ఆంధ్రా వ్యవసాయంవ్యవసాయ పంటలుసేంద్రియ వ్యవసాయం

అధిక రసాయన ఎరువులతో అనర్థాలు సేంద్రియ ఎరువులతో నేలకు జవజీవాలు

0

అధిక పంట దిగుబడులు పండించడంలో రైతులకు రసాయన ఎరువులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి స్వయంసంవృద్ధి సాధించి, ఇతరులకు ఎగుమతి చేసే స్థాయికి మనం నేడు ఎదిగాం. మరోవైపు కాలాణుగుణంగా ప్రజల స్థితిగతులు కూడా మారుతున్నాయి. మెరుగైన విద్య, ఉపాది, జీవనశైలి కోసం గ్రామాల్లోని యువత పట్టణాలకు పరుగెడుతున్నారు. దీంతో గ్రామాలలో సాగు చేసే వారి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చటం గ్రామాల్లో నేడు ఉన్న పరిమిత రైతులకు మున్ముందు కష్టంగా మారవచ్చు. దీనికి తోడు ప్రజా సౌకర్యాలు, మౌలిక వసతులకోసం సాగు భూములను విచ్చల విడిగా వాడేస్తున్నారు. దీంతోసాగు భూమి కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది.

విచ్చల విడిగా రసాయన ఎరువుల వాడకం:

నేటి రైతులు అధిక దిగుబడుల సాధనే ధ్యేయంగా పంటలకు రసాయన ఎరువులను విపరీతంగా వాడుతున్నారు. సంప్రదాయంగా భూములకు వేసే పశువుల ఎరువు, కంపోస్టు వంటి సేంద్రియ ఎరువుల వాడకం బాగా తగ్గించేసారు. ప్రస్తుతం వీటి అందుబాటు కూడా కష్టమైపోతుంది. సాగులో యాంత్రీకరణ, అధికపాలిచ్చే మేలు జాతి పశువులు అందుబాటులోకి రావడంతో రైతుల దగ్గర సేంద్రియ ఎరువునిచ్చే పశుసంపద క్రమంగా తగ్గిపోతుంది. దీంతో రైతులకు రసాయన ఎరువులే శరణ్యమవుతున్నాయి. అధికంగా ఎరువులు వేస్తే ఎక్కువ దిగుబడులు పొందవచ్చని రైతులు నేడు తమకు తోచిన విధంగా, అధిక మోతాదుల్లో రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఏ విషయంలోనైనా “అతి అనర్థం” అనే పెద్దల నానుడి ఇక్కడ గుర్తుంచుకోవాలి. అనాదిగా వాడే సేంద్రియ ఎరువులను మాని, అధికంగా రసాయన ఎరువులు వాడకం వల్ల అధిక దిగుబడుల విషయం దేవుడెరుగు మొదటికే మోసం వచ్చే విధంగా పొలాలు మున్ముందు సాగుకు పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో రైతులు అనాలోచితంగా వ్యవహరిస్తే, నిర్జీవమైన నిస్సారమైన భూములను వారసత్వంగా తమ బిడ్డలకు ఇవ్వాల్సిన పరిస్థితులు దాపురించవచ్చు.
సేంద్రియ ఎరువులతో ఎన్నో లాభాలు:

1970కి ముందు రైతులందరూ తమ భూములకు సేంద్రియ ఎరువులనే వాడుతూ, సంప్రదాయ వ్యవసాయం చేసేవారు. భూములకు వేసిన సేంద్రియ ఎరువులు చివికి హ్యుమస్ లేదా సేంద్రియ పదార్థంగా మారి నేలకు అనేక ప్రయోజనాలు చేకూర్చుతుంది. నేల భౌతిక స్థితిని మెరుగుపరుస్తుంది. బరువు నేలలు గుల్లబారి గాలి ప్రసరణ బాగుండేలా చేస్తుంది. వేర్లు సులభంగా పెరగడానికి సాయపడుతుంది. భూమిలో ఎక్కువ నీటిని గ్రహించి, తేమ ఎక్కువకాలం మొక్కలకు అందేటట్లు చేస్తుంది. బెట్ట పరిస్థితులను తట్టుకొనే శక్తిని పెంచుతుంది. భూమిలో మట్టి రేణువుల అమరికను క్రమబద్ధీకరించి నేల నిర్మాణాలను మెరుగుపరుస్తుంది. భూమి నుంచి మొక్కలకు పోషకాలను అందించే సూక్ష్మజీవుల వృద్ధికి సేంద్రియ పదార్థం ఉపయోగపడుతుంది. భూమిలో పోషకాలను ఎక్కువ కాలం పట్టి ఉంచి, మొక్కలకు అందుబాటులోనికి తెస్తుంది. చౌడు, ఆమ్ల నేలల్లో పంటలకు జరిగే సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. భూముల్లో సేంద్రియ పదార్థం అధికంగా ఉన్నపుడు నేల నుంచి సంక్రమించే తెగుళ్ళ బెడద చాలా వరకు తగ్గుతుంది. ఉద్యాన పంటల్లో సేంద్రియ ఎరువుల వల్ల వంట ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. సేంద్రియ ఎరువులతో రసాయన ఎరువులు కలిపి వాడటం వల్ల రసాయన ఎరువుల వినియోగం 25 శాతం వరకు పెరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే సేంద్రియ ఎరువులు భూములకు “జవజీవాన్ని” ఇస్తాయి.

సేంద్రియ ఎరువులను నిర్లక్ష్యం చేస్తే…

భూములకు వేసిన సేంద్రియ ఎరువుల ప్రభావం పంటల్లో మెల్లగా కన్పిస్తుంది. కాని రసాయన ఎరువులు భూమికి వేసిన వెంటనే వంటపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి రైతులు వీటికి బాగా ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో పంటల్లో అధిక దిగుబడులు పొందాలనే తపనతో రసాయన ఎరువులను రైతులు నేడు అధిక మొత్తంలో వాడుతూ సేంద్రియ ఎరువుల వాడకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వల్ల సాగు భూములు నేడు రసాయన కాలుష్యానికి గురై సహజత్వాన్ని కోల్పోతున్నాయి. చౌడు, ఆమ్ల, ఉప్పు వంటి సమస్యాత్మక భూములుగా మారుతున్నాయి. భూముల్లో పంటలకు మేలుచేసే సూక్ష్మ జీవులు అంతరించి పోతున్నాయి. భూముల్లో సేంద్రియ పదార్ధం తగ్గినపుడు, పంటల దిగుబడుల అత్యావస్యకమైన సూక్ష్మ పోషకాల అందుబాటు బాగా తగ్గిపోతుంది. దీంతో నేలల ఆరోగ్యం కుంటుబడి పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నేడు చాలా భూముల్లో రసాయన ఎరువు పెంచిన, దామాషాలో పంటదిగుబడులు పెరగగక నిస్తేజంగానే ఉండడం ఆందోళన కలిగించే వాస్తవం. కాబట్టి రసాయన ఎరువుల మోజులో పడి భూములకు సేంద్రియ ఎరువులు వాడకపోతే మున్ముందు ఆహారోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపి, ఆహార భద్రతకు ముప్పు రావచ్చనే చేదు నిజాన్ని మనమంతా గ్రహించాలి. రైతులు ఈ మధ్య కాలంలో నిపుణుల సలహాల కంటే శాస్త్రీయతపై నియంత్రణ లేని ప్రైవేటు వ్యాపారులు, కంపెనీల ప్రతినిధులు, యూట్యూబ్ చానెళ్ళ సలహాలకే విలువ ఇస్తున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేసే వీరి సలహాలపై రైతులు జాగ్రత్తగా ఉండాలి.

అధిక నత్రజని (యూరియా) తో అనర్థాలు:

మొక్కలు పెరగడానికి నత్రజని అధిక మొత్తంలో అవసరముంటుంది. ఈ పోషకాన్ని రైతులు అత్యధికంగా యూరియా రూపంలో వేస్తారు. మొక్కల నిర్మాణం, పెరుగుదలలో ఇది కీలకంగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం యూరియాపై బారీగా 80 శాతంకు మించి ఉత్పత్తి ఖర్చులో రాయితీ భరించి రైతులకు బస్తాను కేవలం రూ. 267 లకే సరఫరా చేస్తుంది. ఇంత చౌకగా రైతులకు మరే ఎరుపు అందుబాటులో లేదు. కాబట్టి రైతులు పంటలకు ఎదో ఒక ఎరువు వేయాలని చౌకగా దొరికే యూరియాను అధిక మొత్తంలో బస్తాలు బస్తాలుగా వేస్తున్నారు. దీని వల్ల రైతులకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది.

  •  పొలంలో వేసిన వెంటనే యూరియా నీటిలో కరిగిపోతుంది. ఇలా నీటిలో కరిగిన యూరియా భూమి లోపలి పొరల్లోకి సులభంగా ఇంకి పోతుంది. వాతావరణం వేడిగా ఉంటే యూరియాలోని నత్రజని ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోతుంది. ఈ రకంగా భూమికి వేసిన మొత్తం యూరియాను మొక్కలు ఒకేసారి తీసుకోవు. భూమిలో వేసిన యూరియాలోని నత్రజనిని మొక్క అవసరానికి తగ్గట్లు రోజూ కొంత కొంత తీసుకుంటుంది. పంటకు వేసిన యూరియాలోని నత్రజని భూమిలోనికి, గాలిలోనికి నష్టపోవడంతో పంట మొక్కలు కేవలం 30-40 శాతం మాత్రమే వినియోగించు కుంటాయి. మిగతా అంతా వృధాగా పోతుందనే వాస్తవాన్ని రైతులు గ్రహించాలి.
  • భూమిలోకి ఇంకిపోయిన నత్రజని భూగర్భ జలాలలను కలుషితం చేస్తుంది. అధికంగా భూములకు నత్రజని ఎరువులు వాడకంవల్ల భూగర్భజలాల్లో నైట్రేట్లు అధికమవుతాయి. ఈ నీటిని తాగడం వల్ల ప్రజల, పశువుల ఆరోగ్యం పాడవుతుంది. మరో వైపు పొలాలకు అధికంగా నత్రజని ఎరువులు వాడకం వల్ల మొక్కల ఆకులు ముదురాకు పచ్చరంగుకు మారి, మృదువుగా, ఆకర్షణీయంగా ఉండడంతో పంటలకు పురుగులు, తెగుళ్ళ బెడద అధికమై, వీటి నివారణకు రైతులు మళ్ళీ అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అధిక భాస్వరం ఎరువులతో అవస్థలు:

  • నత్రజని ఎరువుల తర్వాత రైతులు అత్యధికంగా భాస్వరం ఎరువులను వంటలకు వాడుతున్నారు. భాస్వరం మొక్కల వేర్ల అభివృద్ధికి, మొక్కల్లో రెమ్మలు రావడానికి, దుబ్బు చేయటానికి, త్వరగా పూతకొచ్చి పిందెకట్టడానికి, పక్వానికి రావడానికి చాలా అవసరం. విషమ పరిస్థితులను ఎదుర్కోవడానికి మొక్కలకు భాస్వరం సాయపడుతుంది. ప్రధాన పోషకాలను అందించే ఎరువులతో పోల్చితే భాస్వరపు ఎరువులు చాలా ఖరీదైనవి. పంటలకు భాస్వరాన్ని రైతులు అధికంగా డి.ఎ.పి, 20:20:0, ఇతర కాంప్లెక్స్ ఎరువుల రూపంలో వేస్తారు. భాస్వరానికి భూమిలో కదిలే గుణం లేదు. వేసిన చోటే నిలిచి ఉంటుంది. భూమికి వేసిన భాస్వరం వేసిన 3-4 వారాలే మొక్కలకు అందే స్థితిలో ఉంటుంది. తర్వాత ఇది మొక్కలకు అందని స్థితిలో భూమిలో స్థిరీకరించబడుతుంది లేదా బిగుసుకుపోతుంది.
    ఈ మధ్య కాలంలో రైతులు యూరియాతో పాటు దుక్కిలోనూ, పైరుపై పైపాటుగానూ భాస్వరం అధికంగా కలిగిన కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. అందువల్ల భూసార పరీక్షా ఫలితాలలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భూముల్లో భాస్వరం అందుబాటు మధ్యస్థం నుంచి అధిక స్థాయిలో ఉంది.
  • నత్రజనిలాగా భాస్వరానికి నీటిలో కరిగి కొట్టుకపోయే గుణం లేదు. వేసిన కొంతకాలం తర్వాత భూమిలో మొక్కలకు అందని స్థితిలో బిగుసుకుపోతుంది. అందుకే భూములకు వేసిన భాస్వరపు ఎరువులలో మొక్కలు కేవలం 20 నుంచి 25 శాతం మాత్రం వినియోగించుకొంటాయి. అంటే రైతులు తమ పొలాలకు వేసిన ఖరీదైన భాస్వరం ఎరువులు 75 నుంచి 80 శాతం వరకు వృధాగా పోతుందన్నమాట. మరోవైపు భూముల్లో భాస్వరం ఎక్కువైనపుడు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే జింకు, ఇనుము వంటి సూక్ష్మ పోషకాల లభ్యత మొక్కలకు బాగా తగ్గిపోతుంది. ఈ రకంగా అధికంగా భాస్వరం కలిగిన ఎరువులను భూములకు వేయటం వల్ల అధికంగా డబ్బు ఖర్చు, 75-80 శాతం పోషకం వృధా, సూక్ష్మ పోషకాల అందుబాటు తగ్గడం వంటి సమస్యలు వస్తున్నాయి.

భూములు సమస్యాత్మకంగా మారడం:

సాగు భూములకు అవసరానికి మించి రసాయన ఎరువులు వాడకం వల్ల చాలా వరకు భూములు చౌడు, ఉప్పు బారిపోతున్నాయి. దీంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ తో రైతులు సరైన శాస్త్రీయ సిఫారసులు లేకుండా వ్యాపారుల సలహా మేరకు నీటిలో కిరిగే ఎరువులను ఇష్టానుసారం వాడుతున్నారు. ఈ ఎరువులన్నీ ఆమ్ల గుణం కలిగినవి. కాబట్టి ఈ ఎరువులు అధికంగా వాడిన భూములు ఆమ్లత్వాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ సమస్య కూరగాయలు, పూలు వంటి ఉద్యాన పంటలు సాగు చేసే భూముల్లో అధికంగా ఉంది. సాగు భూములు ఈ రకంగా సమస్యాత్మకంగా మారడం, మున్ముందు సాగు కష్టతరంగా మారి ఆహార భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు.

ప్రజారోగ్యానికి హానికరంగా మారుతున్న రసాయన ఎరువులు:

సాగు భూములకు యథేచ్చగా రసాయన ఎరువులు వాడకం వల్ల ఈ ఎరువుల్లోని నైట్రేట్లు, పాస్పేట్లు, ఆర్సినిక్, క్లోరైడ్లు భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. ఈ రకంగా కలుషితమైన నీటిని ప్రజలు, పశువులు తాగడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. రక్తసంబంధ సమస్యలు, క్యాన్సర్లు, కిడ్నీలో రాళ్ళ సమస్యలు మొదలైన వాటిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

నిర్జీవమవుతున్నసాగు నేలలు:

సిఫారసులకు మించి యథేచ్చగా, అధిక మోతాదుల్లో రసాయనిక ఎరువులు, కలుపు మందులు, గుళికల మందులు వాడకం వల్ల నేలలో పంటలకు మేలు చేసే సూక్ష్మజీవరాశి అంతరించిపోతుంది. దీని వల్ల భూములు నిర్జీవమైపోతున్నాయి. సూక్ష్మ జీవులు భూమి లోపలి పొరల్లో ఉండే పోషకాలను మొక్కలకు సులభంగా అందేటట్లు చేస్తాయి. భూమిలో తెగుళ్ళను నియంత్రిస్తాయి. దీర్ఘకాలంలో సాగు భూముల్లో సూక్ష్మజీవుల కొరత చెడు ఫలితాలకు దారితీస్తుంది.

విధిగా నష్టనివారణ చర్యలు చేపట్టాలి !

“పెరుగుట విరుగుట కొరకే” అన్నపెద్దల నానుడి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అధిక దిగుబడులకు ఆశపడి రైతులు అనాలోచితంగా, సంప్రదాయంగా వాడుతున్న సేంద్రియ ఎరువులను మాని రసాయన ఎరువులు వాడుతున్నారు. దీని వల్ల ఆదాయం కంటే అనర్థాలే అధికమవుతున్నాయి. భూములు నిర్జీవమై, నిస్సారమై, భూగర్భ జలాలు కలుషితమై, సాగు ఖర్చు తడిసి మోపెడై, ప్రజారోగ్యం పాడై ప్రజలు కష్టాల్లో కూరుకుపోతున్నారు. “పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలి” అన్న ఆర్యోక్తి ప్రకారం ప్రస్తుతం రైతులు, నేలలకు జీవజవాలను అందించే స్థానికంగా దొరికే సేంద్రియ వనరుల సద్వినియోగించుకొని భూముల్లో సేంద్రియ పదార్థాన్నిపెంచే ప్రయత్నం చేయాలి. అందుబాటులో ఉన్న పశువుల ఎరువు, పచ్చి ఆకు, పచ్చిరొట్ట, నూనె గింజల పిండి, జీవన ఎరువుల వినియోగంపై రైతులు మొగ్గు చూపాలి. ప్రస్తుతం ప్రచారంలో వస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు కూడా భూముల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో ఉపయోగపడుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా రసాయన ఎరువులు మానేయమని చెప్పలేము. కాని వీటిని నిపుణుల సూచనలు ప్రకారం అవసరమైన మేరకే, అవసరమైన మోతాదుల్లో సేంద్రియ ఎరువులతో కలిపి ఉపయోగిస్తే రైతులు పెట్టే ఖర్చు, రైతుల కష్టానికి తగ్గ ఫలితంగా తప్పక ఉంటుంది.

– మెరుగు భాస్కరయ్య
జిల్లా ట్రైనింగ్ కోఆర్డినేటర్,
వ్యవసాయశాఖ జిల్లా వనరుల కేంద్రం,
తిరుపతి, ఫోన్: 8331057872.

Leave Your Comments

రైతన్నకో ప్రశ్న…?

Previous article

మిరప పంటలో మూడు రకాల వైరస్ తెగుళ్లు….. సమగ్ర నివారణ పద్ధతులు

Next article

You may also like