట్టుకోవాలి. వీటిని రూఫ్‌ మీద కాలమ్స్‌, బీమ్స్‌ మీద కట్టుకోవాలి. అలా కట్టుకోవడం వలన మిద్దె మీద బరువు సమానంగా ఉంటుంది.

మడులు కట్టుకోవడం వలన రూఫ్‌ టాప్‌ పాడవకుండా ఉంటుంది. పండ్ల మొక్కలు, తీగె జాతి మొక్కల వేళ్ళు బాగా విస్తరించి దిగుబడి బాగుంటుంది. మడులు కట్టించుకోవడానికి అవకాశం లేనివారు ఫైబర్‌ టబ్బులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఫైబర్‌ టబ్బులు చాలా సంవత్సరాలు అంటే పదిహేను ఇరవై సంవత్సరాల వరకు మన్నికగా ఉంటాయి. ఫైబర్‌ టబ్బులు ఏర్పాటు చేసుకుని మిద్దెతోట ఒకరోజులో నిర్మించుకోవచ్చు.

అది కుడా అవకాశం లేనివారు గ్రో బాగ్స్‌, కూలర్‌ టబ్బులు, బ్లాక్‌ టబ్బులు, పెరుగు బకెట్స్‌, పెయింట్‌ బకెట్స్‌, బ్లూ డ్రమ్స్‌, ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా ఖర్చు లేకుండా బియ్యం, సిమెంట్‌ సంచులు, కొరియర్‌ కవర్లు, ప్లాస్టిక్‌ డబ్బాలు, బకెట్స్‌, ఆయిల్‌ కాన్స్‌, నర్సరీ కవర్లు ఏవి అందుబాటులో ఉంటే వాటిలో పెంచుకోవచ్చు. ఏవి ఏర్పాటు చేసుకున్నా డ్రైనేజీ వ్యవస్థ బాగుండాలి. మురుగు నీరు నిలువ ఉండకూడదు. తప్పనిసరిగా డ్రైనేజీ హోల్స్‌ ఏర్పాటు చేసుకోవాలి. డ్రైనేజీ హోల్స్‌ కు రాళ్ళు కానీ, పెంకులు కానీ, కొబ్బరి చిప్ప ముక్కలు కానీ, షేడ్‌ నెట్‌ కానీ తప్పకుండా పెట్టాలి.

డ్రైనేజీ హోల్స్‌ కు ఏమీ అడ్డు పెట్టకుండా ఉంటే ఆ రంధ్రాల నుంచి మట్టి మిశ్రమం నీళ్ళతో కలిసి కిందకు పోతుంది. అందుకని తప్పకుండా ఏదైనా అడ్డుగా పెట్టాలి. మొక్కల సైజును బట్టి కంటైనర్ల ఎంపిక ఉండాలి. ఏరకం కంటైనర్లను ఎంచుకున్నా కానీ వాటిని రూఫ్‌ మీద డైరెక్ట్‌ గా ఉంచకూడదు. వాటి కింద తేమ ఉండి రూఫ్‌ పాడవుతుంది. కాబట్టి కంటైనర్లను ఎత్తుగా, రూఫ్‌ ను తాకకుండా ఉంచాలి.
కంటైనర్లను ఉంచడానికి ఐరన్‌ స్టాండ్స్‌, వెదురు తడకలు, ఇటుకలు, ట్రైయాంగిల్‌ ఐరన్‌ స్టాండ్స్‌, చెక్కలు, ఫ్లోరింగ్‌ బండలు ఏవి అందుబాటులో ఉంటే వాటిని ఏర్పాటు చేసుకోవాలి.

కంటైనర్లను కానీ, స్టాండ్స్‌ ను కానీ బరువు తక్కువలో ఏర్పాటు చేసుకోవాలి. మిద్దె తోటకు కావలసిన పరికరాలు కొన్ని ముఖ్యమైనవి సమకూర్చుకోవాలి. అవి ఏమిటంటే మట్టి కలుపుకోవడానికి పార, మొక్కలు నాటుకోవడానికి చిన్న గునపం, ఎండిన కొమ్మలు, ఆకులు కత్తిరించడానికి కత్తెర. ముఖ్యంగా ఇవి ఉంటే చాలు. మిగిలినవి నిదానంగా సమకూర్చుకోవచ్చు.

వీటి తర్వాత ముఖ్యమైనది మట్టి మిశ్రమం. మట్టి మిశ్రమం లో తేలికపాటి మాధ్యమాన్ని వాడాలి. మట్టి, ఇసుక లేదా కోకోపీట్‌, ఎరువు, కంపోస్టు ఏది వీలుగా ఉంటే అది వాడుకోవచ్చు. గార్డెన్‌ సాయిల్‌ (ఎర్రమట్టి) వాడుకుంటే మొక్కలు బాగా పెరుగుతాయి. పశువుల, ఆవుల, మేకుల, ఎరువు బాగా మాగినది అంటే కనీసం ఆరు నెలల పాతది కావాలి. వర్మీ కంపోస్టు నాణ్యత కలది అయి ఉండాలి. దొరికితే ఘనజీవామృతం, ఉంటే కిచెన్‌ కంపోస్టు వాడుకోవచ్చు.

కొత్తగా మొదలు పెట్టేవారికి వీటన్నింటినీ ఏ నిష్పత్తిలో కలుపుకోవాలి అని సందేహం వస్తుంది. ఇలాగే, ఈ నిష్పత్తి లోనే కలుపుకోవాలి అని లేదు. ఎవరికి ఇష్టమైన పద్ధతిలో అనుభవం ద్వారా వారి మట్టి మిశ్రమం తయారు చేసుకోవచ్చు. కొత్తగా మొదలు పెట్టేవారికి తెలియదు కనుక ఒకరకం ఇక్కడ తెలుసుకుందాం. గార్డెన్‌ సాయిల్‌ 30 శాతం, ఇసుక లేదా కోకోపీట్‌ 30 శాతం, ఎరువు, కంపోస్టు కలిపి 40 శాతం, గుప్పెడు వేపపిండి వేసి కలుపుకోవాలి.

కోకోపీట్‌ అందరూ వాడుతున్నారు. కానీ కోకోపీట్‌ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. కోకోపీట్‌ వాడడం వలన కంటైనర్‌ అడుగున తేమ ఉంటుంది. మట్టి గుల్లగా ఉండాలని కోకోపీట్‌ వాడుకుంటారు. కానీ ఎండాకాలంలో మట్టి గట్టిగా అవుతుంది. మొక్కలలో ఎదుగుదల తక్కువగా ఉంటుంది. కూరగాయల మొక్కల వరకు వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. కానీ పండ్ల మొక్కలను పెంచుకోవాలనుకుంటే కోకోపీట్‌ పనికిరాదు. మొక్కలకు నీళ్ళు పోసేటప్పుడు తేమ చూసి పోసుకోవాలి.

కొత్తగా మొదలు పెట్టేవారికి మొక్కలకు నీళ్ళు పోయాలనే విషయం తెలుస్తుంది కానీ తేమ చూసి ఇవ్వాలని తెలీదు. కొత్తవారు సహజంగానే ఎక్కువ నీళ్ళు పోయాలనుకుంటారు. అటువంటప్పుడు కోకోపీట్‌ కలపటం వలన మొక్కలకు వేరుకుళ్ళు వచ్చి మొక్కులు చనిపోతాయి. కాబట్టి కోకోపీట్‌ బదులుగా ఇసుక వాడుకోవాలి. ఇసుక వాడుకోవడం వలన మట్టి గుల్లగా ఉంటుంది. వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. నీళ్ళు ఎంత పోయాలి అనే సమస్య కూడా ఉండదు.

అందుకని కోకోపీట్‌ స్థానంలో ఇసుక వాడుకుంటే మంచిది. ఆకు కూరలు వేసుకోవాలి అంటే తప్పనిసరిగా మట్టి మిశ్రమంలో ఇసుక కలపాలి. అప్పుడే తడి లేకుండా, మొలకలు పడిపోకుండా ఉంటాయి. మట్టి మిశ్రమం కంటైనర్‌ లో 70 లేదా 75 శాతం మాత్రమే నింపుకోవాలి. మిగిలిన భాగం ఖాళీగా ఉంచాలి. ఖాళీగా ఎందుకు ఉంచాలి అంటే అప్పుడప్పుడు ఎరువులు ఇవ్వడానికి, మట్టిని వదులుగా చేయడానికి కావలసినంత స్థలం ఉండాలి.

ఎరువులు ఏవి వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి అనే సమస్య వస్తుంది. పైన చెప్పినట్లుగా ఏ ఎరువు అందుబాటులో ఉంటే అది వాడుకోవచ్చు. ఏదయినా బాగా మాగినది అయి ఉండాలి. లేదంటే వేరు పురుగులు (గ్రబ్స్‌) వస్తాయి. ఎరువుతో పాటుగా వర్మీ కంపోస్టు కూడా కలుపుకుంటే మొక్కలు పెట్టినప్పుడు వెంటనే శక్తి అందుతుంది. వేరు కుళ్ళు, నెమటోడ్స్‌, గ్రబ్స్‌ లాంటివి రాకుండా గుప్పెడు వేపపిండి కలుపుకోవాలి.

విత్తనాల ఎంపిక ఎలా అని సందేహం వస్తుంది చాలా మందికి. అది అసలు సమస్యే కాదు. ఎందుకంటే చాలా రకాల విత్తనాలు కొనకుండానే మనం కొనే కూరగాయల నుంచి విత్తనాలు తయారు చేసుకోవచ్చు. విత్తనాలు లేక మిద్దె తోట మొదలు పెట్టలేక పోతున్నాం అని చాలా మంది అంటూ ఉంటారు. మొదలు పెట్టాలి అనుకునేవారు ముందుగా ఆకుకూరలతో మొదలు పెట్టాలి. పెంచగలం అని నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు పెంచుకుంటూ పోవచ్చు. ఒకేసారి మొత్తం మొదలుపెట్టి చేయలేకపోతే నష్టపోతారు.

ఆకుకూరలు పెంచి నమ్మకం కలిగిన తర్వాత ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు. అందుకే విత్తనాలు కొనకుండా వంటి ఇంట్లో ఉన్న మెంతులు, ధనియాలతో మొదలు పెట్టాలి. మట్టిలో పశువుల ఎరువు కలుపుకుంటే దానిలో తోటకూర మొక్కలు వస్తాయి. మార్కెట్‌ నుంచి గోంగూర తెచ్చుకుని ఆకు తీసేసిన కాడలను మట్టిలో పెడితే గోంగూర మొక్కలు వస్తాయి. అలాగే పుదీనా కూడా పెంచుకోవచ్చు.

Terrace Vegetable Garden

Terrace Vegetable Garden

కూరగాయల విత్తనాలు కూడా (వంకాయలు, టమోటా, పచ్చిమిర్చి, చిక్కుడు, కాకర, దోస, కాప్సికం, బూడిద గుమ్మడి, గుమ్మడి, పుచ్చకాయ, ఖర్బూజ, స్ప్రింగ్‌ ఆనియన్స్‌, చిలగడ దుంప, చేమగడ్డ, కందగడ్డ, ఆలుగడ్డ, చౌచౌ లేదా సీమ వంకాయ, బఠాణీ, అలసందలు, కీర) మార్కెట్‌ నుంచి తెచ్చుకునే టప్పుడు ఒక ముదురు కాయ తెచ్చుకుంటే వాటిలోని విత్తనాలతో కూరగాయల మొక్కలు పెంచుకోవచ్చు. మిగిలిన విత్తనాలు నిదానంగా సేకరించుకోవచ్చు. మిద్దెతోట లో నేలలో కన్నా దిగుబడి తక్కువగా ఉంటుంది కాబట్టి హైబ్రిడ్‌ విత్తనాలు వేసుకుంటే దిగుబడి బాగుంటుంది.

దేశవాళీ విత్తనాలే కావాలి అనుకోకుండా హైబ్రిడ్‌ విత్తనాలు వేసుకుంటూ ఉంటే మూడు నాలుగు సార్లకు అవి దేశవాళీ విత్తనాలు అవుతాయి. ఒకసారి పంట పండిన తర్వాత కావలసిన విత్తనాలను మనమే సేకరించు కోవాలి. పంటలో మొదటిగా వచ్చిన కాయను విత్తనాలకు వదిలివేయాలి. అలా చేయడం వలన మొక్క కాపు కాలం పూర్తయి మొక్క ఎండిపోయే లోపల విత్తనాలకు వదిలిన కాయ కూడా ఎండిపోతుంది. ఆవిధంగా మన విత్తనాలను మనమే సేకరించుకోవాలి.

కావలసిన విత్తనాలను మట్టిలో విత్తుకోవాలి. విత్తనాలను నారు పోసుకోవడానికి మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి. కోకోపీట్‌, వర్మీ కంపోస్టు సమాన భాగాలుగా తీసుకొని బాగా కలిపి దానిలో విత్తనాలు విత్తుకోవచ్చు. లేదా గార్డెన్‌ సాయిల్‌, వర్మీ కంపోస్టు సమపాళ్లలో కలిపి విత్తుకోవాలి. లేదా ఇసుక, వర్మీ కంపోస్టు సమాన భాగాలుగా తీసుకొని బాగా కలిపి దానిలో విత్తనాలు విత్తుకోవచ్చు. కోకోపీట్‌ మిశ్రమంలో విత్తనాలు నాటుకుంటే నీళ్ళ తడి చూసి నీళ్ళు పోయాలి. లేదంటే మొలకలు కుళ్ళి పోతాయి. అన్నింటికంటే ఇసుక, వర్మీ కంపోస్టు మిశ్రమంలో విత్తనాలు విత్తుకోవడం వలన మొలకలు కుళ్ళి పోయే అవకాశం ఉండదు. ఇసుకలో వేరు వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మొలకలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

విత్తనాలలో తీగె జాతి విత్తనాలను నేరుగా మట్టిలో విత్తుకోవాలి. లేదంటే ప్లాస్టిక్‌ గ్లాసెస్‌  మట్టి మిశ్రమం వేసి దానిలో ఒక విత్తనం పెట్టి మొలక వచ్చిన తర్వాత ప్రధాన మడిలో జాగ్రత్తగా వేర్లు కదలకుండా విత్తుకోవాలి. తీగె జాతి విత్తనాలు గట్టిగా ఉంటాయి కాబట్టి కొన్ని గంటలు నీటిలో నానబెట్టి విత్తుకుంటే మొలకెత్తే శాతం ఎక్కువ ఉంటుంది. లేదా నానబెట్టిన విత్తనాలను జెర్మినేషన్‌ పేపర్‌ లో ఉంచి మొలకలు వచ్చిన తర్వాత విత్తుకోవాలి. లేదా విత్తనం మొలకెత్తే వైపు కొంచం కట్‌ చేసి విత్తుకోవాలి. ఈవిధంగా చేయడం వలన త్వరగా మొలకెత్తుతాయి. మొలకెత్తే శాతం కూడా ఎక్కువగా ఉంటుంది.

Also Read: అద్దె ఇంటిపై మిద్దె గార్డెనింగ్ చేస్తున్న సుజనీరెడ్డి

చిన్న విత్తనాలను వంకాయ, టమోటా, పచ్చిమిర్చి, ముల్లంగి లాంటి వాటిని నారు పోసుకుని మూడు జతల ఆకులు వచ్చిన తర్వాత ప్రధాన మడిలో జాగ్రత్తగా నాటుకోవాలి. లేదంటే ప్రధాన మడిలో నేరుగా విత్తుకోవచ్చు. విత్తనాలు విత్తుకోగానే నీళ్ళు పోయాలి. నీళ్ళను ఎలా అంటే అలా పోయకూడదు. చేతిలో నీరు తీసుకుని చల్లాలి. లేదా రోజ్‌ కాన్‌ తో నారు మడిలో నీరు పోయాలి.

నేరుగా నీరు పోసినప్పుడు విత్తనాలు మట్టిలో నుంచి బయటకు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత మొలకలు పడిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా రోజ్‌కాన్‌తో నీళ్ళు పోయాలి. ఆకుకూరలకు తప్పనిసరిగా రోజ్‌ కాన్‌ తోనే పోయాలి. రోజ్‌ కాన్‌ లేనప్పుడు ప్లాస్టిక్‌ బాటిల్‌ మూతకు సన్న రంధ్రాలు చేసి దానితో నీళ్ళు పోయాలి.

మొలకలు కొంచెం పెరిగిన తర్వాత నారును మడులలో నుంచి వేరు దెబ్బ తినకుండా జాగ్రత్తగా తీసి సాయంత్రం పూట ప్రధాన మడులలో నాటుకోవాలి. నాటుకున్న వెంటనే నీరు పోయాలి. తర్వాత అవసరాన్ని బట్టి నీళ్ళు ఇవ్వాలి.పెంచుకునే కూరగాయలను బట్టి కంటైనర్లను ఎంచుకోవాలి. వంకాయ, బెండకాయ, మిర్చి, టమోటా లాంటి మొక్కలకు ఒక అడుగు లోతు ఉన్న కంటైనర్లు కావాలి. ఒక మొక్కకు ఒక అడుగు వెడల్పు ఉండాలి. ఏ కాయగూరలైనా ఒకటి రెండు మొక్కలు పెట్టి కుటుంబ అవసరాలకు కాయలు సరిపోలేదు అంటే రావు. ఒక కుటుంబం అంటే నలుగురు ఉన్న కుటుంబానికి కనీసం పన్నెండు మొక్కలు అవసరం అవుతాయి.

తీగ జాతి మొక్కలకు ఒక అడుగు లోతు, కనీసం రెండు అడుగుల వెడల్పు ఉన్న కంటైనర్లు కావాలి. దానిలో రెండు విత్తనాలు పెట్టుకోవాలి. నాలుగు అడుగుల వెడల్పు ఉన్న కంటైనర్లు అయితే తీగ జాతి మొక్కలకు బాగుంటాయి. పాదులకు వేరు వ్యవస్థ సమాంతరంగా వ్యాపిస్తుంది కాబట్టి వెడల్పు ఎక్కువ ఉన్న కంటైనర్లు కావాలి. ఒక కుటుంబానికి సరిపడా పంట రావాలంటే ఒక్కో రకం విత్తనాలను నాలుగైదు పెట్టుకోవాలి. అప్పుడే పాలినేషన్‌ సమస్య లేకుండా, కుటుంబానికి సరిపడా పంటను పండిరచు కోవచ్చు.
మిద్దె తోటలో పాదులను పాకించడానికి పందిరి అవసరం. నిలువు పందిరి వేసుకుంటే స్థలం కలిసి వస్తుంది. మామూలుగా పాదులకు వేసుకునే పందిరి వేసుకోవచ్చు.

కానీ పందిరి మీద పాదులు బాగా పెరిగితే కింద నీడ ఏర్పడి మిగిలిన మొక్కలు పెరగడం కష్టం అవుతుంది. అందుకని మిద్దె తోటలో నిలువు పందిరి వేసుకుంటే వీలుగా ఉంటుంది. నిలువు పందిరి ఎలా వేసుకోవాలి అనేది ఎవరికి ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోవచ్చు. కొబ్బరి తాళ్ళతో కట్టుకోవచ్చు. లేదా పర్మనెంట్‌గా వేసుకోవచ్చు.

నీటి యాజమాన్యం: నీటి యాజమాన్యం సరిగా చూసుకోవాలి. నీళ్ళు ఎక్కువ అయినా, తక్కువ అయినా మొక్కలు తట్టుకోలేవు. ఏకాలంలో అయినా మొక్కలకు ఉదయమే నీళ్ళు ఇవ్వాలి. ఆకుల మీద నీళ్ళు పోయకూడదు. అలా నీళ్ళు ఉదయమే ఇవ్వడం వలన ఆకుల మీద వచ్చే చాలా రకాల ఫంగస్‌ వ్యాధులను నివారించవచ్చు. ఎండాకాలంలో రోజుకు రెండు సార్లు నీళ్ళు పోయాలి. మట్టికి సూర్యరశ్మి తగలకుండా మల్చింగ్‌ చేయాలి.

మల్చింగ్‌ చేయడం వలన మట్టిలోని తేమ శాతం అలాగే ఉంటుంది. వానాకాలంలో అవసరం అనుకుంటేనే మొక్కలకు నీళ్ళు ఇవ్వాలి. చలికాలంలో తేమ చూసి ఇవ్వాలి. మట్టిలో ఎప్పుడు తేమ ఉండేలా చూసుకోవాలి. తడి ఉండకూడదు. రోజూ నీళ్ళు తేమ చూసి ఇవ్వాలి. డ్రిప్‌ పెట్టుకోవడం కంటే రోజ్‌ కాన్‌తో కానీ, మగ్‌తో కానీ నీళ్ళు పోసుకోవాలి. ఆకుకూరలకు మాత్రం రోజ్‌ కాన్‌ తో పోయాలి.
మిద్దె తోటలో కొన్ని పూల మొక్కల అవసరం కూడా ఉంటుంది.

మిద్దె తోట అందంగా, ఆకర్షణీయంగా కనపడటానికి పెంచుకోవాలనుకోవడం ఒక కారణమయితే, ఇంకొక ముఖ్యమైన కారణం పాలినేషన్‌ కొరకు పెంచుకోవాలి. ఎక్కువగా పసుపు రంగు పూల మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పసుపు రంగు పూలు పాలినేటర్స్‌ ను ఎక్కువగా ఆకర్షిస్తాయి. పసుపు రంగు పూల మొక్కలను పెంచుకోవడం వలన తోటలోకి హనీ బీస్‌, కందిరీగలు, సీతాకోక చిలుకలు లాంటి పాలినేటర్స్‌ వస్తాయి.

వాటి వలన తీగ జాతి మొక్కలలో పాలినేషన్‌ సహజంగా జరుగుతుంది. కానీ మిద్దె తోటలో సాయంత్రం పూట పాలినేటర్స్‌ తక్కువగా ఉంటాయి. అందువలన సాయంత్రం పూట పూలు విచ్చుకునే తీగ జాతి మొక్కలు సొర, బీర లో పాలినేషన్‌ జరగడం కష్టమవుతుంది. అందుకని హ్యాండ్‌ పాలినేషన్‌ అవసరం అవుతుంది. పిందె ఉన్న పువ్వులు ఆడ పువ్వులు. పిందె లేని పువ్వులు మగ పువ్వులు. మగ పువ్వుల పోలెన్‌ ను ఆడ పువ్వుల స్టిగ్మా మీద సున్నితంగా తాకించాలి. దానినే హ్యాండ్‌ పాలినేషన్‌ అంటారు. మిగిలిన తీగ జాతి రకాల పూలు అన్నీ దాదాపుగా ఉదయం పూట విచ్చుకుంటాయి.

Organic Terrace Garden

Organic Terrace Garden

ఉదయం పాలినేటర్స్‌ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హ్యాండ్‌ పాలినేషన్‌ చేయనవసరం లేదు. ఒకవేళ పాలినేషన్‌ జరగకుండా పిందెలు కుళ్ళి పోతున్నాయి అనుకున్నప్పుడు హ్యాండ్‌ పాలినేషన్‌ చేసుకోవచ్చు. పాదులకు నీళ్ళు ఎక్కువ అయినా పాలినేషన్‌ కాకముందే పిందెలు కుళ్ళి పోతాయి. పాలినేషన్‌ సమస్య రాకుండా ఉండాలంటే మిద్దె తోటలో ఒకో రకం తీగె జాతి మొక్కలను కనీసం నాలుగైదు పెట్టుకోవాలి. వంగ, బెండ, పచ్చిమిర్చి, టమోటా, కాప్సికం ఇలాంటి కూరగాయ మొక్కలకు పాలినేషన్‌ చేయనవసరం లేదు. వాటిలో మేల్‌, ఫిమేల్‌ (ఆడ, మగ) ఆర్గాన్స్‌ రెండు ఒకే పువ్వులో ఉంటాయి. అందుకని వాటిలో సహజంగానే గాలికి పాలినేషన్‌ జరుగుతుంది. ఒకవేళ జరగలేదు అనిపిస్తే పూల మీద చేత్తో సున్నితంగా తట్టాలి. అప్పుడు పాలినేషన్‌ జరుగుతుంది.

ఎరువులు ఇవ్వడం ఎలా ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనే సమస్య వస్తుంది. మొక్కలు పెరుగుతున్న కొద్దీ, కొద్దిగా అంటే ఒక గుప్పెడు ఎరువు లేక కంపోస్టును మొక్క చుట్టూ మట్టిని పైపైన తవ్వి, మొక్క చుట్టూ కొద్ది దూరంలో వేసి మళ్ళీ మట్టిని పైన వేయాలి. మొక్క సైజును బట్టి, కుండీ పరిమాణాన్ని బట్టి ఎరువులు కానీ కంపోస్టు కానీ ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. మొక్కలు పూత, కాత దశకు వచ్చిన తర్వాత ఎక్కువ అంటే రెండు గుప్పెళ్ళు వేయాలి. ఈ దశలో ఫాస్ఫరస్‌, పొటాషియం, కాల్షియం అవసరం ఉంటుంది. ఈ విధంగా మొక్కలకు ఇరవై రోజులకు ఒకసారి ఇవ్వాలి. ఇచ్చే ఎరువులు బాగా మాగినది అంటే కనీసం ఆరు నెలల పాతది అయి ఉండాలి. లేకపోతే వేరు పురుగులు వచ్చే ప్రమాదం ఉంది.

అలాగే అప్పుడప్పుడు లిక్విడ్‌ ఫర్టిలైజర్స్‌ ఇస్తే మొక్కలకు వేంటనే శక్తి అందుతుంది. ఆరోగ్యంగా ఉంటాయి. లిక్విడ్‌ కంపోస్ట్‌ లలో జీవామృతం, వేస్ట్‌ డీ కంపోజర్‌, కంపోస్టు టీ, అరటి తొక్కల ద్రావణం, బియ్యం, పప్పులు కడిగిన నీళ్ళు ఇవ్వాలి. వీటిలో ఏవి వీలుగా ఉంటే అవి ఇవ్వవచ్చు. అన్ని తప్పనిసరిగా ఇవ్వాలని ఏమీ లేదు.

అన్ని మొక్కలకు పాత ఆకులు తీసేస్తూ ఉండాలి. తీగ జాతి మొక్కలకు కిందనుంచి ఆకులు అన్ని తీసేయాలి. వంగ, టమోటా లాంటి మొక్కలలో కూడా ఆకులు తీసేస్తూ ఉండాలి. ఆకులు ఎక్కువ ఉంటే బలం ఆకులకు పోయి మొక్క గుబురుగా తయారవుతుంది కానీ కాయలు ఎక్కువ రావు. వంకాయ, పచ్చిమిర్చి మొక్కలకు చిగుర్లు తుంచితే ఎక్కువ కొమ్మలు వస్తాయి. పూత, కాత అయిపోగానే ఎండిన కొమ్మలు తీసేసి, కొంచెం ప్రూనింగ్‌ చేస్తే మరల చిగుర్లు వచ్చి పూత, కాత మొదలవుతుంది. టమోటా మొక్కలకు టిప్స్‌ తుంచకూడదు. కింది నుంచి పాత ఆకులు తీసేస్తూ ఉండాలి.

మిద్దె తోటను సాధ్యమైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవాలి. అందంగా ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవాలి. పాత ఆకులు తీసేయడం వలన, శుభ్రంగా ఉంచుకోవడం వలన చీడపీడలు లాంటివి రాకుండా ఉంటాయి. చీడపీడలు రాకుండా బంతి, ఆవ, తులసి లాంటి మొక్కలను పెంచుకోవాలి.
తీగ జాతి మొక్కలకు 3 జీ కటింగ్‌ చేస్తే మగ, ఆడ పువ్వులు వస్తాయి. లేకపోతే ఒకోసారి ఆడ పువ్వులు మాత్రమే వస్తాయి, లేదా మగ పువ్వులు మాత్రమే వస్తాయి. రెండు రావాలంటే 3 జీ కటింగ్‌ చేయాలి. తీగ 3 మీటర్లు పెరిగిన తర్వాత ఆ తీగ చివర తుంచాలి.

అక్కడ నుంచి రెండు తీగలు వస్తాయి. ఆ రెండు తీగలు 2 మీటర్లు పెరిగిన తర్వాత వాటి చివర్లు తుంచాలి. రెండు తీగెలకు రెండు రెండు తీగలు అంటే నాలుగు తీగలు వస్తాయి. నాలుగు తీగలు ఒక మీటరు పెరిగిన తర్వాత వాటి చివర్లు తుంచాలి. ఇలా చేస్తే దానిని 3 జి కటింగ్‌ అంటారు. సాధారణంగా తీగ జాతిలో ముందు మగ పువ్వులు మొదలవుతాయి. ఆ తర్వాత ఆడ పువ్వులు వస్తాయి.

పిందెలు పెరిగి కాయలు అయిన తర్వాత ముదిరి పోయేదాకా ఉంచకూడదు. ఎప్పటికప్పుడు కాయలను కోసేస్తూ ఉండాలి. అప్పుడే మెక్కకు ఉన్న పిందెలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆకుకూరలు కూడా ముదిరి పోయేదాకా ఉంచకూడదు. అలా ఉంచడం వలన చీడపీడలు వస్తాయి. కాబట్టి ఆకుకూరలను ముదిరి పోయేదాకా ఉంచకుండా ఎప్పటికప్పుడు కోసుకోవాలి.

ఎండాకాలంలో మొక్క చుట్టూ మట్టి పైన మల్చింగ్‌ చేయాలి. మట్టిలో తేమ ఎప్పుడూ ఉండాలి కాబట్టి మట్టికి ఆచ్ఛాదన కల్పించాలి. ఆచ్ఛాదన కొరకు ఏవి వాడుకోవాలి అంటే ఎరువు, కంపోస్టు, ఎండిన ఆకులు, సన్నని కొమ్మలు, పుల్లలు ఎండుగడ్డి, కొబ్బరి పీచు, వరిపొట్టు, చెక్కపొట్టు ఏది దొరికితే అది వేసుకోవాలి. ఎండాకాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కలు అంత ఎండను తట్టుకోలేవు. అందుకని మిద్దె తోటలో షేడ్‌ నెట్‌ వేసుకోవచ్చు.

ఏడెనిమిది కూరగాయల మొక్కల కుండీల తర్వాత ఒక పండ్ల మొక్కను పెంచుకుంటే ఆ చెట్టు పెరిగి దాని నుంచి వచ్చే నీడ కూరగాయల మొక్కలకు షేడ్‌ నెట్‌ వేసుకోకుండా సరిపోతుంది. అందుకని మిద్దె తోటలో పండ్ల మొక్కలు కూడా పెంచుకోవాలి. పండ్ల మొక్కల ఎంపిక కూడా సంవత్సరం పొడవునా దిగుబడి ఇచ్చే మొక్కలు అయి ఉండాలి. ఉదాహరణకు అంజీర్‌, సపోటా, దానిమ్మ, లాంటి మొక్కలు పెంచుకోవాలి. మిద్దెతోటలో కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు పెంచుకోవడం వలన రసాయన రహిత ఆహారం పండిరచుకుని తినగలుగుతాము. అందరూ ఇలాగే చేయాలి అని లేదు. పెంచుతూ ఉంటే ఎవరి అనుభవాన్ని బట్టి వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.

లత కృష్ణమూర్తి

Also Read: మిద్దె తోటలలో టమాటా మొక్కల యాజమాన్యం

Leave Your Comments

Natural Farming Board: నేచురల్ ఫార్మింగ్‌ కోసం రూ.32 కోట్లు ఖర్చు చేయనున్న హర్యానా

Previous article

Russia Ukraine War: రొయ్యల రైతులపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం

Next article

You may also like