తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న రెండవ ముఖ్యమైన పంట మొక్కజొన్న. రాష్ట్ర ప్రభుత్వం వారి సలహా ప్రకారం ఈ యొక్క యాసంగికి అనుకూలం. ఈ పంట సాగుకి తగిన యాజమాన్య పద్దతులు పాటిస్తే గణనీయమైన దిగుబడులు ఆశించవచ్చు.
నేలలు:- నీరు ఇంకే నల్ల రేగడి నేలలు,ఎర్ర నేలలు మరియు ఒండ్రు కలిగిన ఇసుక నేలలు అనుకులమైనవి
నేల తయారీ :- దుక్కిలో ఎకరాకు 10 టన్నుల మాగిన ఎరువు వేసి బాగా కలియదున్ని , తదుపరి పొలాన్ని తయారు చేసుకోవాలి
విత్తే సమయం :- అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు విత్తు కోవాలి
విత్తే పద్ధతి : – బోదెలు,చాల్లు పద్దతిలో నేలను తయారుచేసుకోని బోదేకి 1/3 వ వంతు ఎత్తుతో విత్తుకోవాలి
రకాలు :- డి.హెచ్ .యం -117 , డి.హెచ్ .యం – 121 , కరీంనగర్ మొక్క , కరీంనగర్ మొక్క – 1 లాంటి ప్రభుత్వ రకాలతో పాటు పలు ప్రైవేట్ రకాలు అందుబాటులో ఉన్నాయి
విత్తన మోతాదు :- ఎకరానికి 8 కిలోల విత్తనం సరిపోతుంది
విత్తే దూరం :- వరుసకి ,వరుసకి మధ్య దూరం 60 సె .మీ మరియు మొక్కకి మొక్కకి మధ్య దూరం 20 సె .మీ ఉండేలా విత్తుకోవాలి
ఎరువుల యాజమాన్యం :- నేలలోని ఎరువుల స్థాయిని బట్టి ఎకరాకు 80 – 96 కిలోల నత్రజని , 32 కిలోల భాస్వరం మరియు 32 కిలోల పోటాష్ ను ఇచ్చే రసాయనిక ఎరువులను వేయాలి
కలుపు నివారణ :- విత్తిన 40 – 45 రోజుల వరకు పంటలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. సమగ్ర కలుపు నివారణ చర్యలు పాటించాలి. అలాగే అట్రాజిన్ 50% డ. బ్ల్యు.పి అనే కలుపు మందును ఎకరానికి 800 గ్రా తేలిక నేలల్లో మరియు బరువు నేలల్లో 1 కిలో మందును 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. పిచికారి చేయు సమయంలో నేలలో తగిన తేమ ఉండేలా చూసుకోవాలి.
చీడ పీడల యాజమాన్యం :- కాండం తొలిచే పురుగు :- ఈ లార్వాలు అంకురాన్ని తినడం వలన మొవ్వు చనిపోతుంది. పురుగులు పత్రహరితాన్ని తింటాయి. దీని నివారణకు కార్బో పూర్యన్ 3 జి గుళికలు మొలకెత్తిన 25 – 30 రోజులకు మొక్క సడులలో వేసుకోవాలి.
కత్తెర పురుగు :- మొదటి పత్రహరితాన్ని గోకి తింటాయి. తద్వరా ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది. ఆకు సుడిలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తినడం వల్ల రంద్రాలు ఏర్పడతాయి. సుడిలలో ఆకులను పూర్తిగా కత్తిరిస్తుంది. పసుపు రంగులో ఆకు సుడులలో విసర్జిస్తుంది. పురుగును గమనించిన వెంటనే క్లోరాంట్రనిలిప్రోల్ 0.4 మి.లీ లేదా ఇమామేక్టిన్ బెండోయెట్ 0.4 గ్రా లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎరను మొక్క సుడులలో వేసుకోవాలి. దీని తయారికి 10 కిలోల తవుడు , 2 కిలోల బెల్లం ,2 – 3 లీటర్ల నీరు మరియు 100 గ్రా . థయోడికార్బ్ తయారు చేసే మొక్కల సుడులలో ఉదయం లేదా సాయంత్రం వేసుకోవాలి.
తెగుళ్ల యాజమాన్యం :- ఆకు ఎండు తెగులు (మెర్సికమ్ ) :- ఆకుల పై మచ్చలు ఏర్పడి , ఆకు అంతటా వ్యాపించి ఎండిపోయి చనిపోతాయి. దీని నివారణకు మ్యాంకో జెబ్ 2.5 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
పాము పొడ తెగులు :- నేలకు దగ్గరగా ఉండే క్రింద ఆకుల పై బూడిద,గోధుమ రంగు మచ్చలు ఏర్పడి , ఒక దానికొకటి ఏర్పడి చూడటానికి పాము మాదిరిగా కనిపిస్తాయి. దీని నివారణకు ప్రోపికోనజైల్ 1 మీ.లీ లేదా హెక్సా కొనజైల్ 2 మి.లీ లేదా వాలిడామైసిన్ 2 మి.లీ నీటికి కలిపి పిచికారి చేయాలి. అదే విధంగా వాతావరణ పరిస్థితుల మార్పుని బట్టి వచ్చే ఇతర సమస్యలను సకాలంలో పరిష్కరించి మేలైన యాజమాన్య పద్దతులను పాటించడం వలన మంచి దిగుబడులను రాణించవచ్చు.
డి.స్రవంతి ,పి.లక్ష్మణ్ రావు ,పి.శ్రీలత ,డా.యం. రాం ప్రసాద్ , డా. కె . గోపాల కృష్ణ మూర్తి , డా . యం. మాధవి వ్యవసాయ కళాశాల , అశ్వరావుపేట