Paratuberculosis Disease in Cattle: వ్యాధి కారకము:- ఇది మైకో బ్యాక్టీరియమ్ పారా టుబర్క్యులోసిస్ వలన కలుగుతుంది. ఇది ఒక ఆసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా. ఇది కర్ర ఆకారంలో ఉంటుంది. ఈ బ్యాక్టీరియా కూడా టి.బి బ్యాక్టీరియా వలే దీర్ఘకాలిక వ్యాధిని కలిగిస్తుంది.
వ్యాధి బారిన పడు పశువులు:- ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మొ వాటిలో ఈ వ్యాధి కలుగును. ఇంక్యూబేషన్ పీరియడ్ :- 4 నెలలు నుండి 15 సంవత్సరముల వరకు ఉంటుంది. రెండు ఈతల తరువాత ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ.
వ్యాధి వచ్చు మార్గము:- వ్యాధి కారక క్రిమితో కలుషితమైన ఆహారo తీసుకోవడం ద్వారా, పిండ దశలోనే తల్లి నుండి దూడలకు, తల్లి పాల ద్వారా, సహజ సంపర్కం లేదా క్రుత్రిమ గర్భోత్పత్తి (AI) ద్వారా ఈ వ్యాధి ఒక పశువు నుండి మరోక పశువుకు వ్యాపిస్తుంది.
వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- సహజంగా ఈ వ్యాధి పశువులలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినపుడు వస్తుంటుంది.
వ్యాధి బారిన పడిన పశువుల మలంతో కలుషితమైన ఆహారాన్ని నోటి ద్వారా తీసుకున్నపుడు, అవి ప్రేగులలోని మ్యూకస్ మెంబ్రేన్ను నాశనం చేయుట వలన ప్రేగు గోడలు మందమైపోయి (టి.బి వలే చిన్న చిన్న గడ్డలు తయారగుట వలన జీర్ణమైన పోషక పదార్థాలు రక్తంలో గ్రహించబడక, విరోచనాలు ఉంటాయి. ఫలితంగా పశువులు నీరు, ఎలెక్ట్రోలైట్స్ కోల్పోయి డీహైడ్రేషన్కు గురి అయి మరణిస్తుంటాయి. పశువులు అధిక శాతం నీరు కోల్పోవుట ద్వారా శరీరం ఎముకల గూడు వలే తయారై ఉంటుంది.
వ్యాధి లక్షణాలు:- ఈ వ్యాధిలో ప్రధానంగా దీర్ఘకాలికమైన డయేరియా వుంటుంది. ఫలితంగా పశువులు శరీరంలో వుండే నీళ్ళు బయటకు వెళ్లిపోయి తీవ్రమైన డి హైడ్రేషన్ లక్షణాలు (చర్మం మొద్దు బారి ఉండుట, చర్మ కళాహీనంగా ఉండుట, వెంట్రుకలు ఊడిపోవుట, కళ్ళు గుంతలు పడి ఉండుట, మొ.నవి) ఉంటాయి. ఫలితంగా పశువులకు ఆకలి వుండదు, ఆహారం తీసుకోలేవు, నీరసించి, శరీరం అంతా క్షీణించి లేవలేని పరిస్థితికి చేరుతుంది. కొన్ని పశువులు ఈసుకుపోతాయి. జ్వరం, శ్వాస, ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది.
వ్యాధి కారక చిహ్నములు:- పెద్ద ప్రేగులు మడతలు పడి వుండి, మందంగా తయారయి వుండును. దీనినే కొర్రుగేషనల్ ఇంటెన్ అని అంటారు. ఇది ఈ వ్యాధి ప్రత్యేకత.
Also Read: Coleus Cultivation: పాషాణ భేది సాగులో మెళుకువలు.!
నిర్ధారణ:-
(1) వ్యాధి చరిత్ర ఆధారంగా
(2) పైన తెలిపిన వ్యాధి లక్షణాలు ఆధారంగా
(3)పైన వివరించిన వ్యాధి కారక చిహ్నముల ఆధారంగా
(4) ప్రయోగశాల పరీక్షల ద్వారా పెద్ద ప్రేగు చివరి భాగమైన మలాశయము అంత ర పొరను తీసుకొని గాజు పలకపైన అలికి “జీల్ నిల్సన్” పద్ధతి ద్వారా వర్ణకము చేసి సూక్ష్మదర్శినిలో ఈ సూక్ష్మజీవిని గమనించవచ్చు.
ఇంట్రాడెర్మల్ జోన్ ఇవ్వవలెను – 0.1 నుండి 0.2 మి.లీ. జోనిన్ ప్రొటీన్ను మెడ చర్మం దగ్గర ఇచ్చి, 24-48 గంటల తరువాత చర్మం మందం గమనించుట ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. 5mm కంటే ఎక్కువ మందం ఉంటే ఈ వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారిస్తాము.
వ్యాధి కారకాన్ని నిర్మూలించుటకు చేయు చికిత్స:- ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి కావున, దీనికి ఫీల్డ్ పరిస్థితులలో చికిత్స చేయలేము. కాని స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్, ఐసోనియాజైడ్ మరియు పెన్సిలిన్ వంటి ఔషదములను దీర్ఘకాలికంగా ఇచ్చినట్లైతే ఫలితం వుంటుంది. చికిత్స ఖర్చుతో కూడి యుంటుంది. ఫలితం తక్కువ.
వ్యాధి లక్షణములు చేయు చికిత్స:- డయేరియా తగ్గడానికి అంటి డయేరియల్స్ ఔషధములను, నీరు, ఎలెక్ట్రోలైట్స్ సమతుల్యం చేయుటకు సెలైన్ ద్రావణములను ఇవ్వవలసి ఉంటుంది.
ఆధారము కల్పించు చికిత్స:- పశువు యొక్క స్థితిని బట్టి, సెలైన్స్, విటమిన్స్, మినరల్ మిక్చర్స్ వంటివి ఇవ్వాలి. పశువుకు విశ్రాంతిని ఇవ్వాలి.
నివారణ:- వ్యాధి బారిన పడిన పశువులను వేరు చేయాలి. 4-6 నెలల దూడకు మైకో బ్యాక్టీరియం పారాట్యుబర్క్యులోసిస్ టీకా 1.5 మి.లీ చొప్పున చర్మం క్రింద మొదటిసారి ఇవ్వాలి. తరువాత సంవత్సరానికి ఒక్కసారి వేస్తూ వుండాలి. క్షయ వ్యాధికి సూచించిన చర్యలు పాటించుట ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు.
Also Read: Heat Detection in Dairy Buffaloes: ఎదలో ఉన్న పాడి పశువులను ఎలా గుర్తిస్తారు.!