వ్యవసాయాన్ని లాభసాటిగా చెయ్యాలంటే సమర్థ వనరుల వినియోగం, సరైన ప్రణాళిక ఎంతైనా అవసరం. ప్రస్తుత సంవత్సరంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఆశిస్తూ అందుకు గాను రైతులు కొన్ని ఆచరణ సాధ్యమయ్యే తేలికపాటి సాంకేతిక అంశాలైన క్రింది పనులను చేపట్టాలని తెలియపరుస్తున్నాము.
వేసవి దుక్కులు :- వేసవి కాలంలో అడపా దడపా కురిసే వర్షాలను సద్వినియోగ పరుచుకొని మాగాణి, మెట్ట, బీడు భూములను దున్నుకోవడమే వేసవి దుక్కులు. ఈ దుక్కులు దున్నే ముందుగా పశువుల ఎరువు, కంపోస్ట్ కానీ సమానంగా వెదజల్లి దున్నడం వల్ల నేల సారవంతమవుతుంది. అంతేకాకుండా భూమిలో వున్న కీటకాలు, శిలీంధ్రాలు చనిపోతాయి.
పంట అవశేషాలు తొలగించడం :-యాసంగిలో వేసిన పంట కోసిన తరువాత ఆ పంట యొక్క అవశేషాలను కాల్చకుండ ఆధునిక పద్ధతులతో విలువ జోడించి మెత్తగా వాడుకోవచ్చును
చెరువులోని పూడిక మట్టి తోలుకోవడం :-చెరువు మట్టిలో అనేక పోషకాలతో పాటు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే కర్బనం కూడా ఉంటుంది. అందువల్ల చెరువు మట్టిని రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.
చెరువు మట్టి ప్రయోజనాలు :-చెరువు మట్టిలో ఒండ్రు, బంక మట్టి రేణువులు అధికంగా ఉంటాయి. ఈ మట్టి తోలిన పొలాల్లో నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. చెరువు మట్టిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం తగినంత ఉండటం వలన ఉదజని సూచిక 7-7.5 వరకు ఉంటుంది. చెరువు మట్టి వేసిన పొలాల్లో వేసవి లో ఉష్ణోగ్రతల్లో పెద్దగా హెచ్చుతగ్గులు ఏర్పడవు. దీని వలన పైర్లు బెట్టుకు గురికాకుండా ఉంటాయి.
- చెరువు మట్టి వేసిన పొలాల్లో తేమ నిలిచే కాలం 4-7 రోజులు పెరుగుతుంది.
- చెరువు మట్టి ఎర్ర, చెల్క, దుబ్బ నేల నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించి సమపాళ్లలో గాలి, నీరు నిల్వ ఉండేలా చేసి ఉత్పాదకతను పెంచుతుంది.
భూసార పరీక్షలు చేసుకోవడం :-పైర్లకు కావాల్సిన అన్ని పోషకాలు ఎంతో కొంత పరిమాణంలో నేలలో సహజంగానే ఉంటాయి. నేలలో పోషకాలు ఏ స్థాయిలో, ఏ మోతాదులో తెలుసుకోవడం భూసార పరీక్ష చేయించాలి. నేల రంగు, స్వభావం వంటి భౌతిక లక్షణాలే కాక, ఉదజని సూచిక, లవణ పరిమాణం, సేంద్రియ కర్బనం, లభ్య భాస్వరం, లభ్య పొటాషియం నిర్దారించి సలహాలు, సూచనలు “సాయిల్ హెల్త్ కార్డ్” రూపంలో రైతులకు అందజేస్తారు. ప్రతి రైతు తప్పని సరిగా భూసార పరీక్ష చేయించడం మంచిది. ఏప్రిల్ – మే నెలలు మట్టి నమూనా తీయడానికి అనువైన సమయం.
భూసార పరీక్ష లాభాలు :-
- నేలలో ప్రధాన పోషకాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోవచ్చు.
- నేల సారం పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి తెలుస్తాయి.
- నేల రసాయన గుణాలైన ఆమ్లా, క్షార, తటస్థ గుణాలు తెలుస్తాయి.
- ఎరువులు వినియోగంపై అనవసర ఖర్చు తగ్గించి సమతుల ఎరువుల వాడకం సాధ్యమవుతుంది.
పశువుల ఎరువులు వేసుకోవడం :- పశువుల ఎరువులు నేల నిర్మాణంలో ఎంతో ఉపయోగపడతాయి. కేవలం రసాయన ఎరువులపై ఆధారపడటం కాకుండా సేంద్రియ ఎరువులైన పశువుల పేడ, కోళ్లపెంట, గొర్రె ఎరువులు నేల సారాన్ని పెంచుతాయి. వేసిన ఎరువులను సమాంతరంగా చల్లుకొని, వాలుకు అడ్డంగా లోతుగా దున్నడం వలన వర్షం నీరుతో పాటు ఎరువులోని పోషకాలు నేలలోకి ఇంకి మొక్కలకు నేరుగా అంది ఉత్పాదకత పెరిగే అవకాశం వుంది.
పచ్చిరొట్టే పైర్లకు వేసుకోవడం :-వేసవిలో దుక్కి చేసుకోవడం వలన పడిన కొద్ది వర్షం నేలలో ఇంకి నేల తేమగా ఉంటుంది. ఆ సమయం లో పచ్చి రొట్ట ఎరువులు వేసుకున్నట్లయితే మంచిగా మొలకెత్తి వేరు బుడిపెల ద్వారా నేలను సారవంతం చేస్తాయి. పచ్చి రొట్ట ఎరువులు సేంద్రియ కర్బనం పెంచడంలో ఎంతో సహాయం చేస్తాయి.
కె. శేఖర్, శాస్త్రవేత్త (సేద్య విభాగం) & కో ఆర్డినేటర్ (ఏరువాక కేంద్రం, కరీంనగర్)
డా . జి . మంజులత , ప్రధాన శాస్త్రవేత్త హెడ్ , ఏ ఆర్ ఎస్, కరీంనగర్.