Japanese Encephalitis in Pigs: ఈ వ్యాధిని మొట్ట మొదట 1924 వ సంవత్సరంలో జపాన్ ప్రాంతంలో కనుగొన్నారు. ఈ వ్యాధి అన్ని రకముల పందులు, గుర్రాలతో పాటు మనుషులలో కూడా కలుగు ఒక అంటు వ్యాధి. ఇది ఒక జునోటిక్ వ్యాధి. ఈ వ్యాధి టోగా విరిడి కుటుంబానికి చెందిన ఫ్లావి వైరస్ వలన కలుగుతుంది. ఇది ఒక సింగిల్ స్టాండర్డ్ ఆర్.ఎన్.ఏ వైరస్. ఇది సుమారు 30-40 nm పరిమాణం కలిగి ఉంటుంది.
ఈ వైరస్ మెదడు వాపు వ్యాధిని కలుగ జేస్తుంది. అందువలన దీనిని న్యూరోట్రోపిక్ వైరస్ అని కూడా అంటారు.అన్ని వయస్సు గల ఆవులు, గొర్రెలు, గుర్రాలు, కుక్కలు, పందులు మరియు మనుషులలో కూడా కలుగు ఒక ప్రాణంతకమైన జునోటిక్ వ్యాధి. పందులు ఈ వైరస్కు ఆంప్లిఫైయింగ్ హౌస్ట్ గా వ్యవహరిస్తుంటుంది. అంటే ఈ పశువులలో వైరస్ పెరిగి, వాటికి ఎక్కువ అపాయకరం కాకుండా, వాటి నుండి ఇతర పశువులకు మరియు మనుషులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంటుంది.
వ్యాధి వచ్చు మార్గం:- వ్యాధి బారిన పడిన పశువులు మరియు క్యారియర్ పందుల నుంచి వెలువడే – మలమూత్రాలతో కలుషితం అయిన ఆహారం తీసుకోవడం వలన కాని, క్యారియర్ పందులకు కుట్టిన దోమల ద్వారా కానీ ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పశువులకు వ్యాపిస్తుంది.
వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- పైన చెప్పిన మార్గాల ద్వారా ఈ వైరస్ రక్తంలో కలిసి, వ్రుద్ధి చెంది రక్తం ద్వారా అన్ని అవయవాలకు చేరుతుంది. ముఖ్యంగా మెదడు మరియు వెన్నుపాము లోని నాడీ కణాలను నాశనం చేసి మెదడు వాపును కలుగజేయుట వలన పశువులు చనిపోతుంటాయి. పందులలో అయితే వైరస్ గర్భశయంలో చేరి, ఈసుకుపోయేటట్లు లేదా సరిగ్గా అవయవాలు తయారుకాని పిల్లలు పుట్టేటట్లు చేస్తుంది.
Also Read: Biogas: బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ గురించి ఈ విషయాలు తెలుసుకోండి.!
లక్షణాలు:- తీవ్రమైన జ్వరం ఉంటుంది. కండరాలు కొట్టుకోవడం, తడబడుతూ నడవడం, పక్షవాతానికి గురి కావడం, కాంతి వెలుతురు సహించలేక పోవడం, క్రమంగా ఈ మార్పులు తీవ్రస్థాయికి చేరి, అపస్మారక స్థితి ఏర్పడి 3-5 రోజులలో పశువులు చనిపోవడం జరుగుతుంటుంది.మెదడు మరియు వెన్నుపాములో చిన్న చిన్న గడ్డలు ఉంటాయి.వ్యాధి చరిత్ర, లక్షణాలు, వ్యాధి కారక చిహ్నాలు మరియు ప్రయోగశాల పరీక్షల ఆధారంగా (CFT, ELISA) ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
చికిత్స:- ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స లేదు. జ్వరం తగ్గించుటకు అంటి పైరెటిక్స్, కన్వల్షన్స్ తగ్గించుటకు అసిటైల్ ప్రోమోజిన్ వంటి మత్తు పదార్థాలను ఇవ్వాలి. ఏదేని ఒక ఆంటిబయోటిక్ ఔషదములను ఇచ్చినట్లైతే సెకండరీ బ్యాక్టీరియల్ వ్యాధులు రాకుండా నివారించవచ్చు. పశువు యొక్క స్థితిని బట్టి వాటికి సెలైన్ ద్రావణములు వంటివి ఇవ్వాలి. తగినంత విశ్రాంతి ఇవ్వవలెను.ఈ వ్యాధికి మనుషులలో టీకాలు కలవు.
పందులలో ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు కనుక వ్యాధి బారిన పడిన వాటిని మంద నుండి వేరు చేయడం ఒక్కటే మార్గం. ఈ వ్యాధి కారకం ముఖ్యంగా పందులలో ఉండి ఇతర పశువులకు మరియు మనుషులకు వ్యాపిస్తుంటుంది, కావున పందుల పోషణ ఊరికి కనీసం 5 కి.మి దూరంలో ఉండేలాగా చూడాలి. పశువుల పాకాల చుట్టు మాలాథియాన్ లాంటి క్రిమి సంహారక మందులు పిచికారి చేయడం వలన దోమల సంతతిని అరికట్టవచ్చు. ఫలితంగా ఈ వ్యాధి వ్యాప్తిని కూడా అరికట్టవచ్చు.
Also Read: Bird flu in Chickens: కోళ్ళలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఎలా వస్తుంది.!