Andhra Pradesh Tops in Seafood Production: అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ మీసం మెలేస్తుంది. ఆక్వా ఉత్పత్తిలో ఏపీ నంబర్ స్థానంలో ఉంది. సాధారణంగా భారత్ నుంచి అనేక రకాల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అలాగే ఆక్వా ఉత్పత్తులకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆంధ్రప్రదేశ్ నుండి అమెరికాకు యధేచ్చగా ఎగుమతులు జరుపుతున్నారు. ఇక ఏపీ ఆక్వా ఉత్పత్తులకు అమెరికాలో భారీగా డిమాండ్ పెరిగిపోయింది.
ఏపీ సి ఫుడ్స్ అంటే అమెరికన్స్ లొట్టలేసుకుంటూ తింటారు. ఏపీ రొయ్యలంటే అమెరికన్లు పడిచస్తున్నారంటే దాని డిమాండ్ ఏ మేర ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఆంధ్రా నుంచి ఆక్వా ఎగుమతుల్లో మూడొంతులు అమెరికాకే వెళ్తున్నాయి. దీంతో ఆక్వా సాగు దారులకు కాసుల వర్షం కురుస్తుంది. అధిక డిమాండ్, యధేచ్చగా ఎగుమతులు అవుతుండటంతో ఆక్వా పరిశ్రమ మంచి ఆదాయ వనరుగా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో 974 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో సుమారు ఐదు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. దేశవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 29 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 76 శాతం వాటా ఆంధ్ర రాష్ట్రానిదే కావడం విశేషం. ఒకసారి గణాంకాలు గమనిస్తే 2018–19లో 39.92 లక్షల టన్నులు దిగుబడులు సాధించారు. ఇక 2020-21 నాటికి 46.20 లక్షల టన్నులకు చేరింది. 2018– 19లో వార్షిక వృద్ధి రేటు 7.69 శాతం కాగా 2019-20లో 11 శాతంగా నమోదైంది. 2020-21 నాటికి 12.76 శాతానికి పెరిగింది. ఇదే ఊపు కొనసాగితే ఈ ఏడాది 60 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతులు జరగవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇకపోతే ఆక్వా పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం పోత్సహిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.546.97 కోట్లతో ప్రాసెసింగ్, ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పి ఆ బాధ్యతలను ఆక్వా రైతుసంఘాలకే అప్పజెప్పాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. 2020–21లో 46.23 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించగా, 2021–22లో 50.85 లక్షల ఎంటీల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 11.36 లక్షల ఎంటీల మత్స్యసంపద ఉత్పత్తి అయింది.
Also Read: 300 కిలోల కంబాల టేకు చేప
మనదేశం నుంచి ఎగుమతి అవుతున్న ఆక్వా ఉత్పత్తుల్లో 24 శాతంతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా.. 18 శాతంతో గుజరాత్ రెండో స్థానంలో.. 14 శాతంతో కేరళ మూడో స్థానంలో 10 శాతంతో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తరువాత స్థానాల్లో నిలిచాయి. అయితే ఏపీ నుంచి ఎగుమతి అవుతున్న ఆక్వా ఉత్పత్తులు ఏ దేశానికి ఎంత మేర ఉన్నాయో ఒకసారి చూద్దాం.
అమెరికాకు 25 శాతం
చైనాకు 19శాతం
ఈస్ట్ ఏషియా దేశాలకు 13శాతం
యూరప్ కు 13శాతం
జపాన్ కు 8శాతం
మిడిల్ ఈస్ట్ దేశాలకు 2 శాతం (3.51 శాతం)
ఇతర దేశాలకు 12శాతం చొప్పున ఎగుమతి అవుతున్నాయి.
Also Read: మంచినీటి చేపల పెంపకానికి చెరువు తయారీ