దండగా అనుకున్న వ్యవసాయం పండుగలా మారింది. విదేశాల్లో పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఇప్పుడు వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రకృతి ధర్మాన్ని పాటించినప్పుడు మానవుడు సుఖంగా ఆనందంగానే జీవించాడు. ఎప్పుడైతే ప్రకృతిని మన అవసరాల కోసం దుర్వినియోగం చేయడం మొదలు పెట్టామో మానవ మనుగడ ఆరోజు నుంచి దిగజారడం ప్రారంభమైంది. అది గ్రహించిన కొందరు ఇప్పుడు రసాయన విధానాన్ని పక్కనపెట్టేసి సేద్యపు విధానాలవైపు అడుగులు వేస్తున్నారు. ప్రకృతి సేద్యపు విధానాలే జీవితంగా భావిస్తున్నారు.అన్నదాతలు పాత కాలం వ్యవసాయాన్ని మానుకొని నూతన పద్ధతులతో పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. క్షేత్రాల్లో ప్రధాన పంటతోపాటు, అంతర్ పంటలను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అంతర పంటల సాగుతో లాభాలు పొందవచ్చని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇది ఒక ఫార్మింగ్ రివాల్యూషన్ అని చెప్పుకోవచ్చు.
అంతర పంటల ప్రయోజనాలు : –
ప్రధాన పంట మధ్య వున్న స్థలం వృధా కాకుండా ఖాళీ స్థలంలో పండించే పంటనే అంతర పంట అంటారు. ఈ అంతర పంట వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అంతర పంట వేయడం వలన ఒక పంట దెబ్బతిన్నా మరో పంట ఎంతో కొంత దిగుబడి నిచ్చి రైతును కష్టకాలంలో ఆదుకుంటుంది. ఈ విధానం వల్ల అదనపు అదాయంతోపాటు, పెట్టుబడి ఖర్చులను తగ్గిస్తుంది. అంతేకాకుండా కీటకాలు ,తెగుళ్ళు,కలుపు మొక్కల బెడద కొంతవరకు తగ్గే అవకాశాలున్నాయి. ఈ విధానంలో చిరుధాన్యాలు,నూనె గింజలు,పప్పుధాన్యాలు మొదలైన పంటల ఉత్పత్తి పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల నేలకోత తగ్గుతుంది. భూమిలో పోషకాలు పెరిగే ఆవకాశం లేకపోలేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అంతర పంటలు సాగుచేసుకునేందుకు అనుకూలమని చెప్తున్నారు వ్యవసాయ నిపుణులు.
Also Read : ఉద్యాన పంటల్లో నవంబర్ మాసంలో చేపట్టవలసిన పనులు