ఇటీవల కాలంలో దుక్కి దున్నకుండానే పంటల సాగు జీరో టిల్లెజ్ పద్ధతి రైతుల్లో చాలా ప్రాచుర్యం పొదుతోంది. ఈ పద్ధతి లో తొలకరి వరి చేను కోసిన తరువాత పొలంలో వరి కొయ్యకాల్లలోదుక్కి దున్నకుండానే పదును చూసుకొని మొక్కజొన్న విత్తనాలు నేరుగా విత్తుకోవాలి. ఈ విధానంలో రైతులకు దుక్కి దున్నే ఖర్చులు ఆదా అవుతాయి. నెల రోజుల పంట కాలం కలసి వస్తుంది.
జీరో టిల్లెజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:
వరి కోసిన తరువాత నేలలో తగినంత తేమ లేనట్లయితే ఒక తేలికపాటి తడి ఇచ్చి మొక్కజొన్నను విత్తుకోవాలి.
తాడును ఉపయోగించికాని లేదా విత్తనం వేసే యంత్రం తో గానీ వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ. మరియు మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మి. ఉండునట్లు విత్తుకోవాలి.
వరి మాగాణులలో భూమిని దున్నడం ఉండదు కనుక కలుపు ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు ఎకరాకు 1.0 కిలో అట్రజిన్ 50% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48గంటల లోపు నేలంతా బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. వరి దుబ్బులు చిగురు వేయకుండా పారాక్వాట్ 1.0లీటరు 200లీటర్ల నీటిలో కలిపి విత్తే ముందు లేదా విత్తిన వెంటనే పిచికారీ చేయాలి.అట్రజిన్+పారాక్వాట్ కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చును.
మిగతా యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా ఎరువులు, సస్యరక్షణ మొదలగునవి సాధారణ రబీ మొక్కజొన్న పంటకు ఆచరించినట్లు గానే వరి మాగాణుల్లో సాగు చేసిన మొక్కజొన్నకు కూడా పాటించాలి.
పంట కోత:
పంట కోతకు వచ్చినప్పుడు బుట్టల పై పొరలు ఎండినట్లు కనిపిస్తాయి. బాగా ఎండిన కండెలు మొక్కలపై క్రిందికి వేలాడుతూ కనిపిస్తాయి మరియు కండెల లోని గింజలను వేలి గోరుతో నొక్కినప్పుడు చాలా గట్టిగా వుండి నొక్కులు ఏర్పడవు. అంతేకాకుండా,బుట్టలోని గింజలను తీసి అడుగుభాగం పరీక్షించినచో నల్లని మచ్చలు ఉండడం గమనించవచ్చు.
ఈ దశలో గింజలలో సుమారుగా 25-30 శాతం తేమ ఉంటుంది. కండెల ను మొక్కల నుండి వేరుచేసి గింజలలో తేమ శాతం 15 వచ్చే వరకు 3-4 రోజులు ఎండలో బాగా ఆరబెట్టాలి. పేలాల రకం వేసినప్పుడు గింజలలో 30-35 శాతం తేమ ఉన్నప్పుడే కండెలు కోసి నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే సరియైన పేలాలుగా మారక గింజ పగిలి నాణ్యత తగ్గుతుంది. తీపి రకం వేసినప్పుడు గింజ పాలుపోసుకునే దశలోనే కండెలు కోసుకోవాలి. బేబీ కార్న్ కొరకు పీచు వచ్చిన 1 లేదా 2 వ రోజున కోసుకోవాలి.ఆలస్యంగా చేసినట్లయితే బెండులో పీచు శాతం పెరిగి నాణ్యత తగ్గుతుంది. మొక్కజొన్న ను పశువుల మేత కొరకు వేసినప్పుడు 50% పూతదశ లో పైరును కోయాలి. కంకులను నూర్పిడి చేయుటకు ట్రాక్టర్ తో లేదా కరెంటు తో నడుచు నూర్పిడి యంత్రాలను ఉపయోగించవచ్చు. నూర్పిడి తరువాత గింజలను 2-3 రోజులు శాతం తేమ వచ్చే వరకు ఎండలో ఆరబెట్టి,శుద్ది చేసి గోనె సంచులలో గానీ లేదా పాలిథీన్ సంచులలో గానీ భద్రపరచి చల్లని,తక్కువ తేమ గల ప్రాంతాలలో నిలువ చేయాలి. దీనితో పాటు నిల్వలో తేమగాని,ఎలుకలు,పురుగులు,శిలీంధ్రాలు మొదలగునవి రాకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.