నీళ్లు పుష్కలంగా ఉండడంతో రైతులు మూడో పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. బహుళ ప్రయోజనాలున్న పెసరను ఎంచుకొని ప్రస్తుతం వరి మాగాణుల్లో విత్తనాలు విత్తే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో స్వల్ప కాలంలోనే అదనపు ఆదాయం చేతికందడంతో పాటు భూసారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పెసర పంట బాగా పండితే ఎకరానికి దాదాపు రూ. 20 వేల పైనే రాబడి ఉంటుంది. ఎకరానికి రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో పెసళ్ళకు రూ. 100 నుంచి రూ. 110 ధర పలుకుతున్నది. వరి కోసిన వెంటనే అనగా మార్చి చివరి వారం నుంచి మే మొదటి వారం వరకు పెసర విత్తవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత కూడా 70 రోజుల్లో పంట చేతికి వస్తుండటంతో వరి సాగుకు సమయం అప్పటికే మించిపోతుంది. కనుక పెసర సాగు చేయాలనుకునే రైతులు దీనిని దృష్టిలో పెట్టుకొని విత్తనాలు వేసుకోవాలి.
పెసర సాగుతో రైతుకు అదనపు ఆదాయం రావడంతో పాటు భూసారం పుష్కలంగా పెరుగుతుంది. నేలలో సేంద్రియ పదార్థం చేరుతుంది. తద్వారా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. భూమిలో నీటిని, పోషకాలను నిల్వ చేసే గుణం పెంచుతుంది. నత్రజని, భాస్వరం, పొటాష్ తో పాటు సూక్ష్మ పోషకాలు భూమిలో నాలుగు శాతం వృద్ధి చెందుతాయి. నేల కోతకు గురి కాకుండా ఉంటుంది. పంట దిగుబడి 10 శాతం పెరుగుతుంది. ఎకరం పెసర సాగుతో దాదాపుగా రెండు నుంచి మూడు టన్నుల ఎరువు తయారవుతుంది. ఈ ఏడు నీళ్ల కొరత లేకపోవటంతో ఎకరంలో మూడో పంటగా పెసర వేసిన ఇక పొలంలో పశువుల పెంటతోలనవసరం లేదు. జూన్ ఆఖరిలో ఏరడానికి వస్తుంది. భూమిలో కలియదున్ని వరి నాట్లు వేస్తే మంచి దిగుబడులు వస్తాయి.
పెసర.. బహుళ ప్రయోజనకారి
Leave Your Comments