పరిస్థితులకు తగ్గట్టు మనుషులూ మారుతున్నారు. ప్రతిఒక్కరిలోనూ కదలిక వస్తుంది. యాంత్రిక జీవితం బోర్ కొట్టేస్తుంది. తాతల కాలం నాటి రోజులు గుర్తు వస్తున్నాయి. పర్యావరణంపై అందరిలోనూ ఓ అవగహన నెలకొంటుంది. ఇక తినే తిండిలోనూ మార్పులు కోరుకుంటున్నారు. రసాయనాల పంటను కాదని సొంతంగా కాయగూరలు పండించేందుకు ముందుకొస్తున్నారు. పచ్చని చెట్టు, ఆ చెట్టుపై మనం సొంతంగా పండించిన ఆహార పదార్ధాలను చూస్తే ఎవరికైనా తెలియని పులకింత. సేంద్రియ ఎరువులతో పండించిన పంట మనకే కాకుండా పిల్లలకు, ఇంట్లో ఉన్న వయసుమళ్ళిన వారికి ఎంతో ఆరోగ్యకరం. ఈ విషయాన్నీ చాలా లేటుగా తెలుసుకున్నా సరే… మార్పు వచ్చింది అది చాలు.
రసాయనిక అవశేషాల్లేని తాజా ఆకుకూరలు, కూరగాయలు , పండ్లు తినాల్న తపన ఉండాలే గానీ ఇంటిపట్టునే ఉంటూ పండించుకోవడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి. గదుల్లో, హాలులో, కిటికీల బయట, మెట్ల దగ్గర, ప్రహరీ గోడలకు వేలాడ దీసేలా పాత వస్తువులతో కుండీలను రూపొందించడం చేయవచ్చు. స్థలం కలిసి రావాలంటే ఒకే పొడవాటి తాడుకు కట్టి ఒకదాని వెంట ఒకటి ఒకే వరుసలో పైనుంచి కింద వరకూ వేలాడదీయవచ్చు. ఇలా చేస్తే తక్కువ స్థలంలోనే ఎక్కువ పంటలు పెంచవచ్చు. కుటుంబానికి అవసరమయ్యే కూరగాయలు, ఆకుకూరల్లో సగం వరకు ఇలాగే పెంచుకోవచ్చు.
ఇక జీవవైవిధ్యానికి తోడ్పడుతున్న తోటలోని మొక్కలకు ఎప్పుడూ పురుగుమందుల అవసరం లేదు. మనకు ముఖ్యంగా కావాల్సినవి మట్టితొట్టెలు, నల్లమట్టి, ఎర్రమట్టి, కుళ్లిన కొబ్బరిపొట్టు, వేపపిండి, ట్రైకోడెర్మావిరిడి, ఘన జీవామృతం, జీవన ఎరువులు, స్ప్రేయర్లు తదితరాలు ఉంటె మనమే ఒక ఉద్యానవన నిపుణులం. మిద్దెతోట ఏర్పాటులో మొదటగా బిల్డింగ్ స్లాబ్ అనుకూలం గా ఉన్నదా లేదా అని పరిశీలించుకుని తేలిక పాటి కుండీలు గ్రోబాగ్స్ ఏర్పాటు చేస్కుని కుండీలను కుండీల స్టాండ్ల మీద అమర్చుకుని సాగు ప్రారంభించాలి. అన్ని రకాల ఆకుకూరలు , కూరగాయలు, పూలు, పండ్ల చెట్లను మిథైమీద సాగు చేసుకోవచ్చు. మొక్కల కోసం 6 – 7 గంటలు ఎండ తగిలే విధంగా ఉంటేనే అవి బాగా పెరుగుతాయి. వారం వారం మిద్దెతోటలను శుభ్రంగా ఉంచుకోవటం స్లాబు పైన నీరు నిలువకుండ చూసుకోవటం ముఖ్యం ఎండాకాలంలో షేడ్ నెట్స్ ఏర్పాటు చేసుకోవటం వలన మొక్కలు పాడవకుండా కాపాడుకోవచ్చు వేసవి కాలంలో మొక్కలకు ఉదయం నీరు అందించాలి. మేలైన విత్తనాలు ఎంపిక మరియు సారవంతమైన మట్టి , పాటింగ్ మిక్స్, కంపోస్ట్ లు అధిక దిగుబడి అందిస్తాయి.
ఇంకా ఖర్చు గురించి ఆలోచన అవసరం లేదు. ఎందుకంటే ఇంటికి అవసరమైన ఆర్గానిక్ కూరగాయలు కొనాలంటే మాటలు కాదు. అదే మనకు మనంగా పండించుకున్నాం కాబట్టి ఖర్చు కలిసిరావడంతోపాటు కూరగాయల రుచి కూడా బాగుంటుంది. ఇంటిల్లిపాది ఆరోగ్యం బాగుంటుంది. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో మిద్దె తోటల సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతోంది. అదొక అభిరుచి, వ్యాపకంగా మారిపోతుండటంతో ప్రత్యేకత సంతరించుకుంటోంది. పట్ణణ, నగర ప్రాంతాల్లో అనేక కుటుంబాలు టెర్రస్ గార్డెనింగ్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం ద్వారా రసాయన అవశేషాల్లేని పంటలు పండించుకుంటూ అద్భుతాలు సృష్టిస్తున్నారు.
#TerraceGarden #RooftopGardening #middethota #agriculturenews #eruvaaka