Rajanagar Sitaphal: సీతాఫలం సీజన్ మొదలైంది. ఇప్పటికే మార్కెట్లో సీతాఫలాలు అందుబాటులోకి వచ్చేశాయి. మనిషి శరీరానికి అవసరమైన కీలక పోషకాలన్నీ ఈ పండులో ఉంటాయి. ఫలాల్లో రుచిలో సీతాఫలం ప్రత్యేకం. అందుకే మనలో చాలా మంది అంత అమితమైన ఇష్టపడతారు. రాష్ట్రంలో రాజానగరం సీతాఫలాలకు ప్రత్యేక పేరు ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ లభించే సీతాఫలాలు రూపంలో ఆకర్షిస్తూ, రుచిలో మైమరపిస్తుంటాయి. ఈ కాలంలో వీటి కొనుగోలుకు అందరూ ఆసక్తి చూపుతుంటారు.
గోదావరి జిల్లా లోని రాజమండ్రి కి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజానగరం జాతీయ రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల పొడవున మనకి ఈ సీజన్లో సీతాఫలాలు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ గుడిసెలు వేసుకుని రైతులు ప్రత్యేకంగా సీతాఫలాలు అమ్ముతూ ఉంటారు. రాజానగరం పండే సీతాఫలాలు పక్వానికి వచ్చిన తర్వాత చెట్ల నుంచి కోస్తారు. దీంతో ఇవి కొనుగోలుదారులను ఆకట్టుకుంటాయి. రాజానగరంలో సుమారు 3,500 మంది చిరు వ్యాపారులకు ఇవే జీవనాధారం. రోడ్డు పక్కన స్టాల్స్ ఏర్పాటు చేసి, కాయలను సైజుల వారీగా గ్రేడింగ్ చేసి, డజను రూ.200 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు.
Also Read: ప్రకృతి విలువ ఆధారిత వాణిజ్య పంటగా వెదురు.!

Rajanagar Sitaphal
సీతాఫలం పంట గిరిజన రైతులకు సిరులు కురిపిస్తుంది. పంట సాగుకు ప్రకృతి అనుకూలించడంతో దిగుబడులు పెరిగాయి. ఏజెన్సీలో ఏ గ్రామంలో చూసినా సీతాఫలాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్లే రహదారిలో మనకి జగ్గంపేట దాటిన 15 కిలోమీటర్ల తర్వాత రాజానగరం అనే ప్రాంతం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడే ఈ సీతాఫలాల దుకాణాలు దర్శనమిస్తాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో వరుసగా ఈ దుకాణాలు ఉంటాయి.
రాజానగరంలో లభించే సీతాఫలాలు సైజులో భారీ ఉంటాయి ఎంతలా అంటే వాటిని పట్టుకోవడానికి రెండు చేతులూ సరిపోవు. సైజ్ లోనే కాదు వాటి రుచిలో అమోఘంగా ఉంటుందంటారు కొనుగోలుదారులు. జాతీయ రహదారి గుండా వచ్చే అనేకమంది ఈ రాజానగరం ప్రాంతంలో ఆగి పచ్చని చెట్లు కింద అమ్ముతున్న ఈ సీతాఫలాలు కొని ఇతర ప్రాంతాలకు తీసుకు వెళ్తుంటారు. ఏజెన్సీలో వర్షాలు అధికంగా కురుస్తూండటంతో జూన్ నెలాఖరు నుంచి అక్కడ సీతాఫలాలు లభిస్తూంటాయి.
రాజానగరం సీతాఫలం తినాలంటే పెట్టి.. పుట్టాలంటారు. ఇక్కడ లభించే సీతాఫలంలో ఉండే తియ్యని గుజ్జు అమృతాన్నే తలపిస్తుంది. అందుకే అందరికీ ఆ పండు అంతలా ఇష్టం. వీటిలో సి విటమిన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇక్కడి కొండ ప్రాంతాల్లో వంద శాతం సేంద్రియ పద్ధతిలో గిరిజనులు సీతాఫలాల తోటలను సాగుచేస్తున్నారు.
వీటి నుంచి వచ్చే దిగుబడులు నాణ్యమైనవి కావడం, రుచిగా ఉండటంతో కొనుగోలుకు అధికమంది ఆసక్తిచూపుతున్నారు. అందుకే మన్యం సీతాఫలాలకు మార్కెట్లో గిరాకీ ఉంది. ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు వచ్చి ఇక్కడి పంటను కొనుగోలు చేస్తున్నారు. సీతాఫలంతో పాటు దాని చెట్టు ఆకు, బెరడు, గింజలలో కూడా మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలున్నాయి. యాపిల్ పండ్లతో పోల్చిస్తే.. సీతాఫలం తక్కువ ధరకు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది. అందుకే ఈ సీజన్లో తప్పక సీతాఫలం తిని మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుందాం.
Also Read: శనగ పంట సాగులో మెళకువలు.. అధిక దిగుబడులు.!