Fish Food : ఒకప్పుడు సాంప్రదాయ పద్దతి, విస్తార పద్దతిలో (ఎక్స్ టెన్సివ్ )పెంచే చేపల సాగు ప్రస్తుతం సాంద్ర పద్ధతిలోకి (ఇంటెన్సివ్) మారింది. దీని వల్ల రైతులు ఒక హెక్టారుకు 12-14 టన్నుల దాకా దిగుబడి సాధిస్తున్నారు. రైతులు అవలంబించే యాజమాన్య పద్దతుల మీద దిగుబడి ఆధారపడి ఉంటుంది. అనగా… నీటి యాజమాన్యం,మేత యాజమాన్యం, ఆరోగ్య యాజమాన్యం వంటివి. చేపల పెంపకంలో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించాలంటే… చేపలకు ఇచ్చే మేత నాణ్యత, దాని యాజమాన్యం మీద శ్రద్ద పెట్టాలి. ఎందుకంటే చేపల పెంపకములో అధిక శాతం (దాదాపు 50-60 శాతం)పెట్టుబడి మేత మీదే వెచ్చించాల్సి ఉంటుంది.చేపలు ఆరోగ్యకరంగా ఉండి మంచి పెరుగుదల సాధించడానికి వాటికిచ్చే మేతలో దిగువ తెలిపిన పోషకాలు తగినంతగా ఉండాలి.
మాంసకృత్తులు (ప్రోటీన్స్):
చేపల పెరుగుదలకు అనగా కణజాల నిర్మాణానికి అత్యావశ్యకమైన పోషకం.ప్రోటీన్లు పెరుగదలకే కాకుండా పాడైన కణజాల పునరుద్ధరణకు,చేప శరీరంలోని వివిధ జీవక్రియలు జరగడానికి కావలసిన శక్తిని ఇస్తాయి.చేపల మేతలో ప్రోటీన్లకు ఎక్కువ ఖర్చు అవుతుంది. మేతలో ప్రోటీన్ల శాతం అధికమవుతుంటే మేత ధర కూడా పెరుగుతూ ఉంటుంది.
పిండి పదార్థాలు:
ఇవి చేపల పెరుగుదలకు అంతగా దోహదపడవుగానీ చేపలకు కావలసిన శక్తిని తక్షణమే అందిస్తాయి.ఇవి ప్రోటీన్లతో పోల్చినప్పుడు మేతలో తక్కువ శాతం అవసరం.
కొవ్వులు / లిపిడ్స్:
ఇవి అత్యధిక శక్తినిచ్చే పోషకాలు.చేపల పెరుగుదలకు తోడ్పడే హార్మోన్ల తయారీలో,ఇతర జీవక్రియలలో కొవ్వులు ఉపయోగపడతాయి.చేపలు కొన్ని రకాలైన కొవ్వులను స్వయంగా తయారు చేసుకోలేవు.వాటిని తప్పనిసరిగా మేత ద్వారా అందివ్వాలి. వీటిని అత్యవసర ఫాటి ఆసిడ్స్ అంటారు. ఉదా: మేత ద్వారా సోయాబీన్స్ నుంచి లంభించే సోయాలేసిథిన్ ఇవ్వడం ద్వారా మంచి మేత లేదా ఆహార వినిమయ నిష్పత్తి సాధించవచ్చు.
మిటమిన్లు, ఖనిజ లవణాలు:
మిటమిన్లు,ఖనిజ లవణాలు చేపలపెరుగుదలకు,పోషణకు,పునరుత్పత్తికి చాలా అవసరం. చేపల మేతలో విటమిన్లు, ఖనిజ లవణాలను ఖచ్చితంగా చేర్చాలి. మంచినీటి చేపల పెంపకంలో రైతులు రెండు రకాల ఆహారాన్ని.. 1. సహజ ఆహారం 2. అనుబంధ ఆహారా లను చేపలకు అందజేస్తున్నారు.
సహజ ఆహారం:
చెరువు నీటిలో సహజంగా ఉత్పత్తి అయ్యే సూక్ష్మమైన వృక్ష, జంతు సముదాయం. (ప్లాంక్టాన్), నీటి కీటకాలు వాటి లార్వాలు, ఇతర నీటి పురుగులు, నీటి నాచు మొక్కలు మొదలైన వాటిని సహజ ఆహారం అంటారు. ప్లాంక్టాన్ ద్వారా అనేక రకాలైన కీలకమైన పోషక పదార్థాలు చేపలకు అందుతాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్,మినరల్స్,విటమిన్లు, కొవ్వులు వంటివి సహజంగా చేపలకు లభ్యమౌతాయి. అన్ని రకాల చేపలు ఒకే రకమైన ప్లాంక్టాన్ ను ఆహారంగా తీసుకోవు. బొచ్చె చేపలు ఎక్కువగా జంతు ప్లవకాలను ( జుప్లాంక్టాన్), వెండి చేప పైటో ప్లాంక్టాన్ ( వృక్ష ప్లవకాలను)లను , గడ్డి చేప మృదువుగా ఉండే కలుపు మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి.
ప్లవకాలు రెండు రకాలు:
వృక్ష ప్లవకాలు (ఫైటోప్లాంక్టాను), జంతు ప్లవకాలు (జుప్లాంక్టాను) మంచి నీటి చేపలకు వృక్ష ప్లవకాలైన స్పైరులీన, క్లోరెల్లా వంటివి ముఖ్యమైన సహజ ఆహారం.స్పైరులీనాలో 46-76% ప్రోటీన్లు, 8-10% కార్బోహైడ్రేట్స్, 4-9% లిపిడ్స్, 2.5-4.5% విటమిన్-ఎ, బి1, బి2, బి12, మిటమిన్-ఇ, బయోటిన్ ఫోలిక్ ఆమ్లం, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఇతర సూక్ష్మపోషకాలు లభిస్తాయి.అదే విధంగా క్లోరెల్లా ద్వారా 51-58% ప్రోటీన్లు, 12-17%కార్బోహైడ్రేట్స్, 14-22% లిపిడ్స్ లభ్యమౌతాయి. చేపల చెరువులో ఫైటో, జూప్లాంక్టాను నిష్పత్తి 8:2గా ఉండాలి. ఫైటోప్లాంక్టాను సహజ ఆహారంగానే కాకుండా తగిన సాంద్రతలో చెరువులో ఉన్నప్పుడు నీటి లక్షణాలు చక్కగా ఉండి, చేపలు ఆరోగ్యంగా పెరుగుతాయి. రైతులు సేంద్రీయ, రసాయన ఎరువులను వాడుతూ సహజ ఆహారమైన ప్లాంక్టాన్లను తగిన సాంద్రతలో ఉంచుకోవాలి.
అనుబంధ ఆహారం:
చేపల పెరుగుదలకు కావలసిన మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమతులంగా ఉండేలా తవుడు,వేరుశనగ చెక్క,పత్తి పిండి,సోయాపిండి, చేపల పొడి, రొయ్యలపొడి,గోధువపొట్టు,మొక్కజోన్న మొదలైన వాటిని తగిన పాళ్ళలో కలిపి తయారు చేసే ఆహారాన్నే అనుబంధ ఆహారం అంటారు. ఈ అనుబంధ ఆహారాన్ని రైతులే స్వయంగా తయారుచేసుకోవచ్చు లేదా మార్కెట్లో వివిధ కంపెనీల మేతలు విరివిగా లభ్యమౌతున్నాయి. అనుబంధ ఆహారాన్ని తయారు చేసుకునేటప్పుడు, పెంచుతున్న చేపల ఆహారపు అలవాట్లను, చేపల రకం, వయస్సులతో పాటు పదార్ధాల ఖరీదు, వాటి పోషక విలువలు వంటివి దృష్టిలో పెట్టుకొని తగిన విధంగా తయారు చేసుకోవాలి.
అనుబంధ ఆహారములో రెండు రకలైన మేతలున్నాయి. అవి తడి మేతలు, పొడి మేతలు.
తడి మేతలు:
వీటిలో తేమశాతం ఎక్కువగా (45-75%) ఉంటుంది. వీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచలేం. బూజుపట్టి చెడిపోతాయి. ఉదా: పచ్చి చేపల మాంసం, నత్తగుల్లల మాంసం, వానపాములు, మొక్కజోన్న పిండి.
పొడి మేతలు:
పోడి పదార్థాలను లేదా తడి పదార్థాలను ఆవిరిలో అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించి అరబెట్టడం ద్వారా పొడి మేతలు తయారుచేయవచ్చు. వీటిలో సాంప్రదాయ మేతలు,ఫార్ములేటేడ్ మేతలనే రెండు రకాలున్నాయి.
సాంప్రదాయ మేతలు: సాధారణంగా చేపల చెరువులలో వాడే పచ్చి తపుడు, వేరుశనగ చెక్క,పత్తి పిండి,సోయా,ఆవపిండి,మొక్కజోన్నపిండి,ఎండు చేపల పొడి మొదలైన పొడి మేతలను సాంప్రదాయ మేతలు అంటారు.వీటిలో తేమశాతం 13-15% వరకు ఉంటుంది.
ఫార్ములేటెడ్ మేతలు (పిల్లేట్ మేతలు): సాంప్రదాయ పొడి మేతలైన డి.ఓ.బి. సోయా, వేరుశనగ చెక్క చేప పొడి మొదలైన ముడి పదార్ధాలను అధిక పీడనం వద్ద ఉడకబెట్టి కణికలు/ బలపాల రూపంలో తయారు చేస్తారు. ఈ ఆహారం చేపలకు సులభంగా జీర్ణమవటమేగాక చేపల పెరుగుదలకు,ఆరోగ్యానికి కావాల్సిన ముఖ్య పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి రెండు రకాలుగా..1.సింకింగ్ ఫిల్లెట్లు (మునిగే మేతలు), 2.ఫ్లోటింగ్ ఫిల్లెట్లు (తేలియాడే మేతలు)గా లభ్యమవుతున్నాయి.
ఈ రకమైన మేతల వినిమయ నిష్పత్తి తక్కువగా ఉంటుంది. వీటిని సులభంగా వెదజల్లవచ్చు.ఇవి నీటిలో ఎక్కువ కాలం నిలకడగా ఉండి చేపలకు అందుబాటులో ఉంటాయి.వీటి వాడకం ద్వారా చేపలు ఎంత మేత తీసుకుంటున్నాయో తెలుసుకొని మేత వృథా కాకుండా చూడవచ్చు.అనుబంధ ఆహారాన్ని ఏ రూపంలో ఇచ్చినప్పటికీ అందులో ఉ 0డే ప్రోటీన్లను బట్టి చేపల పెరుగుదల ఉంటుంది. ఈ ప్రోటీన్ల అవసరం చేప రకాన్ని బట్టికూడా ఉంటుంది.
మేత వినిమయ నిష్పత్తి (ఎఫ్.సి.ఆర్):
ఒక కిలో చేప తయారీకి అవసరమయ్యే మొత్తం మేత నిష్పత్తిని ఫీడ్ కన్వర్షన్ రేషియో (ఎఫ్.సి.ఆర్) అంటారు. 1 కిలో చేప తయారీకి 3 కిలోల మేత వినియోగిస్తే, మేత ఎఫ్.సి.ఆర్ 1:3 అంటారు. తక్కువ ఎఫ్.సి.ఆర్ గల మేతలు మంచి మేతలుగా గుర్తించవచ్చు. సాంప్రదాయ మేతలలో కన్నా ఫార్ములేటేడ్ మేతలో తక్కువ ఎఫ్.సి.ఆర్ పొందవచ్చు.
మేత షెడ్యూలు:
మేతను పిల్లలకైతే ఉదయం,సాయంత్రం సమపాళ్ళలో విభజించి ఇవ్వాలి.పెద్దచేపలకు సూర్యోదయం అయిన గంట తర్వాత ఇవ్వాలి.ఎండ ఎక్కువగా ఉండే మధ్యాహ్నం సమయంలో మేత ఇవ్వకుండా ఉంటే మంచిది.ఫిబ్రవరి నుంచి జులైలో ఎక్కువగా మేతలు ఇవ్వాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు చేపల ఆకలి మందగిస్తుంది. కావున ఆహారం ఎక్కువగా తీసుకోవు.
మేత నాణ్యత:
మేత తయారీలో ఉపయోగించే వివిధ ముడి పదార్థాలు తాజాగా ఉండాలి. ఎటువంటి ముతక వాసన రాకుండా రంగు సహజంగా ఉండాలి.మేతలో నూనె గింజలు వాడినప్పుడు,తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు బూజు (ఫంగస్) ఏర్పడి వాటి వల్ల ఎఫ్లోటాక్సిన్ విషపదార్థాలు విడుదలై చేపల కాలేయం పాడయ్యే అవకాశం ఉంటుంది.నూనె గింజల చెక్క వాడినప్పుడు గింజలపై ఉండే పొట్టు కఠినంగా ఉండి అరుగుదల తక్కువగా ఉంటుంది. అలాగే తవుడు వాడినప్పుడు కూడా ఊక అధికంగా ఉండకుండా జాగ్రత్త పడాలి.
నిల్వ చేసుకోవటం:
మేతను సంచుల్లో నింపి నేలమీద పెట్టకుండా చెక్క బల్లలపై ,పొడిగా ఉన్న తక్కువ వెలుతురు వచ్చే ప్రాంతాల్లో ఉంచాలి.మేత సంచులను నిల్వ ఉంచేటప్పుడు గాలి తగిలేలా మూడు, నాలుగు వరుసల మధ్య ఖాళీ ఉంచాలి.మేతను ఆరుబయట ఎండవేడిలో ఉంచితే మేతలోని విటమిన్లు,కొవ్వులు చెడిపోతాయి.
మేత ఖరీదు:
చేపల సాగులో 50-60 శాతం మేర మేతకు ఖర్చవుతుంది.మనం తయారుచేసే మేతను సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో తయారుచేసుకోవాలి.అలాగే మేత వినియమ నిష్పత్తికూడా చాలా తక్కువగా ఉండేలా మేతను, దానిలో వాడే ముడిపదార్థాలను ఎంచుకోవాలి.
మేత ఇచ్చే పద్ధతులు:
వెదజల్లుట: ఈ పద్ధతిలో మేతను వెదజల్లడం వల్ల మేత ఎక్కువగా నీటిలో కరిగి చెరువు అడుగున చేరి నిరుపయోగమౌతుంది.చేపలకు సరిగా అందదు.
సంచుల్లో మేత కట్టడం:మేతను చిల్లు చేసిన ప్లాస్టిక్ సంచుల్లో నింపి ఆ సంచులను చెరువులో పాతిన వెదురు కర్రలు లేదా నైలాను తాళ్ళకు వేలాడదీస్తారు.ఈ పద్దతిలో 10 నుంచి 25 సంచులను ఒక హెక్టారుకు కడతారు. చేపలు చిల్లుల (రంధ్రాల) ద్వారా మేతను తీసుకుంటాయి.ఈ విధానములో చేపలు 3 నుంచి 5 గంటల్లో దాదాపు మొత్తం మేతను తీసుకుంటాయి. మేత వృధా అవ్వదు.
ట్రేలను వినియోగించటం:ఈ పద్ధతిలో చెరువులో అక్కడక్కడ ఫీడ్ ట్రేలను పెట్టి చేపల సాంద్రతను బట్టి సరిపడే మేతను ట్రేలలో వేస్తారు.
చేపలకిచ్చే మేత పరిమాణం అంచనా వేయటం: దిగుబడి లక్ష్యం తక్కువగా ఉండి, చేపల సంఖ్య తక్కువగా ఉంటే అనుబంధ ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు.చేపల సైజును, వాతావరణ పరిస్థితి ముఖ్యముగా ఉష్ణోగ్రతను బట్టి చేప బరువులో 2.5 శాతం మేతను ఇవ్వాలి. ఉదా: ఒక చెరువలో 10,000చేపలుంటే ఒక్కొక్కటి సగటున 300గ్రా. బరువుంటే ఆ సైజు చేపలకు శరీరం భరువులో 4 శాతం ఆహారం ఇవ్వాల్సి ఉంటే ఒక రోజుకు ఇవ్వాల్సిన ఆహార పరిమాణం:
10,000 x 300 x 4 /100 = 120000 గ్రా.లేదా 120 కిలోలు / రోజుకు
చేపల పెంపకంలో పైన తెలిపిన అంశాలను దృష్టిలో పెట్టుకొని రైతులు నాణ్యత కలిగిన మేతను తగిన పరిమాణంలో ఇవ్వటం వల్ల మంచి దిగుబడి సాధించవచ్చు.
డా.జి. గణేష్,మత్స్య శాస్త్రవేత్త, డా.ఎన్.రాజన్న ప్రధాన శాస్త్రవేత్త, అధిపతి
కృషి విజ్ఞాన కేంద్రం, పి.వి.నరసింహ రావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం, మామునూర్, వరంగల్ జిల్లా.
కృషి విజ్ఞాన కేంద్రం, పి.వి.నరసింహ రావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం, మామునూర్, వరంగల్ జిల్లా.
Leave Your Comments