డా.యం. హరణి, పశు పోషణ శాస్రవేత్త, డా.జి.ప్రసాద్ బాబు, విస్తరణ శాస్రవేత్త
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
కృషి విజ్ఞాన కేంద్రం, కల్యాణదుర్గం
‘‘జనవరి మాసంలో పాడి మరియు జీవాల సంరక్షణలో చేపట్టవలసిన చర్యలు`యాజమాన్య పద్ధతులు’’
1. జనవరిలో చలి అధికంగా ఉంటుంది కనుక పశువులను, జీవాలను చలినుండి కాపాడుకోవడానికి కరెంటు బల్బుల ద్వారా వెలుతురు మరియు వేడిని అందివ్వాలి.
2. అనారోగ్యంతో నీరసించివున్న పశువుల మరియు జీవాల యొక్క శరీరాలను మందమైన బట్టతో లేదా గోనెసంచులతో కప్పవలెను. అదేవిధంగా రాత్రివేళల్లో అన్ని పశువులను మరియు జీవాలను నాలుగు మూలలా గోనెసంచులతో లేదా తడికెలతో లేదా గోడలతో కప్పబడివున్న పాకలలో/కొట్టాలలో/షెడ్లలో ఉంచవలెను.
3. చిత్తడి ఉన్న ప్రాంతాలలో పశువులను, జీవాలను ఉంచరాదు. అదేవిధంగా వేడికోసం మండిరచే పదార్ధాలతో వెలువడే పొగనుండికూడా కాపాడుకోవాలి. ఎందుకనగా చిత్తడి మరియు పొగ ద్వారా న్వుమోనియా వ్వాధి ప్రభలే అవకాశం ఉంటుంది.
4. పశువులకు గోరువెచ్చగా ఉన్నటువంటి నీటిని మరియు మేతను అందివ్వాలి.
5. పాలిచ్చే పశువులలో వాటి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించడానికి వాటికి నూనె చక్కలు మరియు బెల్లం యొక్క మిశ్రమాన్ని మేతగా అందివ్వాలి.
6. ఈ మాసంలో అధికంగా లభించే పచ్చి మేతను సేకరించి ‘‘సైలేజి’’ మరియు ‘‘హే’’ రూపంలో నిల్వ ఉంచుకొని వేసవి కాలంలో ఏర్పడే కొరతను అధిగమించవచ్చు.
7. పశువులలో ఆవశ్వక లవణాలు లోపాలు రాకుండా మేతతో పాటు ప్రాంతీయ ఖనిజ లవణ మిశ్రమాలను తగు మోతాదులో ( 80 గ్రా/రోజుకు/పశువుకు) అందివ్వాలి.
8. ఈ నెలలో పశువులను బాహ్య పరాన్న జీవులనుండి రక్షించుకోవడానికి డీవార్మింగ్ చేయవలెను.
9. పశువులను, జీవాలను బాహ్య పరాన్న జీవులనుండి కాపాడుకోవడానికి పాకలను, షెడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వేపనూనె సంభందిత క్రిమిసంహారక మందులతో పిచికారీ చేసుకోవలెను. అలాగే నిమ్మ గడ్డిని (లెమన్ గ్రాస్), తులసి, వావిలాకు చెట్లను కట్టలుగా కట్టి పాకల్లో వ్రేలాడదీసినట్లయితే వాటినుండి వెలువడే వాసనకు బాహ్యపరాన్న జీవులు వికర్షించబడతాయి.
10. ఇప్పటి వరకు పశువులకు గాలికుంటు, గొంతువాపు, ఎంటరోటాక్సీమియా, చిటుక వ్వాధులకు టీకాలు వేయించక పోయినట్టయితే ఈ నెలలో వేయించవలెను. మేకలు మరియు గొర్రె పిల్లలకు తప్పనిసరిగా ఎంటరోటాక్సీమియా వ్వాధి రాకుండా టీకాలు వేయించవలెను.
11. పచ్చిమేత పంటలైన ల్వూసెర్న్, బర్సీము రకాలకు 20-30 రోజుల వ్వవధిలో మరియు ఓట్స్ పంటకు 20-22 రోజుల వ్వవధిలో నీటి తడులు ఇవ్వవలెను.
గొర్రెల్లో పొట్ట జలగల వ్యాధి మరియు చికిత్స :
పొట్ట జలగలు (ఆంఫీ స్తోమ్స్) అనే నత్తలు ముఖ్యముగా పశువుల్లో, గొర్రెల్లో ఉంటాయి. వీటిలో రెండు రకాల జలగలు ఉంటాయి అవి పెద్ద పొట్ట జలగలు, పిల్ల పొట్ట జలగలు. పెద్ద జలగలు నెమరు వేసే పొట్టలో ఉండును. పిల్ల జలగలు చిన్న ప్రేగుల మొదటి భాగంలో ఉండును. పిల్ల పొట్ట జలగలు వల్ల ఎక్కువగా జీవాల ఆరోగ్యంను దెబ్బతీస్తాయి. రైతులు పట్టించుకోకపోతే 10 రోజులలోపు మరణాలు వచ్చే అవకాశం ఉంది.
జలగల వ్యాప్తి :
ముఖ్యంగా ఈ జలగల జీవితం నత్తల పైన ఆధారపడి ఉంటాయి. నత్తలు ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో నీటి పారుదల ఉండే కాలువల్లో, తడి నేలలో, వంతెన చివరల్లో మరియు గుంతల్లో ఉండి మొక్కలకు అతుక్కుని జీవిస్తూ ఉంటాయి.
జలగలు జీవాల శరీరంలోకి చేరినప్పుడు కనిపించే లక్షణాలు :
. నిరంతరంగా పారడం.
. భరించలేని వాసనతో కూడిన విరేచనాలు కావడం.
. గొంతు క్రింద నీరు చేరినట్లు ఉండే వాపును గమనించడం.
. ఆకలి మందగించడం, బరువు తగ్గడం మరియు నీరసంగా మారడం.
శవపరీక్ష చేసినప్పుడు కనిపించే లక్షణాలు :
. కోసినప్పుడు చర్మం క్రింద నీరు ఎక్కువగా చేరి ఉండడం మరియు శరీరం లోపల ఉండే గుండె, ఊపిరితిత్తుల మరియు ఇతర గదుల్లో కూడా నీరు ఉండడం.
. జిగురుతో లేదా చీముతో కలసిన క్రొవ్వును లోపల అవయవాల పైన ఏర్పడడం
. చిన్న ప్రేగు మొదటి భాగము లావుగా మారి పసుపు రంగుతో లేదా రక్తంతో కలసిన జిగురు ఎక్కువగా ఉండును. ఆ ప్రదేశంలో చిన్న ప్రేగు పొరలు ఎర్రగా మారి రక్తపు స్రావపు చారలు లేదా చుక్కలు కనిపించును. అలాగే అక్కడ జిగురును లేదా పొరలను పరీక్ష చేస్తే మనకు చిన్న జలగలు కనిపిస్తాయి.
. నెమరు వేసే పొట్టను కోసినట్లయితే జలగలు దానిమ్మ గింజల మాదిరిగా ఎరుపుగా ఉండి లోపల పొట్టకు వందల సంఖ్యలో అతుక్కుని ఉంటాయి.
జలగల నిర్ధారణ :
. గొర్రెలను మేపే ప్రదేశాలను గురించి రైతులను అడగడం.
. పేడలో చిన్న జలగల గ్రుడ్లను పేడపరీక్ష ద్వారా తెలుసుకోవడం.
. పైన చెప్పిన లక్షణాలను గమనించడం.
చికిత్స :
. ఆక్సీక్లోజనైడ్ 15 మి.గ్రా. ఒక కేజీ బరువుకు రెండు రోజులు ఇస్తే చిన్న జలగలను పూర్తిగా తొలగించవచ్చును. లేదా నిక్లోజమైడ్ 100 మి.గ్రా. ఒక కిలో బరువునకు ఒక్కసారి ఇవ్వాలి.
. నీరసాన్ని తగ్గించే విధంగా రింగర్ లాకెట్ మరియు గ్లూకోస్ సలైనులను రక్తంలోకి ఇవ్వాలి మరియు ఎలక్ట్రోలైట్లపౌడర్‌లు నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు ఇవ్వాలి.
. గొంతు క్రింద వాపు తగ్గించడానికి ఇంజక్షన్లు ఫ్యురోసమైడ్‌ను ఇవ్వాలి లేదా సున్నపు తేటను పూయాలి.
. రక్త లోపం ఉన్నచో ఐరన్‌ను కలిగిన ఫెరిటాస్ ఇంజక్షన్లు లేదా శార్కొఫెరోల్ ద్రావణాన్ని లేదా బెల్లం పానకాన్ని తయారు చేసి రోజుకు 3 సార్లు ఇవ్వాలి.
నివారణ చర్యలు :
తడి నేలలు మరియు వరద వచ్చిన ప్రాంతాల్లో 2-3 నెలల వరకు జలగలు ఎక్కువగా మొక్కలకు అతుక్కుని ఉంటాయి. అటువంటి ప్రదేశాల్లో మేపకూడదు. నత్తలు ఉండే ప్రదేశాల్లో మేపకూడదు మరియు నత్తలు లేకుండా నీటి కుంటలను, డ్రైనేజీలను మూసివేయాలి.