Fresh Water Fish Transportation Management: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని మంచి నీటి వనరుల్లో రైతులు ఎక్కువగా మిశ్రమం పెంపక విధానంలో కార్పు రకాల చేపలు పెంపకం చేపడుతున్నారు. దేశీయ కార్పు రకాలైన బొచ్చె, రాగండి, ఎర్రమైల రకాలు, విదేశీ కార్పు రకాలైన గడ్డి చేప, బంగారు తీగ, రకాలతో కలిపి పెంచడం జరుగుతుంది. ఈ విధమైన మిశ్రమ పెంపక విధానం లో పాక్షిక సాంద్ర పద్ధతిలో ఎకరాకు 3 నుండి 4 టన్నులు, పంచాయతీ మరియు కమ్యూనిటీ చెరువులో ఎకరాకు 600 నుండి 800 కేజీల వరకు ఉత్పత్తి జరుగుతున్నది. అయినప్పటికీ పట్టుబడి సమయంలో మార్కెట్ కు తరలించే సమయంలో చేపలు నాణ్యత తగ్గడం వలన మార్కెట్లో మంచి ధరలు రాక రైతులు నష్టపోవడం జరుగుతుంది. అందువల్ల చేపలు పట్టుబడి సమయం లో, వాటిని ప్యాక్ చేసి రవాణా సమయంలో కొన్ని జాగ్రత్తలు వహించి సరైన పద్ధతిలో సకాలంలో మార్కెట్కు తరలించినప్పుడే ఉత్పత్తి చేసిన చేపలకు మంచి ధర పలికి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది.
చేపల పట్టుబడి కి ముందు చేపట్టాల్సిన చర్యలు:
రైతులు చెరువులో ఉన్న చేపల రకాలు, వాటి సైజులను బట్టి గత కొన్ని రోజులుగా మార్కెట్లో ఏ విధమైన ధరలు ఉన్నాయో తెలుసుకుంటూ ఉండాలి. ధరలు పెరిగే అవకాశం ఉంటే పెంపక కాలాన్ని కొంతకాలం వరకు పొడిగించుకోవచ్చు. అంతేకాకుండా ఏప్రిల్ మే నెలలో పంచాయతీ చెరువుల్లో, కమ్యూనిటీ చెరువుల్లో సాధారణంగా నీటి మట్టం బాగా తగ్గి పట్టుబడులు పెరుగుతాయి. కనుక పెంపక చెరువులోని చేపలకు డిమాండ్ తగ్గి మార్కెట్ ధర పడిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో పట్టుబడిని కొంతకాలం పాటు వాయిదా వేసుకోవాలి.
పట్టుబడికి వారం రోజుల ముందు చెరువు అడుగు భాగంలోని నీటిని తీసి కొత్త నీటితో నింపుకోవడం వల్ల సమయానికి నాణ్యంగా ఉంటాయి. పట్టుబడికి ఒకరోజు ముందు మేత వేయడం నిలిపివేయాలి. ఈ విధంగా చేయడం వల్ల పట్టుబడి సమయంలో చేపలు ఆరోగ్యంగా ఉండి రవాణా సమయంలో నాణ్యత కోల్పోకుండా ఉంటుంది. చెరువు సైజు, చేపల మొత్తం బరువు (బయోమాస్)ను బట్టి చేపలు పట్టే వారికి చెప్పి, వలలు, ఐస్ వంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. పట్టుబడి చేసే సమయంలో చేపల బరువును ముందుగా అంచనా వేసి రెట్టింపు మోతాదులో ఐస్ పట్టుబడి సమయానికి వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి.
Also Read: Jhora Fish Farming: జోరా టెక్నిక్‌తో చేపల పెంపకం
చేపల పట్టుబడి చేసే సమయంలో:
చేపలు పట్టుబడి చల్లని వాతావరణంలో చేసుకుంటే చేపలు తొందరగా పాడవకుండా ఉంటాయి. సాధారణంగా ఉదయం పూట 9 గంటల లోపు పూర్తి అయ్యేలా ఏర్పాటు చేసుకోవాలి. చెరువులోని నీటి పరిమాణాన్ని బట్టి తెల్లవారుజాము కల్లా మూడిరట రెండు వంతుల నీరు తగ్గే విధంగా కాలువల ద్వారా నీటిని తీసివేయాలి. నీటిమట్టం తగ్గిన తరువాత లాగుడు వలలతో చెరువు లోతు భాగం నుండి వలను చేపల పై ఎక్కువ ఒత్తిడి లేకుండా పట్టుబడి చేసుకోవాలి.
పట్టుబడి చేసిన తరువాత:
పట్టుబడి చేసిన చేపలు శ్వాసక్రియ ఆగిపోయి చనిపోయిన వెంటనే వాతావరణంలోని ఉష్ణోగ్రత ఆధారంగా సూక్ష్మజీవుల, జీవ రసాయన చర్యలు ప్రారంభమవుతాయి. అందువల్ల పట్టుబడి చేసిన చేపలను చల్లని నీటితో కడిగి ప్లాస్టిక్ సంచుల్లో గాని వెదురు బుట్టలు ప్యాకింగ్ చేసే ప్రదేశానికి తీసుకెళ్లాలి. వలను రెండు మూడు సార్లు లాగడం వలన చెరువు అంతా బురదగా మారి చేపల పై బురద, రక్తపు మరకలు, జిగురు ఏర్పడడం జరుగుతుంది. అందువల్ల చల్లని మంచి నీటితో కడగకపోతే చేపలు త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పట్టుబడి చేసిన చేపలను చెరువుకు వీలైనంత దగ్గరగా నీడ ఉండే ప్రాంతంలో గ్రేడిరగ్ చేసి తూకం వేసి ప్యాకింగ్ కు ఏర్పాటు చేసుకోవాలి.
అన్ని సైజుల చేపలను ఒకే దగ్గర ఉంచితే సరైన ధర లభించదు. చేపల రకాలు, సైజులను బట్టి గ్రేడిరగ్ చేసుకుని మార్కెట్ చేసుకుంటే సరైన ధర లభిస్తుంది. గ్రేడిరగ్ చేసేప్పుడు గాయపడిన, చెడిపోయిన, వ్యాధిగ్రస్తమైన చేపలను వేరుగా ప్యాకింగ్ చేసుకోవాలి. గ్రేడిరగ్ మరియు తూకం కోసం చేపలు బయట వేయాల్సి వస్తే చదునుగా ఉండే నేలపై ప్లాస్టిక్ పరదాలను గాని టార్పాలిన్ షీట్లను గాని పరచి మట్టి, బురద అంటకుండా తొందరగా ప్యాకింగ్ చేసుకోవాలి.
తూకం వేసిన చేపలను ప్లాస్టిక్ పెట్టెల్లో గాని ధర్మకోల్ పెట్టెలలో గాని ఐస్‌తో కలిపి ప్యాకింగ్ చేసుకోవాలి. దూర ప్రాంతాలకు రవాణా చేసేటప్పుడు చేపలు తాజా స్థితిలో ఉంచడానికి ఐస్ ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్యాకింగ్ చేసే సమయంలో పెట్టెలో ముందుగా ఒక లేయర్ ఐస్ వేసి తర్వాత ఒక పొర చేపలు వేసి తరువాత పొరను ఐస్‌తో కప్పాలి. ఈ విధంగా చేయడం వలన ప్యాక్ చేసిన అన్ని చేపలకు చల్లదనం సమానంగా ఉండి, రవాణా సమయంలో చేపలు పాడవకుండా ఉంటాయి.
లైవ్ ఫిష్ మార్కెట్ విధానం:
ఈ మధ్యకాలంలో వినియోగదారుల్లో లైఫ్ ఫిష్ మార్కెట్ పై మంచి అవగాహన పెరిగింది కాబట్టి పట్టుబడి చేసిన చేపల లో కొంత భాగాన్ని లైవ్ ఫిష్ మార్కెట్ కు అందిస్తే మంచి ధరలు పొందే అవకాశం ఉంది. లైవ్ ఫిష్ రవాణా చేసే వాహనంలో లేదా టాంకులలో ముందుగా శుభ్రమైన నీటిని నింపుకుని అవసరమైన ఆక్సిజన్ అందించడానికి ఆక్సిజన్ సిలిండర్ లేదా చేపల రవాణాకు వాడే నీటిని తిరగ తోడే విధంగా పంపుసెట్ల ను ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి.
పట్టుబడి చేసిన చేపల జీవక్రియ రేటు ఎక్కువగా ఉండి ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది అందువల్ల రవాణా చేసే దూరాన్ని బట్టి టాంకులలో గాని వ్యాన్లో గాని వేసే చేపల మొత్తం బరువును నిర్ణయించుకోవాలి. లైవ్ ఫిష్ మార్కెట్ అందించే చేపల విషయంలో పట్టుబడి చేసిన చేపలను కొంత సమయం పాటు చెరువులో హపాలలో గాని వలలో గాని ఉంచేటు చేయాలి ఈ విధంగా చేయడం వల్ల చేప ప్రేగుల్లో ఉన్న ఆహార పదార్థం మొత్తం బయటికి వెళ్లడం ద్వారా చేపల రవాణా సమయంలో నీరు తొందరగా పాడవకుండా ఉంటుంది. చేపలను వీలైనంత తొందరగా రవాణా చేసే వాహనం వద్దకు తీసుకువచ్చి వాహనం లో నీటిలో వేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
ఈ విధంగా రైతులు మార్కెట్ లో చేపల ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పట్టుబడి చేసేప్పుడు, గ్రేడిరగ్, ప్యాకింగ్, రవాణా సమయంలో జాగ్రత్తలు పాటించినట్లయితే చేపలలో నాణ్యత తగ్గకుండా మార్కెట్లో మంచి గిట్టుబాటు ధరలకు అమ్ముకొని లాభాలను ఆర్జించవచ్చు.
సి.హెచ్. బాలక్రిష్ణ, (మత్స్య శాస్త్రవేత్త), కృషి విజ్ఞాన కేంద్రం, ఆమదాలవలస, శ్రీకాకుళం
ఎ. దేవీ వరప్రసాద్ రెడ్డి, (మత్స్య శాస్త్రవేత్త) కృషి విజ్ఞాన కేంద్రం, వెంకట రామన్న గూడెం, పశ్చిమ గోదావరి
ఎమ్. శ్యాం ప్రసాద్, (మత్స్య శాస్త్రవేత్త) కృషి విజ్ఞాన కేంద్రం, మమ్నూర్, వరంగల్
బి. మధు సూధనరావు, (మత్స్య అభివృద్ధి అధికారి) మత్స్య కమీషనర్ కార్యాలయం, విజయవాడ
డి. చిన్నం నాయుడు, ప్రోగ్రాం కో ఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, ఆమదాలవలస, శ్రీకాకుళం
Also Read: Fish Farming: కేజ్ ఫిషింగ్ పద్దతిలో చేపల సాగు