పాడిపరిశ్రమలో పశుదాణాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే పశుదాణాలో వాడే వేరుశనగ చెక్క, పత్తిచెక్కు ఖర్చుతో కూడుకున్నవి కావడం వల్ల పాడి రైతు ఆర్థికంగా ఇబ్బందుకి గురయ్యే పరిస్థితి నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో వాటికి ప్రత్యామ్నాయంగా అజొల్లా వాడకం వల్ల రైతుకు ఆర్థికంగా లబ్ది చేకూరుతుంది. పశువు దాణాలో ప్రొటీన్‌ను అందించే వేరుశనగ చెక్క, పత్తి చెక్కకు ప్రత్యామ్నాయంగా 25 శాతం ప్రొటీన్లు గల అజొల్లా వాడడం ద్వారా దాణా ఖర్చు తగ్గించవచ్చు. ఇది అజొల్లా ఆకుపచ్చ ఫెర్ను జాతికి చెందిన మొక్క. ఇది నీటి మీద తేలుతూ ఉంటుంది. ఇలా ఎండబెట్టిన అజొల్లా పొడిలో 25-35 శాతం మాంసకృత్తు, 10-15 శాతం మినరల్స్ మరియు కెరోటిన్, బి12 విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.
దీనిలో తక్కువ లిగ్నిన్ ఉండడంతో పశువు తేలికగా జీర్ణం చేసుకుంటాయి. ఇలా రోజూ 1.5 నుండి 2 కిలో అజొల్లాను పాడిపశువుకు మేపినట్లయితే పాల దిగుబడిలో 15-20 శాతం వృద్ధిని గమనించవచ్చు. దాణాలో వేరుశనగ పిండికి బదులుగా అదే పరిమాణంలో అజొల్లాను వాడవచ్చు. అజొల్లా వాడకం వల్ల పాల నాణ్యత పెరుగుటయేగాక, పశువు ఆరోగ్యం వృద్ధి చెందుతుంది.
అజొల్లాను దాణాగా వాడుట ద్వారా దాణా ఖర్చులో 20-25 శాతం తగ్గటమేగాక వెన్నశాతం మరియు ఎస్.ఎన్.ఎఫ్ పెరుగుటవలన ప్రతీ లీటరు పాలకు రూ. 0.60-1.50 అధిక ఆదాయం పొందవచ్చు.
ఇక గొర్రు, మేక, పంది, కుందేళ్ళు, కోళ్ళు, ఈముకపక్షుకి కూడా అజొల్లా మేతగా ఉపయోగపడుతుంది.
ఇక తాజా అజొల్లాను 1:1 నిష్పత్తిలో పశువు దాణాలో కలిపి వాడవచ్చు. అజొల్లాను పశువుకు డైరెక్టుగా కూడా తినిపించవచ్చు. తద్వారా పశుదాణా వాడకం సగానికి సగం తగ్గించుకోవచ్చు.
అజొల్లా ఉత్పత్తి చేయడం ఎలా?
- రోజూ 4 కిలోల అజొల్లా ఉత్పత్తి చేసేందుకు 25 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు సైజులో మూడు తొట్లు తయారు చేసుకోవాలి.
- ముందుగా భూమిపై కలుపును పూర్తిగా తొలిగించి సమానంగా చదును చేయాలి. 10 సెం.మీ ఎత్తు వచ్చేటట్లు ఇటుకలు నిలబెట్టి 25 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు ఉండునట్లు తొట్టిని తయారు చేసుకోవాలి.
- బయటి నుండి వేళ్ళు లోనికి రాకుండా ప్లాస్టిక్ సంచు గోతి లోపల పరచాలి. దీని మీద 150 జి.యస్.యం మందంగల (50I1.8 మీ సైజు గల) సిల్పాలిన్‌షీట్ వేసి, షీట్ చివరు ఇటుకపై అంచు వరకు వచ్చునట్లు చూడాలి.
- సిల్పాలిన్‌షీట్ పరచిన తొట్టిలోతు 10 సెం.మీ ఉండాలి. తరువాత 30-35 కిలోల భూసారం గల మట్టిని జల్లెడ పట్టి ఆ మెత్తని మట్టిని షీట్ మీద గోతిలో ఒకే విధంగా ఉండేలా పరచాలి. చ.మీ.కు మెత్తని మట్టి 10 కిలోలు కావాలి.
- తరువాత 4-5 కిలోల పరిమాణం గల 2-5 రోజులు నిల్వ ఉంచిన పశువుల పేడను 15-20 లీటర్ల నీటిలో కలిపి గుజ్జుగా తయారు చేసి, దీనికి 40 గ్రా. మినరల్ మిక్చర్‌ను కలిపి తొట్టిలోని మట్టి మీద పోయాలి. 7-10 సెం.మీ నీటి లెవల్ ఉండేలా చూడాలి. దీని కొరకు మరింత నీటిని కలపాలి. తరువాత బెడ్‌లోని మట్టిని, నీటిని కలియతిప్పాలి.
- నీటి లెవల్ 7-10 సెం.మీ ఉండునట్లు చూసి 1-5 ఉండునట్లు తాజా మదర్ కల్చర్ అజొల్లాను ఈ బెడ్ మీద సమానంగా పడేలా చల్లాలి. తరువాత మంచి నీటిని అజొల్లాపై చిలికినట్లయితే అజొల్లా ప్లాంట్ లో నిటారుగా నిలుస్తుంది.
- అజొల్లా త్వరగా వారం, పది రోజుల్లో పెరిగి, గొయ్యి మొత్తాన్ని 7-10 రోజుల్లో ఆక్రమిస్తుంది. (1 కిలో అజొల్లా నుండి వారం రోజుల్లో 8-10 కిలోల దిగుబడి వస్తుంది) 7వ రోజు నుండి అజొల్లాను ప్రతి రోజూ వాడుకోవచ్చు. ఆ తరువాత వారానికొకసారి 1 కిలో పేడను, 20 గ్రా. మినరల్ మిక్చర్, 5 లీటర్ల నీటిలో కలిపి గుజ్జుగా చేసి, అజొల్లా తొట్టిలో పోయాలి.
అజొల్లా పెంపకంలో తీసుకోవసిన జాగ్రత్తలు :
- అజొల్లా పెంపకానికి డైరెక్టుగా సూర్యకాంతి పడే చోట కాని, మరీ ఎక్కువ నీడ గల ప్రదేశం అనుకూలంగా ఉండదు.
- అజొల్లా గుంటలో ఆకులు రాలినట్లయితే అజొల్లా కుళ్ళిపోయే ప్రమాదముంది. కాబట్టి అజొల్లా పెంచు గుంటలు ఆకులు రాలిపోయే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోకూడదు.
- గుంటలో నీటి మట్టం కనీసం 5 సెం.మీ తగ్గకుండా, గుంట యొక్క ప్రతిమూలలో నీరు సమానంగా ఉండేటట్లు చూడాలి.
- పోషకాలలో లోపం లేకుండా చూడాలి. అవసరమైతే తెగుళ్ళ నిరోధానికి మందు వాడాలి.
- 10 రోజు కొకసారి బెడ్‌లో 4వ వంతు నీటిని తీసివేసి కొత్త నీటితో మళ్ళీ నింపాలి.
- 60 రోజుల కొకసారి 5 కిలోల బెడ్ పై మట్టిని తొలగించి, తిరిగి 5 కిలోల కొత్త మట్టిని బెడ్ అంతా పరచాలి.
- ప్రతి 6 నెలల కొకసారి మట్టిని, నీటిని, అజొల్లాను తొలగించి కొత్తగా తయారు చేసిన నీటిని, మట్టిని, అజొల్లాను కొత్తగా వేయాలి.
- పూర్తిగా పాడైపోయిన అజొల్లాను, తెగుళ్ళ బారిన పడిన అజొల్లాను పూర్తిగా తొలగించి తాజా అజొల్లాను వేయాలి. చీడ పీడలు ఆశించిన అజొల్లాను, పురుగు మందు వాడిన అజొల్లాను పశుమేతగా వాడరాదు.
- ఫంగస్ వల్ల వచ్చె కుళ్ళు వ్యాధి సోకినప్పుడు అజొల్లాను బెడ్ నుండి తీసి వేరే చోట పూడ్చి వేయాలి.
అజొల్లాను పశుమేతగా మేపడం ఎలా?
రంధ్రాలు గల ప్లాస్టిక్ ట్రేలో సేకరించిన అజొల్లాను ఉంచాలి. సగం నీరు నింపిన బకెట్ మీద ట్రేను ఉంచి పై నుండి నీటిని పోసి ఆవు పేడ వాసనపోయేటట్లుగా కడగాలి. చిన్న అజొల్లా ముక్కలు రంధ్రాలు ద్వారా బకెట్‌లోనికి వెళతాయి. ఆ నీటిని మరలా బెడ్‌లో పోయడం వల్ల అజొల్లా తిరిగి పెరుగుతుంది.
అజొల్లా పశువు దాణాతో 1:1 నిష్పత్తిలో వాడటం రైతుకు చాలా లాభదాయకం. అజొల్లా వాడుతూ రైతు పశుపోషణ ఖర్చు తగ్గించుకొని, అధిక పాలను ఉత్పత్తి చేయవచ్చు.