Bamboo Cultivation Techniques: వెదురు బహువార్షికం, సన్నగా పొడవుగా ఎదుగుతుంది, గడలు కణుపులు కలిగి గుండ్రంగా, సాఫీగా ఉంటాయి. భూమిలోని దుంప నుండి పెరుగుతుంది. అనుకూల పరిస్థితుల్లో చాలా త్వరగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం దుంపనుండి పెరిగే గడల సంఖ్య మరియు పరిమాణం మారుతూ ఉంటుంది. వెదురు చాలా పనులకు వినియోగ పడుతుంది. అందుచేత దీనిని “బీదవాని కలప” అని కూడా అంటారు. మన రాష్ట్రంలో ఖమ్మం, ఆదిలాబాదు జిల్లాల్లో విరివిగా పెంచుతున్నారు. కాకపోతే అటవీ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం వున్న ప్రదేశాల్లో ప్రకృతి సహజంగా విస్తరించివున్నాయి.
Also Read: Bamboo Farmer Success Story: ఎదురు లేని లాభం వెదురు సాగుతో సాధ్యం.!
రకాలు:
1. గట్టి వెదురు (డెంద్రోణాలమస్ స్టిక్టస్): ఈ వెదురులో గుల్ల ఉండదు.
2. మామూలు వెదురు (బాంబూస ఆరండినేసియ): వెదురులో గుల్ల వుంటుంది. వంకర లేకుండా నిటారుగా ఉండి తేలికగా ఉంటుంది. గుల్లగా ఉండటం వలన సన్నగా చీల్చి వివిధ పనులకు వినియోగిస్తారు.
వాతావరణం: వెదురు ఉష్ణమండలం మరియు సమశీతోష్ణ మండలాల్లోను పెరుగుతుంది. గాలిలో తేమ ఎక్కువగా గల పరిస్థితుల్లో బాగా పెరుగుతుంది. సముద్ర మట్టం నుండి 12000 మీ. ఎత్తు గల ప్రాంతాల్లో పెంచవచ్చు.
నేలలు: వెదురు అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. గరువు నేలలు శ్రేష్ఠం, చవుడు లేదా ఆమ్ల గుణాలు కలిగిన నేలలు పనికిరావు, ఉదజని సూచిక 6.5 నుండి 7.5 వరకు గల నేలలు అనుకూలం.
పెంచే ప్రదేశాలు: పంట భూముల్లో గట్ల చుట్టూ 4 మీ. ఎడంలో నాటవచ్చు. 5×5 మీ. ఎడంలో నాటి తోటగా కూడా పెంచవచ్చు.
వాటటం: 30X30X30 సెం.మీ గుంతలు తీసి, మట్టి, 4 కిలోల పశువుల ఎరువు కలిపి నింపాలి. ప్రతి గుంతలోను 50 గ్రాముల ఫాలిడాల్ 3 శాతం పొడిని చల్లాలి. తొలకరి వర్షాలకు నాటుకోవాలి. నీరు మొక్క మొదలుకు తగలకుండా మొక్క మొదట్లో మట్టి కొంచెం ఎత్తుగా వేయాలి.
వెదురు నరకటం: నాటిన 7 సంవత్సరాలకు వెదురును మొదటిసారి నరకవచ్చు. భూమట్టం నుండి 50-75 సెం.మీ మొదలు వదిలి వెదురు గడలను నరకాలి. నరికిన తర్వాత దుబ్బులు శుభ్రంగా బాగుచేయాలి.
సూచన: 7 సం.లకు ముందుగానీ లేదా చిగురు ఎండే ముందు గడలు నరకరాదు.
అంతరకృషి: వరుసల మధ్య ఒకటి రెండు సంవత్సరాలు దుక్కిచేసి మెట్ట పంటలు పండించవచ్చు. వెదురు ఒకేసారి పూతకొచ్చి, విత్తనాలనిచ్చి కుదురు చనిపోతుంది.
ఉపయోగాలు: గుడిశెల నిర్మాణానికి, తెప్పలుగా కట్టి చేపలు పట్టటానికి కంచె స్థంభాలుగా, నిచ్చెనలుగా, నడిచే కర్రగా కాగితపు పరిశ్రమలో ముడిపదార్థంగా మరియు పలు ఇతర మేదరి పనులకు వెదురును ఉపయోగిస్తారు. బుట్టల, ఆట బొమ్మల, పనిముట్ల మరియు గొట్టాల తయారీకి ఉపయోగపడుతుంది. లేత చిగుళ్ళను ఊరగాయగా కూడా నిల్వ చేస్తారు.
నర్సరీ పద్దతి: కిలో బరువుకు షుమారు 32,000 విత్తనాలు తూగుతాయి. విత్తనాలను డిసెంబరు, జనవరి నెలల్లో నారుమళ్ళలో వేసి మొలకెత్తిన తర్వాత 4 X 7 సంచుల్లో ఫిబ్రవరి నెలలో నాటాలి. నాటిన సంచి మొక్కలను నర్సరీలో జూన్ ఆఖరు వరకు పెంచి, జూలై నెల మొదటి వర్షాలకు నాటుకోవాలి. వెదురును నారు మొక్కలుగా కూడా పెంచి నాటవచ్చు.
నీటి యాజమాన్యం: ఎక్కువ వర్షపాత ప్రాంతాల్లో ఒక్కో కుదురుకు 20-25 గెడలు కూడా వస్తాయి. నీటి సౌకర్యం వున్నచోట్ల వేసవికాలంలో నెలకోసారి తడి ఇచ్చినట్లయితే దిగుబడి పెరుగుతుంది.
దిగుబడి – ఆదాయం: ఒక ఎకరంలో 150 కుదుళ్ళ వరకు ఉంటాయి. 7-8 వ సం. నుండి కుదురుకు సంవత్సరం విడచి సంవత్సరం 10 గెడల చొప్పున 1500 గెదలు వస్తాయి. గెడకు రూ.5 చొప్పున ఎకరానికి రూ. 7500/- ఆదాయం వస్తుంది. 20-25 సం. వరకు అధికంగా దిగుమతినిస్తాయి.
Also Read: Bamboo Cultivation: వెదురే బంగారమాయే.. ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం