Cattle Fodder: ఎల్లప్పుడు మన పంటలో గాని, ఇంటిలో గాని వ్యర్థ పదార్థాలు తయారవుతూ ఉంటాయి. మనకు దొరికే వీటితో మంచి మేతను పశువులకు అందించవచ్చును. దీని వలన రైతుకు ఆర్ధిక నష్టాన్ని కొంత మేరకు తగ్గించి పశువుకు పోషకాలు కలిగిన ఆహారం అందించవచ్చు.
రైతులకు అందుబాటులో దొరకు వ్యర్థములు :
పనికి రాని చెరకు ఎండు ఆకు, చెరకు పిప్పి, పనికి రాని అరటి మానులు మరియు ఆకులు, పనికి రాని కూరగాయలు, రాలిన చెట్ల ఆకులు, అడవిలోని ఎండు గడ్డి, చిరు ధాన్యాల గడ్డి, కంకులు, పప్పు ధాన్యాల కట్టే, పొట్టు, చెట్ల పచ్చి ఆకులు, మామిడి జీడి గింజలు, చింత గింజలు.
పైన ఉదహరించిన వాటితో గాని, ఇతరములతో గాని, పశువులకు రుచికరమైన, ఆరోగ్యకరమైన, హానికరం కాని ఆరోగ్య విలువలు ఉత్పాదక శక్తిని కోల్పోయినట్టి విధంగా తయారు చేసి మితంగా అందించి కరవు క్లిష్టపరిస్థితుల నుండి మన పశుజీవాలను కాపాడు కోవచ్చును.
1. మామిడి ముట్టెల నుండి జీడిని తీసి ఎండ బెట్టి గాని పొడి చేసి గాని, అటులనే గాని పశువులకు ఆహారంగా వాడుకోవచ్చును.
2. పశువుల పచ్చని వ్యర్థ ఆకులతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన మేత (శాతం) :
పచ్చి అరటి బోదె -50 శాతం, పచ్చి గడ్డి-35 శాతం, పచ్చి కూరగాయలు, పండ్లు, పనికిరాని పందిరి కాయలు 10, ఉప్పు, బెల్లం, అరటి బోదె, గడ్డి, కూరగాయలు ముక్కలుగా తరగాలి. వాటిపై బెల్లం, ఉప్పు కలిపి ప్లాస్టిక్ డ్రమ్ములో గాలి చొరబడకుండా నీడన ఉంచాలి. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం. దీన్ని 7-10 రోజులలోపు వాడుకోవచ్చును. పాలవృద్ది, రుచి, వెన్న శాతం బాగా పెరుగుతుంది. మేలు జాతి ఎద్దులకు మంచి ఆహారం.
3. గింజల పొట్టులతో మిశ్రమము (శాతం) :
మొక్క జొన్న 10 శాతం, పప్పు దినుసులు పొట్టు (ఉలవలు, అలసందలు, ఆనప) 10 శాతం, వరి గడ్డి లేక చెరకు ఆకు లేక చెరకు పిప్పి 10 శాతం, ఉప్పు 2 శాతం, గింజలు 10 (రాగి, జొన్న, సజ్జ) శాతం, తౌడు 38 శాతం, గానుగ పిండి 10 శాతంపై పొడిని కొట్టించుకుని పశువులకు వాడుకోవచ్చును.
4. మరొక మిశ్రమము శాతం :
మొక్కజొన్న లేక కొయ్యగానుసు (కర్ర పెండ్యులం) లేక బీరు పొట్టు 65 శాతం, పొట్టు (అలసంద, శనగ, పెసర, మినుము, అనప పొట్టు) 15 శాతం, తౌడు 10 శాతం, ఉప్పు 3 శాతం, ఎముకల పొడి 2 శాతం, బెల్లపు మద్ది 5 శాతం పై అన్ని కలిపి డ్రమ్ములో ఉంచుకుని 10 రోజుల లోపు వాడుకోవాలి . వేరుశనగ, ప్రత్తి చెక్కలు కుడా కలుపు కుంటే పాలు మరియు వెన్న శాతాన్ని ఇంకా వృద్ది చేసుకోవచ్చును.
5. చింత గింజలను కాల్చి తరువాత పొడిగా చేసుకుని 10 లీటర్ల నీటిలో 250 గ్రా. నుండి 300 గ్రా. కలిపి జావగా చేసుకుని ప్రతి రోజు 2 పూటలా పశువులకు నీటి ద్వారా కలిపి వాడినా ఆరోగ్యంగా ఉండును మరియు విష తుల్య పదార్థాలు ఉన్నా తొలగిపోవును.
Also Read: Maruteru Rice Varieties: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాచుర్యంలో ఉన్న మారుటేరు వరి రకాలు.!
6. ఎండాకాలంలో కరవు సమయంలో :
పచ్చి మేత దొరకడం కష్టము కాబట్టి అట్టి పరిస్థితులలో సుబాబుల్, అవిస, వేప, గానుగ, గ్లైరిశీడియా, రావి, మోదుగ, మర్రి ఆకులతో పశువులను మేపుకోవచ్చును. మొక్కజొన్న, జొన్న, ఉలవలు, అలసందలు, ఎండు గడ్డిని వాడవచ్చును.
7. ఎండు ఆకులతో మేత తయారీ (శాతం) :
ఎండు ఆకులు 50 (సుబాబుల్, రావి, గ్లైరిశీడియా, ఏవైనా పశువులు తినే ఆకులు) శాతం, బెల్లపు మడ్డి 35 శాతం, ఎముకల పొడి 4 శాతం, యూరియా 2 శాతం, ఉప్పు 2 శాతం(అయోడిన్), నీరు 7శాతం. పై వాటిని కలుపుకుని ఆకులపై చల్లుకుని భద్రపరచుకుని పశువులకు వాడుకోవచ్చును.
8. పశువుల పానకము ద్రావణ దాణ తయారీ (శాతం) :
బెల్లపు మడ్డి 92 శాతం, యూరియ 2 శాతం, ఎముకల పొడి 2 శాతం, ఉప్పు 2 శాతం, నీరు 2 శాతం పైవన్నీ కలుపుకుని భద్రపరచుకుని ప్రతి రోజు 1 నుంచి 3 లీటర్ల వరకు తాగించవచ్చును. ఈ మిశ్రమము ముఖ్యముగా పెరిగే పశువులకు, సేద్యానికిపోయే పశువులకు మరియు గర్భము ఉండే పశువులకు ఇచ్చిన మంచి ఫలితాలు ఉండును.
9. ఎండు చెరకు ఆకులతో పశు ఆహారము :
చెరకు ఆకు 100 కిలో గ్రాములు బాగా తొక్కించాలి, చెరకు మడ్డి లేక పుర్రు బెల్లము, యూరియా, ఉప్పు, ఎముకల పొడి 30 లీటర్ల నీటిలో కలిపి ఆకుపై చల్లి, మొత్తము వామిగా వేసుకుని 7-10 రోజుల తరువాత మేపుకోనవచ్చు.
10. చెరకు పిప్పి (బగాస్సి)తో పశుఆహారం :
చెరకుపిప్పి 100 కి . గ్రా . , బెల్లపు మద్ది లేక చెరకు మద్ది 10 కి. గ్రా., యూరియా 2 కి . గ్రా . , ఉప్పు 2 కి . గ్రా . , ఎముకల పొడి 2 కి . గ్రా . , నీరు 10-20 లీటర్లు. పై విధంగా కలుపుకుని చెరకు పిప్పిపై చల్లి సంచులతో గాని , ఇంటిలోపల గాని భద్రపరచుకుని 2-5 కిలోలను పశువులకు ఇవ్వవచ్చును.
Also Read: Tikka Leafspot in Rabi Groundnut: రబీ వేరుశనగలో ‘‘తిక్కాకు మచ్చ’’ తెగుళ్ల యాజమాన్యం