Sheep Pox Disease: ఈ వ్యాధి క్యాపిపాక్స్ అను వైరస్ వలన గొర్రెలు, మేకలలో కలుగు ఒక ప్రాణాంతకమైన అంటు వ్యాధి. ఈ వ్యాధిలో జ్వరం, జెనరలైజ్ పాక్ లీజన్స్ ఏర్పడుట వలన గొర్రెలు అధిక శాతం మరణిస్తుంటాయి. ఈ వ్యాధి పాక్స్ విరిడి కుటుంబానికి చెందిన క్యాపిపాక్స్ అను వైరస్ వలన గొర్రెలలో మరియు మేకలలో సంభవించు ఒక అంటువ్యాధి.
ఈ వైరస్ Double standard, DNA virus. దీని చుట్టు ఎన్వలప్ ఉంటుంది. ఇది అన్నింటికంటే పెద్ద వైరస్. దీని పరిమాణం సుమారు 260- 450 నానో మీటర్ల వరకు ఉంటుంది. గొర్రెలు మరియు మేకలు అన్ని వయస్సుల పశువులు ఈ వ్యాధి బారిన పడుతుంటాయి. చిన్న పిల్లలలో మరింత ప్రాణాంతకంగా ఉంటుంది. వ్యాధి కలిగిన పశువును అంటుకోవడం వలన, కలుషితమైన గాలిని పీల్చుట ద్వారా ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న గొర్రెలకు లేదా మేకలకు వ్యాపిస్తుంటుంది.
వ్యాధి వ్యాపించు విధానం: వైరస్ కలుషితం అయిన గాలిని పీల్చుట ద్వారా కాని అంటువ్యాధి వలే కాని ఈ వైరస్ ఆరోగ్యంగా ఉన్న పశువుల శరీరంలోకి ప్రవేశించి, వాటి రక్తంలో అభివృద్ధి చెంది, చర్మపు పొరలలోని ఎపిథీలియం కణాలలో ప్రవేశిస్తాయి. ఫలితంగా చర్మంపై బొబ్బలు ఏర్పడి, అవి బాగా మాగిన తరువాత పగిలి మచ్చలు ఏర్పడుతుంటాయి. ఈ విధంగా వైరస్ వెంట్రుకలు తక్కువగా వున్న శరీర ప్రాంతాలలో (ముఖం, చెవులు, తొడలు, పొరుగు) పెరిగి బొబ్బలను ఏర్పరుస్తుంటుంది. కొన్ని సందర్భాలలో గొర్రెల ఊపిరితిత్తులలో కూడా పెరిగి అక్కడ కూడా బొబ్బలను ఏర్పరచి న్యూమోనియాను కలిగిస్తుంది. ఫలితంగా గొర్రె పిల్లలు అధికంగా చనిపోతుంటాయి.
Also Read: Pesticides storage: పురుగు మందుల నిల్వ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
వ్యాధి లక్షణాలు: తీవ్రమైన జ్వరం ఉంటుంది. చర్మంపైన వెంట్రుకలు తక్కువగా ఉన్న ప్రదేశాలలో ముఖ్యంగా ముఖం, చెవులు, తొడలు, పొదుగు మొదలగు చోట్ల బొబ్బలు ఏర్పడి శరీరమంతా వ్యాపిస్తుంది. నోటి లోపలి మ్యూకోజా పైన పూత వచ్చి పుండ్లు ఏర్పడి ఉంటాయి. చూడి గొర్రెలలో గర్భస్రావం జరుగుతుంది. న్యూమోనియా లక్షణాలు ఉండటం వల్ల శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతూ గొర్రెలు, గొర్రె పిల్లలు అధికంగా చనిపోతుంటాయి. ఆహారం, నీరు సరిగా తీసుకోలేవు. గొర్రెలు నీరసించి ఉంటాయి.
శ్వాస నాళం మరియు ఊపిరితిత్తుల యందు బొబ్బలు ఏర్పడి ఉండుటను గమనించవచ్చు. ఊపిరితిత్తులలో న్యూమోనియా ఉంటుంది. చర్మం పైన బొబ్బలు గమనించవచ్చు.
వ్యాధి నిర్ధారణ: వ్యాధి చరిత్ర, లక్షణాలు, వ్యాధి కారక చిహ్నములు మరియు ఈ క్రింది ప్రయోగశాల పరీక్షల ద్వారా VNT, FAT, ELISA మొదలైన పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
వ్యాధి లక్షణములకు వేయు చికిత్స: జ్వరంను తగ్గించుటకు అంటి పైరెటిక్స్, నొప్పి మరియుశోధమును తగ్గించుటకు అంటి ఇన్ ఫ్లమేటరీ ఔషధములను ఇవ్వాలి.గొర్రెల యొక్క స్థితిని బట్టి వాటికి సెలైన్స్, విటమిన్స్ మరియు మినరల్ ఇంజక్షన్లు లేదా సప్లిమెంట్లు ఇవ్వాలి. గొర్రెలు సరిగ్గా ఆహారం తీసుకోలేవు కావున వాటికి సులభంగా జీర్ణం అయ్యే గంజి లాంటి ద్రావణాలను ఉప్పు మరియు గ్లూకోజ్ వంటివి కలిపి ఇచ్చినట్లైతే గొర్రెలు నీరసపడి చనిపోకుండా ఉంటాయి. వ్యాధి బారిన పడిన గొర్రెలకు తగినంత విశ్రాంతిని కూడా ఇవ్వాలి.
నివారణ: వ్యాధి సోకిన గొర్రెలను మంద నుండి వేరు చేయాలి. వ్యాధి ఉన్న గొర్రెల చర్మంపై హక్కులలోని నీరును సేకరించి ఆరోగ్యంగా ఉన్నవాటి చర్మంపైన పూయుట వలన ఆ గొర్రెలలో వ్యాధి నిరోధక శక్తి ఉత్తేజమై వాటికి ఈ వ్యాధి రాకుండా నిరోధించవచ్చు. ఈ పద్ధతిని “ఓవినేషన్” అని అంటారు. Sheep pox vaccine 1 ml చర్మం క్రింద 3 నెలలు నిండిన గొర్రెపిల్లలకు ఇచ్చినట్లైతే ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చు. ఒకసారి టీకా ఇచ్చినట్లైతే 3 సంవత్సరాల వరకు ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చు.
Also Read: Optimum Plant Population: మొక్కల సాంద్రతను దోహదం చేసే అంశాలు.!